ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం కుంభకోణం.. వైసీపీ నేతల అరెస్టులు.. ఆందోళనలో పార్టీ శ్రేణులు

By

Published : Feb 12, 2023, 6:58 AM IST

Updated : Feb 12, 2023, 8:32 AM IST

Delhi Liquor Scam : దిల్లీ మద్యం కుంభకోణం సెగ వైసీపీకి బలంగా తగులుతోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్టైన శరత్‌చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్‌ వైసీపీ కీలక నేతల కుటుంబ సభ్యులే కావడం.. ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అరెస్ట్‌లతో రాజకీయంగా ఎదురుకానున్న విమర్శల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై వైసీపీ అధినాయకత్వం తీవ్రంగా అంతర్మథనం చెందుతోందని సమాచారం.

ysrcp leaders arrest
దిల్లీ మద్యంకుంభకోణంలో వైసీపీ

మద్యం కుంభకోణం.. వైసీపీ నేతల అరెస్టులు.. ఆందోళనలో పార్టీ శ్రేణులు

YSRCP Leaders arrested : దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తులుగా పేర్కొంటూ.. ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలూ వైసీపీ నేతల కుటుంబసభ్యులే. మొదట అరెస్టై పెనక శరత్‌చంద్రారెడ్డి అరబిందో గ్రూప్‌ డైరెక్టర్లలో ఒకరు. ఆయన వైసీపీలో నం.2గా చలామణీ అవుతూ.. ఆ పార్టీ తరఫున దిల్లీలోనూ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సొంత అన్న. ఆ కేసులో ఈడీ శనివారం అరెస్టు చేసిన రాఘవ్‌ మాగుంట.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న.. మద్యం కుంభకోణం కేసులో శరత్‌చంద్రారెడ్డి, రాఘవరెడ్డి అరెస్టు అవడం.. వైసీపీ అధినాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

సాధారణ ఎన్నికలకు.. ఏడాదే ఉండటం, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కిన తరుణంలో.. వైసీపీ కీలక నేతల కుటుంబసభ్యులు భారీ కుంభకోణం కేసులో అరెస్టవడంతో.. ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా దాడిచేసేందుకు అస్త్రాలు ఇచ్చినట్లయిందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసుల్లోనూ.. శరత్‌ నిందితుడు. హెటిరో, అరబిందోలకు భూ కేటాయింపుల కేసులో సీబీఐ దాఖలు చేసిన మొదటి అభియోగపత్రంలో శరత్‌ను ఎనిమిదో నిందితుడిగా పేర్కొన్నారు.

అరబిందోకు కేటాయించిన 30.33 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా అనుబంధ కంపెనీ అంటూ.. శరత్‌ డైరెక్టర్‌గా ఉన్న ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు బదలాయించిన వ్యవహారంపై.. సీబీఐ కేసు నమోదుచేసింది. భూమిని బదలాయించినందుకు ప్రతిఫలంగా ట్రైడెంట్‌ లైఫ్‌సైన్సెస్‌.. జగతి పబ్లికేషన్స్‌లో 7 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు సీబీఐ పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ నమోదు చేసిన మరో కేసులోనూ శరత్‌ 12వ నిందితుడిగా ఉన్నారు. మరోవైపు మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబ వ్యాపారాలన్నింటినీ ఆయన కుమారుడు రాఘవే చూస్తున్నారు. వచ్చేఎన్నికల్లో తన కుమారుడే పోటీ చేస్తారని శ్రీనివాసులురెడ్డి ఇది వరకే ప్రకటించారు. ఇప్పుడు రాఘవ రెడ్డి అరెస్టవడం శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి రాజకీయంగానూ పెద్ద దెబ్బేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 12, 2023, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details