ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొత్త వేరియంట్​పై ఆందోళన వద్దు.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: హరీశ్​రావు

By

Published : Dec 22, 2022, 10:33 PM IST

కరోనా కొత్త వేరియంట్​పై ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హరీశ్​రావు
HARISHRAO

కరోనా కొత్త వేరియంట్​ పట్ల ఆందోళన చెందవద్దని.. అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కొవిడ్ టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. ప్రజలు బూస్టర్ డోసు వేసుకోవాలని కోరారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కొవిడ్ సన్నద్ధతపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వివిధ విభాగాల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

వివిధ దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్ 7 వ్యాప్తి, దాని ప్రభావాన్ని అధికారులు మంత్రికి వివరించారు. శాఖ పరంగా కొవిడ్ సన్నద్ధతను హరీశ్​రావు సమీక్షించారు. కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశంతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరోనాను విజయవంతంగా ఎదుర్కొని.. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.

కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్నింటినీ పరిశీలించుకోవాలని.. మానవ వనరులు, ఔషధాలు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు, తదితరాలను పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలని.. విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించాలని మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details