ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతు భరోసాపై ఆది నుంచి మడతపేచీలే.. సంక్రాంతి పోయినా దక్కని భరోసా!

By

Published : Jan 31, 2023, 7:08 AM IST

Updated : Jan 31, 2023, 7:24 AM IST

Pradhan Mantri Kisan Samman Nidhi

YSR Rythu Bharosa Scheme Funds: విత్తు వేయడానికి ముందు నుంచే రైతులకు ఆర్థికంగా అండగా ఉంటామని ఇచ్చిన భరోసా పోతోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం అమలులో అనేక మడత పేచీలు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు సమయానికి ఇస్తామన్న నిధులు ఇవ్వడంలోనూ విఫలమైంది. సంక్రాంతికి రావాల్సిన 2వేల రూపాయలు పండుగ పోయి వారం రోజులైనా ఎప్పుడొస్తాయా అని ఎదురుచూడాల్సి వస్తోంది.

YSR Rythu Bharosa Scheme Funds: ఇది 2019 అక్టోబరు 15న నెల్లూరులో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటలు. ఏటా సంక్రాంతి పండుగకు ముందే రైతు భరోసా కింద 2వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ ఈ ఏడాది ఇంకా బటన్‌ నొక్కలేదు. పండగ పోయి పదిరోజులైనా 11వందల కోట్లకుపైగా నిధుల్ని విడుదల చేయలేదు. ఎప్పుడు తమ ఖాతాల్లో నిధులు జమ అవుతాయా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్లలో 50వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక దానిని మరింత పెంచి 67వేల500 ఇస్తామని నమ్మబలికారు. ఐతే తొలి ఏడాది నుంచే పథకం అమలులో మడత పేచీలు పెడుతున్నారు. ఏటా విత్తనం వేయడానికి ముందే ఒక్కో రైతుకు 12వేల 500 ఇస్తామని చెప్పి చివరకు 3 విడతల్లో 7వేల 500 రూపాయలు ఇచ్చి సరిపెడుతున్నారు. అప్పటికే అమల్లో ఉన్న పీఎం కిసాన్‌తో కలిపి 13వేల500 రూపాయలు ఇస్తామని గొప్పగా చెబుతున్నారు.

రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కుటుంబాలకు ఏడాదికి 8వేల750 కోట్లను అందిస్తామని 2019 జులై 12న అసెంబ్లీలో చెప్పిన జగన్‌.. దాని అమల్లోనూ మడమ తిప్పారు. రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య గత మూడేళ్లలో ఎప్పుడూ 53 లక్షలకు మించలేదు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చింది 11వేల 661 కోట్ల రూపాయలే. అందులో 3వేల 108 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నుంచే ఖర్చు చేశారు. మూడేళ్లలో రైతులకు ఇచ్చిన మొత్తం నిధుల్లో కేంద్రం వాటా 42% ఉంది.

ప్రతి రైతు కుటుంబానికి పంట పెట్టుబడి కోసం 50వేల రూపాయలిస్తామని ముఖ్యమంత్రి చెప్పినా రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చేది 37వేల 500 రూపాయలు మాత్రమే. పీఎం కిసాన్‌ కింద విడతకు 2వేల రూపాయల చొప్పున మూడు దఫాలుగా ఇచ్చే 6వేల రూపాయలను తమ ఖాతాలో కలిపేసి ఏడాదికి 13వేల 500 రూపాయలిస్తామని గొప్పగా చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 13వేల500 రూపాయలను రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చేది కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు మాత్రమే. రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద మొత్తం లబ్ధి పొందే రైతులు ఏడాదికి సగటున 52 లక్షల మంది ఉండగా అందులో కౌలు రైతులు, అటవీ భూమి సాగుదారుల సంఖ్య లక్షా 80వేల లోపే. మొత్తం లబ్ధిదారుల్లో 3.46% మాత్రమే. వారికీ ఒకే దఫా సొమ్ము చెల్లించే పరిస్థితి లేదు.

ఏటా 16 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పినా తొలి మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా అందుకున్నవారు 2 లక్షల 68 వేల మందే. అంటే సగటున ఏడాదికి లక్ష మందైనా లేరు. మొత్తం కౌలుదారుల్లో సుమారు 6శాతం మందికే సాయం దక్కుతోంది.

ఎన్నికల సమయంలో కౌలు రైతులందరినీ ఆదుకుంటామని చెప్పిన జగన్‌ అధికారం చేపట్టాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికే రైతు భరోసా ఇస్తామన్నారు. వారందరికీ పూర్తిగా అందడం లేదు. కౌలు కార్డులు లేవంటూ 90శాతం మందికిపైగా మొండి చేయి చూపిస్తున్నారు.

సంక్రాతి పోయినా దక్కని భరోసా!

ఇవీ చదవండి

Last Updated :Jan 31, 2023, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details