ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెట్రో ధరల్లో ఏపీదే అగ్రస్థానం: అమ్మకాలు తగ్గుతున్నా.. ఆదాయం పెరుగుతూనే ఉంది!

By

Published : Feb 5, 2023, 7:25 AM IST

Updated : Feb 5, 2023, 8:31 AM IST

High Fuel Prices : బాదుడే బాదుడంటే ఎలా ఉంటుందో పెట్రోలు ధరల విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సరకులు అమ్ముకునే చిరు వ్యాపారుల నుంచి సరకు రవాణా వాహనాల యజమానుల వరకూ.. అన్ని వర్గాల ప్రజల నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వ బాదుడు భరించలేక వాహనదారులు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. లారీ, ట్రాక్టర్ల యాజమానులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడే ట్యాంకు నిండా ఇంధనం భర్తీ చేయించుకుంటున్నారు. కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల వారైతే తమకు దగ్గరలోని పుదుచ్చేరి, కర్ణాటకల్లోని బంకులకు వెళ్లి పెట్రోలు కొంటున్నారు.

Etv Bharat
Etv Bharat

Fuel Prices in Andhra Pradesh : పెట్రో అమ్మకాలు తగ్గినా ఆదాయం ఎలా పెంచుకోవాలో, పన్నులను మోపుతూ ప్రజల నుంచి ఎంత మేర పిండుకోవాలో జగన్‌ ప్రభుత్వం నుంచి నేర్చుకోవచ్చేమో అన్నంతగా జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరల్లో రాష్ట్రం, దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరితో పోలిస్తే ప్రతి లీటరుకు పెట్రోలుపై 15రూపాయల 71పైసలు, డీజిల్‌పై 13రూపాయల 28పైసలు చొప్పున తేడా ఉంది. అమరావతితో పోలిస్తే బెంగళూరులో లీటరు పెట్రోలు 9 రూపాయల 93పైసలు, డీజిల్‌ 12రూపాయల 02పైసలు తక్కువకే లభిస్తోంది.

ఏపీలో పెట్రోలు, డీజిల్‌పై బాదుడును భరించలేక వాహనదారులు పక్క రాష్ట్రాలకు పోతున్నారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6నెలల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాల వృద్ధి గణనీయంగా నమోదైంది. కర్ణాటకలో డీజిల్‌పై 71.24%, పుదుచ్చేరిలో 134.47% వృద్ధి నమోదైంది. పెట్రోలు అమ్మకాల్లోనూ పుదుచ్చేరిలో 53.54%, కేరళలో 29.82%, కర్ణాటకలో 26.33% వృద్ధి కనిపించింది. తమిళనాడులోనూ 20.95% ఉంది. రాష్ట్రంలో పెట్రోలు అమ్మకాల్లో 1.03%, డీజిల్‌ అమ్మకాల్లో 8.04% వృద్ధే నమోదైంది.

పెట్రోలు, డీజిల్‌పై బాదుడే బాదుడంటూ.. ఎన్నికల ముందు జగన్‌ గొంతెత్తి అరిచారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనూ.. అప్పటి అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్రంలో లీటరు ఆరేడు రూపాయలు తక్కువకు దొరుకుతోందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై రాబడి రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కంటే 1,478 కోట్ల రూపాయలు పెరిగింది. ఇదే సమయంలో కర్ణాటకలో 9,413 కోట్ల నుంచి 9,140 కోట్ల రూపాయలకు తగ్గింది. పుదుచ్చేరిలోనూ పెట్రో పన్నుల రాబడి 16.67% పడిపోయింది. కేంద్రంతో పాటు దేశంలోని అధిక శాతం రాష్ట్రాలు ఇంధనంపై అమ్మకం పన్నును
తగ్గించడం ద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించాయి. సీఎం జగన్‌ పైసా తగ్గించకుండా నిలువు దోపిడీ చేస్తున్నారు.

రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలతో పోలిస్తే 2022-2023 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై పన్నుల రాబడి 20.48శాతం అధికంగా ఉంది. 6 నెలల్లోనే రాష్ట్ర ఖజానాకు 8వేల 694 కోట్లు జమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ద్వారా.. 14వేల 724 కోట్ల రూపాయలు పిండుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల గణాంకాల ప్రాతిపదికన చూస్తే.. ఏడాది రాబడి 17వేల కోట్ల రూపాయలుపైనే ఉంటుందని అంచనా.

పెట్రో ధరల్లో ఏపీదే అగ్రస్థానం

ఇవీ చదవండి :

Last Updated : Feb 5, 2023, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details