ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Water Problems: సకాలంలో సాగునీరు అందక నీరుగారిన మిర్చి పంట

By

Published : Jun 3, 2023, 9:46 PM IST

Water Problem: పల్నాడు జిల్లాలోని సాగర్‌ చివరి ఆయకట్టు భూములకు నీరు అందకపోవడంతో.. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సమయంలో పంటకు నీరందక.. దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

Water Problem In Palnadu District: అంగడిలో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది పల్నాడు జిల్లా మిర్చి రైతుల పరిస్థితి. పంట సాగు చేసి, పెట్టుబడి పెట్టి శ్రమిస్తే.. సకాలంలో పంటకు సాగు నీరు అందక రైతులు తక్కువ దిగుబడి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ చివరి భూములకు సాగునీరు చేరడం లేదు. మిర్చి పంటకు చివరి దశలో నీటి తడులు అందకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడుతోంది. ఎకరాకు 5, 6 క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గిపోతోంది. పిచ్చిమొక్కలు, తూటుకాడలు పెరిగి.. దార తెన్నూలేని కాలువలు వల్లే శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.

పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 26వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. చీడపీడలకు తోడు సకాలంలో సాగునీరు అందక పంటల దిగుబడిపై ప్రభావం పడింది. ప్రధానంగా మిర్చి ఉత్పత్తి ఎకరాకు 4, 5 క్వింటాళ్ల వరకు తగ్గిపోయింది. పూత, పిందె దశలో సక్రమంగా నీరు అందలేదు. కాయ పెరగాల్సిన దశలోనే సాగునీరు సరిగ్గా అందకపోవడంతో కాయల ఎదుగుదల లోపించింది. ప్రధానంగా సాగర్ మైనర్ కాల్వల నిర్వహణ సరిగ్గా లేకపోవడం అనేది రైతులకు శాపంగా మారింది. పిచ్చిమొక్కలు, చెట్లు, తూటుకాడలతో కాల్వలు మూసుకుపోయాయి. ఎగువ నుంచి సాగునీరు రావడమే గగనం అనుకుంటున్న పరిస్థితుల్లో కాల్వలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో శివారు భూములకు సాగునీరు చేరలేదు.

అమరావతి మేజర్ కాల్వ పరిధిలోని పెదకూరపాడు, జలాల్ పురం, అబ్బరాజుపాలెం, బుచ్చయ్యపాలెం వంటి గ్రామాల రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా చీడపీడల మూలంగా మిర్చిరైతులు దారుణంగా దెబ్బతిన్నారు. ఎకరా పంటపై 2 నుంచి 3 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెడుతుండగా.. పెట్టుబడి సొమ్ము సైతం తిరిగిరాని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది చీడపీడల ఉద్ధృతి తగ్గినప్పటికీ సకాలంలో, సక్రమంగా సాగునీరందక రైతులు దిగాలు పడ్డారు.

కొందరు మిర్చి ఆఖరి కోత దశలో ఉండగా.. మరికొందరు మూడో కోత దశలో ఉన్నారు. ఇలాంటి వారందరిపైనా దిగుబడి ప్రభావం చూపింది. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 15 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సుమారుగా 2 లక్షల వరకు రైతులకు అందాల్సిన పంట చేతికి రాకుండా పోయింది. నాలుగేళ్లుగా మైనర్ పరిధిలో కాల్వల మరమ్మతులు సక్రమంగా జరగకపోవడంతో రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధరలు రాని పరిస్థితులు ఓవైపు ఉండగా.. సాగునీరు సక్రమంగా చేరని పరిస్థితులతో రైతులు రెండు విధాలా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మైనర్ కాల్వల నిర్వహణపై దృష్టి తగిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details