ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బీ అలర్ట్ - తీరం వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను - భారీగా కురుస్తున్న వర్షాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 10:49 AM IST

Cyclone Michaung News Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడనుందని వాతావరణ విభాగం తెలిపింది. ఈనెల 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని సూచించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 80-100 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

Cyclone_Michaung_News_Updates
Cyclone_Michaung_News_Updates

Cyclone Michaung News Updates: బీ అలర్ట్ - తీరం వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను - హెచ్చరికలు జారీ

Cyclone Michaung News Updates: తీరం వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను కోస్తా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ అర్థరాత్రికి తుపానుగా మారే అవకాశం ఉంది. నెల్లూరుకు ఆగ్నేయంగా 630 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 710 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి సోమవారం మధ్యాహ్నానికి దక్షిణ కోస్తాంధ్ర -దక్షిణ తమిళనాడు తీరాలకు చేరువగా రానుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.

ఈనెల 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో గరిష్ఠంగా 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ విభాగం హెచ్చరించింది. తుపాను హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వాహణ సంస్థ హెచ్చరికలు జారీచేశారు.

దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను - నెల్లూరు, మచిలీపట్నం తీరాల్లో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

CM Jagan Review on Cyclone:తుపాన్ హెచ్చరికలు నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ అధికారులు సమీక్షించారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి,కోనసీమ కాకినాడ జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అన్నిశాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎల్లుండి మధ్యాహ్నంలోపు దివిసీమ వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో 1.5 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి.

ముంచుకొస్తున్న మిచాంగ్​ తుఫాను​ - నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం

హెచ్చరికలు జారీ: తుపాను కారణంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో సోమవారం, మంగళవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

రైళ్లు రద్దు: తుపాను ప్రభావంతో రేణిగుంట విమానాశ్రయం నుంచి శనివారం పలు విమానాలను రద్దు చేయగా మరికొన్ని ఆలస్యమయ్యాయి. తుపాను నేపథ్యంలో. తొలి జాబితాలో 142 రైళ్లు, రెండో జాబితాలో మరో 10 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం వేర్వేరుగా ప్రకటనల్లో తెలిపింది. కొన్నింటిని ఒకట్రెండు రోజులు, మరికొన్నింటిని మూడు రోజులపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మూడ్రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.

భారీగా కురుస్తున్న వర్షాలు: తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కుండపోత వర్షంతో నెల్లూరు జలమయం అయింది. గాంధీ బొమ్మ సెంటర్, సండే మార్కెట్, పొగతోట ప్రాంతాల్లో రోడ్లమీద వర్షపు నీరు ప్రవహిస్తుంది. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిలో నీటి ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పొంచి ఉన్న తుపాను ముప్పు - వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

ABOUT THE AUTHOR

...view details