ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సంచిలో పసిబిడ్డ.. పిల్లలను కాపాడి తల్లులు మృతి

By

Published : May 31, 2023, 8:46 PM IST

Child was put in a sack and thrown on road: నవమాసాలు మోసిన కన్న బిడ్డ బరువైంది. కారణమేంటో తెలియదు కానీ.. తల్లి వెచ్చని పొత్తిళ్లల్లో ఉండాల్సిన పసిగుడ్డు రోడ్డు పక్కన చెత్తకుప్పలో పడి ఉంది. ఈ హృదయవిదారక ఘటన ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో జరిగింది. అదే విధంగా నెల్లూరులో గుంతలో పడిన పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు బురదలో చిక్కుకుని మృతి చెందారు.

Child was put in a sack and thrown on road
పసిబిడ్డను సంచిలో చుట్టి పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. పిల్లలను కాపాడి తల్లులు మృతి

Child was put in a sack and thrown on road: పది నెలలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి.. కడుపుతీపి గుర్తుకు రాలేదేమో.. ముద్దులొలికే ఆ బాలుడిని వదిలి వెళ్లేందుకు. ఆ చిట్టి ప్రాణాన్ని భూమ్మీదకు తీసుకువచ్చేందుకు పడ్డ పురిటి నొప్పులు మరిచిపోయిందేమో.. పేగు బంధాన్ని వదిలిపెట్టేసింది. కష్టమే వచ్చిందో.. భారమని అనుకుందే ఆ మాతృమూర్తి చిరునవ్వులు చిందిస్తున్న పసికందును చెత్తకుప్పలో పడేశారు.. పాపం పసిపిల్లని జాలి కలగలేదు. ఏడవడం తప్ప ఏమీ తెలియని పసికందు అని దయ చూపించలేదు. తల్లిదండ్రులో.. గుర్తుతెలియని వ్యక్తులో తెలియదు. అప్పుడే పుట్టిన బిడ్డను చిన్నారిబాలుడిని గోనె సంచిలో చుట్టి పడేసిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో.. గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బిడ్డను గోనె సంచిలో చుట్టి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని చెత్తకుప్పలో పడేశారు. ఆ గోనె సంచిని అక్కడే ఉన్న పందులు ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలోకి ఈడ్చుకు వెళ్తుండగా అక్కడే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వోలు గమనించారు. వెంటనే గోనె సంచిలో చూడగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఉంది. ఆ బిడ్డను రక్షించి వెంటనే పోలీసులకు సమాచారంఇచ్చారు. అనంతరం ఆ బిడ్డను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పుడే పుట్టిన మగ బిడ్డను ఇలా గోనె సంచిలో పెట్టి పడవేయటం స్థానికంగా కలకలం రేపింది. సంబంధిత అధికారుల పర్యవేక్షణలో బిడ్డకు వైద్యం అందిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ పసిబిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బిడ్డను ఇక్కడ ఎవరు తెచ్చి పడేశారు అనే విషయాన్ని పోలీసులు విచారణ చేపట్టారు. వీఆర్వోలు చూసి బిడ్డను రక్షించకపోతే పందులు బిడ్డను చంపి తినేసేవి అని స్థానికులు అంటున్నారు.

పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు మృతి..గుంతలో పడిన పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు బురదలో చిక్కుకుని మృతి చెందిన హృదయ విదారకర ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. నగరంలోని భగత్ సింగ్ కాలనీలో పెన్నానది రివిట్‌మెంట్ వాల్ నిర్మాణం కోసం గుంత తవ్వారు.. అందులో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయారు.. వెంటనే వారిని రక్షించేందుకు పిల్లల తల్లులు షాహినా, షబీనా ఇద్దరు గుంతలోకి దూకారు.. పిల్లల్ని అయితే కాపాడారు కానీ వారు బురదలోనే చిక్కుకుని ప్రాణాలు వదిలారు.. అక్కడ గత కొంతకాలంగా రివీట్​మెంట్ వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు.. అయితే మూడు రోజులుగా నిర్మాణ పనులు ఆపారు.. గుంతలు వద్ద రక్షణగా ఎవరూ లేరని.. నిర్మాణంలో జాప్యం వల్లనే ప్రాణాలు కోల్పోయారంటూ స్థానికుల నిరసన తెలిపారు.

విషయం తెలుసుకున్న తెలుగుదేశం, సీపీఎం నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు. నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఎమ్మెల్యే అనిల్ చేసిన హత్యలేనని ఆరోపించిన ఆయన.. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం అందజేయాలని కోరారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details