ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్దమే.. : బీజేపీ నేత నల్లారి

By

Published : Apr 12, 2023, 9:00 PM IST

Nallari Kiran Kumar Reddy: కాంగ్రెస్‌ అధిష్ఠానం అస్తవ్యస్త నిర్ణయాలతోనే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినట్లు బీజేపీ నేత నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పినా... వదులుకున్నట్లు వివరించారు. ప్రజలకు మేలు చేయవచ్చనే నమ్మకంతో‌నే బీజేపీలో చేరానన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఏ ప్రాంతం నుంచైనా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Nallari Kiran Kumar Reddy
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

Nallari Kiran Kumar Reddy: తొలిసారిగా విజయవాడ వచ్చిన సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి బీజేపీ నేతలు, కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురేందేశ్వరి, కార్యదర్శి సత్యకుమార్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవదర్ తదితరులు... కిరణ్‌కుమార్‌రెడ్డికి సాదర ఆహ్వానం పలికారు.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

పదవులు ఆశించి తాను పార్టీలో చేరలేదని, పార్టీ కోసం మాత్రమే చేరానని నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఏ పని అప్పగిస్తే దాన్ని నూటికి నూరు శాతం నిర్వహిస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తాను మళ్లీ ఆ పార్టీలో చేరినా... అక్కడి పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉండడం వల్లే బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పిన మాట వాస్తవమేనని.. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఇటీవల బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి విజయవాడ వచ్చారు.

తాను హైదరాబాద్‌లో పుట్టానని, హైదరాబాద్‌లోనే చదివానని... బెంగళూరులోనూ తనకు సొంత ఇల్లు ఉందని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తొలుత తాను భారతీయుడిని అని... బీజేపీ ప్రాథమిక సభ్యత్వం‌ కోసం చేరానని కిరణ్​కుమార్​రెడ్డి వెల్లడించారు. కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయనే ధీమాను వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలుగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. దీనిపై త్వరలో పూర్తిస్థాయిలో మాట్లాడతానన్నారు. రాష్ట్ర విభజన చేయడం వల్ల ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పానని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలు పని చేయవని, ఓటమి తప్పదని కూడా తాను అప్పట్లో వివరించానని అన్నారు. ఏ ప్రభుత్వం అయినా చట్ట పరిధిలో పని‌చేయాలని వెల్లడించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి దాడులు జరిగాయా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వం లేదని, కార్పొరేట్ లిమిటెడ్‌ కంపెనీలుగా మాత్రమే ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

విశాఖ ఉక్కు విషయంలో జాతీయ విధానాన్నే అమలు చేశారని, నష్టం వచ్చే పరిశ్రమలు నడిపితే ప్రజా ధనం వృథా అవుతుందని కిరణ్​కుమార్​రెడ్డి వెల్లడించారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ విషయంలో సెంటిమెంట్ ఉందని, అందుకే దానిని లాాభాల్లోకి ఎలా తేవాలనేది కూడా ఆలోచిస్తున్నారన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన సోదరుడు టీడీపీలో చేరిన నాటి నుంచి అతని ఇంటికి వెళ్లలేదని... ఎవరి రాజకీయ జీవితం వారిష్టమన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర అభివృద్ధికి అవసరం కానీ ప్రత్యామ్నాయంగా నాడు స్పెషల్ ప్యాకేజీ కి అంతా అంగీకరించారని చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details