ETV Bharat / state

తిరుమల కొండపై వైఎస్సార్సీపీ నేతల దందా - పవిత్రత గోవిందా - YSRCP Anarchists in Tirumala

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 8:19 AM IST

ysrcp leaders domination
ysrcp leaders domination

YSRCP Anarchists in Tirumala : ఏడుకొండలపై కొలువైన గోవిందుడు అందరివాడు! కానీ, వైఎస్సార్సీపీ పాలకులు ఆ స్వామివారిని కొందరికే దగ్గర చేశారు! టీటీడీ పాలక మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. వీఐపీ కోటా దర్శన టికెట్లను బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకున్నారు! ప్రొటోకాల్‌ దర్శనాల పేరుతో మంత్రులు, వైఎస్సార్సీపీ ముఖ్యనాయకులు మందను వెంటేసుకువెళ్లి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని దుర్లభంగా మార్చేశారు. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దల వ్యాపార, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకునే అడ్డాగా మార్చుకున్నారు.

తిరుమల కొండపై వైఎస్సార్సీపీ దందా! - పవిత్రత గోవిందా!

YSRCP Anarchists in Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడ నుంచో వస్తున్న సామాన్య భక్తులకు చేదు అభనుభవం ఎదురవుతోంది. ఎలాంటి టికెట్‌ లేకుండా తిరుమల కొండపైకి వస్తే సామాన్యులు కష్టాలు పడాల్సిందే. పోనీ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే మళ్లీ 3 నెలల వరకూ అవకాశం ఉండదు. కానీ, వైఎస్సార్సీపీ నాయకులు తలచుకుంటే చాలు, తిరుమలకు డైలీ సర్వీస్‌ కూడా చేయొచ్చు. ఐదేళ్లుగా కొండపై వాళ్ల రుబాబు అంతా ఇంతా కాదు. టీటీడీ ఛైర్మన్‌తో పాటు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎన్ని దర్శన టిక్కెట్లు కోరితే అన్నీ ఇవ్వాల్సిందే. మార్చి నెలలో ఒక రోజు 72,299 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే అందులో ఛైర్మన్‌ సిఫారసుతో ఇచ్చిన టిక్కెట్లే వెయ్యి ఉన్నాయి. ఇక కొండపై మంత్రుల మెహర్భానీ మామూలుగా లేదు.

తిరుమలకు వెళ్లేందుకు పోటీ పడిన వైఎస్సార్సీపీ నేతలు : 2019 జూన్‌ నుంచి 2024 ఫిబ్రవరి 29 వరకూ తిరుమల స్వామివారిని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అత్యధికంగా 23సార్లు దర్శించుకున్నారు. మంత్రి రోజా 19సార్లు, చెల్లుబోయిన గోపాలకృష్ణ 16సార్లు, తిరుపతి ఎంపీ గురుమూర్తి 14సార్లు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ 13సార్లు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 12సార్లు, ఎమ్మెల్సీ భరత్‌ 11 సార్లు , మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి 9సార్లు వెంకన్నను దర్శించుకున్నారు. మంత్రి రోజా ఎప్పుడు దర్శనానికి వెళ్లినా వెంట కనీసం పాతిక ముప్పై మంది ఉంటారు.

YSRCP Leaders Visits Tirumala Tirupati Devasthanam : కరోనా నియంత్రణలు కొనసాగుతున్న సమయంలోనూ అప్పటి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఏకంగా 67 మందిని వెంటేసుకెళ్లారు. ఇక నారాయణస్వామైతే ఆయన అనుచరగణానికి దర్శనాలతోపాటు అతిథి గృహంలో భోజనాలు పెట్టించాలని టీటీడీ అధికారుల్నే డిమాండ్‌ చేశారు. మంత్రి స్వయంగా వస్తే ఆయన వెంట 20 మంది వరకు ప్రొటోకాల్‌ దర్శనాలకు అనుమతి ఉంటుంది. దీన్ని బాగా వాడుకున్న కొందరు మంత్రులు ఎన్నికల ముందు రోజుల తరబడి కొండపైనే తిష్టవేసి, రోజుకి కొందరు చొప్పున అనుచరులు, మద్దతుదారుల్ని దర్శనాలకు తీసుకెళ్లారు. మార్చిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 3రోజుల పాటు కొండపై ఉండి ప్రతి రోజూ మందీమార్బలంతో దర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత కొండపై రాజకీయ విమర్శలు చేసి, తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైసీపీ నేతలకు లెక్కే లేదు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వివాదాలు - ఆజ్యం పోస్తున్న బోర్డు

రాష్ట్రంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, పలుకుబడి పెంచుకోవడానికి, కోర్టు కేసుల నుంచిఉపశమనానికి, డబ్బులుసంపాదించడానికి తిరుమల క్షేత్రాన్ని వైసీపీ పెద్దలు కేంద్రంగా మార్చుకున్నారు. దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న శరత్‌ చంద్రారెడ్డి వంటి కొందరిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారు. ఇక వైఎస్ కుటుంబానికి ఆత్మబంధువుగా పేరున్న వ్యక్తిని టీటీడీకి సర్వాధికారిగా నియమించారు. టీటీడీ ఈవోగా ముఖ్య కార్యదర్శి హోదాకి తగ్గని సీనియర్‌ అధికారిని నియమించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. దానికి మంగళం పలికిన జగన్‌ ఒక నాన్‌ ఐఏఎస్‌ అధికారిని జగన్‌ ఆ పోస్టులో కూర్చోబెట్టారు. రాష్ట్రంలో సీనియర్‌ ఐఏఎస్‌లే లేరన్నట్టు దిల్లీ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి టీటీడీలో కూర్చోబెట్టారు. టీటీడీ ఉన్నతాధికారిగా ఆయన శ్రీవారికి చేసిన సేవకంటే జగన్‌ సేవలోనే ఎక్కువ తరించారు! పేరుకి అధికారైనా జగన్‌ ప్రయోజనాలు కాపాడడమే ఆ అధికారి జెండా, అజెండా! స్వామివారి దర్శనానికి వచ్చే వివిధ రంగాల ప్రముఖులకు సర్వోపచారాలు చేయడం, వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడం, జగన్‌పై కేసుల వంటి వ్యవహారాల్లో రక్షణ కల్పించడం ప్రధాన అజెండాగా చెప్తారు. జగన్‌ తరపున దిల్లీలో లాబీయింగ్‌ చేయడంలో ఆయన దిట్ట. 2019 ఎన్నికలకు ముందు తనను కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు జగన్‌ ఆదేశాల మేరకు ఆ అధికారే తీసుకెళ్లారని వివేకా కుమార్తె సునీత చెప్పడాన్నిబట్టే వైసీపీ విపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచీ జగన్‌ కోటరీలో ఆయన ఎంత కీలక వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు.

కొండపై ఆ అధికారి చెప్పిందే వేదం! చేసిందే శాసనం: అర్చకులు సహా ప్రతి ఒక్కరికీ ఆయనంటే హడల్‌. నోరు తెరిచి మాట్లాడాలంటేనే వణికిపోతారు. చివరకు టీటీడీ ఛైర్మన్‌ కూడా ఆయన చెప్పినట్టు నడచుకోవాల్సిందే! జగన్‌ అండతో మొత్తం వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. దానికి దక్షిణగా ప్రభుత్వ పెద్దలకు ‘ఉపయోగపడే’ హైప్రొఫైల్‌ అతిథులు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా దగ్గరుండి దర్శనాలు చేయిస్తారు. వారు బస చేసిన అతిథి గృహాలకు వెళ్లి మాట కలుపుతారు. ప్రభుత్వ పెద్దలకు ఏం కావాలో వారి చెవిలో వేసి, పనులు సాధించి పెడతారని చెప్తుంటారు. ఒక న్యాయమూర్తి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు అత్యంత ఖరీదైన వాచీల్ని బహుమతులుగా తీసుకెళ్లారనే ఆరోపణలూ ఉన్నాయి. వైసీపీకు ఎన్నికల్లో నిధుల సమీకరణ వ్యవహారాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. అందుకే ఆ అధికారిపై జగన్‌ ఈగ వాలనివ్వరు. ఆయన లేకపోతే తిరుమల అస్తవ్యస్తం అయిపోతుందంటూ జగన్‌ స్వయంగా కేంద్ర రక్షణమంత్రికి లేఖ రాశారు. మే 15తో ముగిసే డిప్యుటేషన్‌ గడువును పదవీ విరమణ చేసే వరకూ పొడిగింపు తెచ్చుకున్నారు. వారిద్దరిది మధ్య పటిష్ఠ బంధానికి ఇదే నిదర్శనం.

అమిత్ షాకు రామచంద్రయాదవ్ లేఖ - టీటీడీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు విజ్ఞప్తి

కొండపై పెత్తనమంతా సీఎం వర్గీయులదే : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు తిరుమలను ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా గడచిన ఐదేళ్లూ సొంత సామ్రాజ్యంగా మార్చేసుకున్నారు. కొండపై పెత్తనమంతా సీఎం సొంత సామాజిక వర్గీయులదే. రెండు దఫాలు జగన్‌ సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉంటే, ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ ఆ పదవిని నిర్వహించిన ఆ నాయకుడు టీటీడీని రాజకీయాలకు అడ్డగోలుగా వాడేసుకున్నారు. కొండపైన, కింద ఆయన అనుచరులదే హవా. ప్రొటోకాల్‌ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటూ, వీఐపీ భక్తులకు సకల సౌకర్యాల సమకూర్చి వసూళ్లు చేసుకుంటారనే ఆరోపణలున్నాయి. కొండపై టోపీలు, ఇతర వస్తువులు విక్రయించే స్టాల్స్‌కు బోర్డు అనుమతితో పనిలేకుండా ఆ నాయకుడి అనుచరులు అనధికారిక స్టాల్స్‌ ఏర్పాటు చేయించారు.

ఒక్కొక్కరి వద్ద 3నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేయడమేకాదు, ప్రతినెలా వారి నుంచి అద్దెలు దండుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఆ ముఖ్య నాయకుడు బాధ్యతలు చేపట్టిన ఒకటి రెండు నెలల్లోనే తిరుపతి రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో నిక్షేపంగా ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్ని ఆగమేఘాల మీద కూలగొట్టారు. డిజైన్లు ప్లాన్‌లు లేకుండానే వాటి నిర్మాణానికి 460 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి 2023 నవంబరులో గుత్తేదారులతో ఒప్పందాలు చేసేశారు. కీలక బాధ్యతల్లోకి వచ్చినప్పటి నుంచీ నుంచీ టీటీడీ నిధుల్ని మంచి నీళ్లలా ఖర్చు పెట్టేస్తున్నారు.

ఇప్పటి వరకు సుమారు వెయ్యి నుంచి 1,500 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచి ఉంటారని అంచనా. ఐతే ప్రతి పనిలోనూ 10 శాతం కమీషన్లు నేరుగా పెద్దలకు ముడతాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో సగటున రెండు నెలలకోసారి బోర్డు సమావేశాలు జరిగేవి. ఆయన బాధ్యతలు చేపట్టాక సగటున నెలకో బోర్డు మీటింగ్‌ పెట్టారు. వారికి కావలసిన పనుల్ని చివరి నిమిషంలో టేబుల్‌ అజెండాగా పెట్టి ఆమోదింప జేసుకుంటారు. బోర్డు సభ్యులంతా అస్మదీయులే కాబట్టి ఎవరూ కిక్కురుమనరు. భక్తులకు కల్పించే సౌకర్యాల గురించి విలేఖరుల సమావేశంలో చెప్పి బోర్డులో తీసుకున్న ఇతర నిర్ణయాలను గోప్యంగా ఉంచుతారు. బోర్డు తీర్మానాల్ని వెబ్‌సైట్‌లోన పెట్టడంలేదు. 1993 మే 10 నుంచి 2023 జూన్‌ వరకూ జరిగిన బోర్డు తీర్మానాలు మాత్రమే ప్రస్తుతం వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

ధరల పెంపు : ధనవంతుల సేవలో తరిస్తున్న టీటీడీ పెద్దలు సామాన్య భక్తుల్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. 25 రూపాయలుగా ఉన్న లడ్డూ ప్రసాదం ధరను 50 రూపాయలకు పెంచేశారు. అలిపిరి నడకమార్గంలో దివ్యదర్శనం టోకెన్ల వ్యవస్థను రద్దు చేశారు. ప్రైవేటు హోటళ్లతో పోటీ పడేలా వసతి గృహాల అద్దెలు పెంచేశారు. కౌస్తుభం, పాంచజన్యం, నందకం వసతి గృహాల్లో 500 నుంచి 600 రూపాయలుగా ఉన్న అద్దెను వెయ్యి రూపాయలకు పెంచారు. ఏసీ గదుల అద్దెను 1,500 రూపాయలకు పెంచారు. ఆధునికీకరించామనే సాకుతో నారాయణగిరి రెస్ట్‌హౌస్‌ అద్దెను ఏకంగా 150 రూపాయల నుంచి ఒక్కసారిగా 1,700కి పెంచారు. సాధారణ భక్తుల కోసం కొత్తగా కాటేజీలు నిర్మించడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన గెస్ట్‌హౌస్‌లు పాతబడితే, మళ్లీ వేలంలో ప్రైవేటు వ్యక్తులకే కేటాయిస్తూ అక్కడ ఏడు నక్షత్రాల హోటళ్లను తలదన్నే స్థాయిలో కాటేజీలు నిర్మిస్తున్నారు. ఒక్కో కాటేజీలో 12 గదులు మాత్రమే కడుతున్నారు. వాటి స్థానంలో సామాన్య భక్తులకు కాటేజీలు నిర్మిస్తే కొన్ని వందల మందికి వసతి సదుపాయం కల్పించవచ్చు.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ విధానాల్లో చాలా వరకూ పారదర్శకతకు పాతరేశారు. శ్రీవాణి ట్రస్ట్‌ పేరుతో ఒక్కొక్కటి 10 వేల 500 రూపాయల చొప్పున రోజూ వెయ్యి టిక్కెట్‌లు విక్రయిస్తున్నారు. దానిలో రూ.10 వేలు ట్రస్ట్‌కి వెళుతుంది. అంటే, రోజూ ట్రస్ట్‌కి కోటి రూపాయలు జమవుతోంది. ఐతే శ్రీవాణి ట్రస్ట్‌ ఛైర్మన్‌ ఎవరు? సభ్యులు ఎవరు? ట్రస్ట్‌ బైలాస్‌ ఏంటనే వివరాలన్నీ రహస్యమే! శ్రీవాణి ట్రస్ట్‌ నిధులను దేవాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్నామని చెప్పి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలులు సూచించిన గ్రామాల్లోనే గుడులు కడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఐతే ఆ కట్టే గుడుల్లో దీపధూప నైవేద్యాలకయ్యే ఖర్చు మాటేంటనే ప్రశ్నకు సమాధానమిచ్చేవారే లేరు.

ఈ ఐదేళ్లలో వెంకన్న భక్తుల విశ్వాసాల్ని, తిరుమల సంప్రదాయాల్ని వైసీపీ నేతలు దెబ్బతీసేలా అనేక చర్యలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కసారి కూడా సతీసమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లలేదు. బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాల్నీ ఒంటరిగానే సమర్పించారు. అది శాస్త్రవిరుద్ధమని పండితులు మొత్తుకుంటున్నా ఆయన పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ తిరుమల విషయంలో వైసీపీది వక్రబుద్ధే! రమణ దీక్షితుల్ని పావుగా వాడుకుని శ్రీవారి ‘పింక్‌ డైమండ్‌’ కొట్టేశారని, స్వామివారికి అన్న ప్రసాదాలు సిద్ధం చేసే వకుళమాత పోటులో తవ్వకాలు జరిపి, అక్కడున్న ననగల్ని తరలించుకుపోయారని తీవ్ర ఆరోపణలు చేయించారు. వాటన్నింటికీ చంద్రబాబే కారణమని నానా యాగీ చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రమణ దీక్షితుల్ని కరివేపాకులా తీసి పడేశారు. ఇలా వైకాపా పెద్దలు అధ్యాత్మిక క్షేత్రంలో అంతులేని అరాచకాలకు తెగించారు.

'వడ్డికాసుల' వాడికి ఏటా రూ.1600 కోట్ల వడ్డీ ఆదాయం - ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో? - Highest Earning Temple

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.