ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అంకెల గారడీతో ఆర్థిక మంత్రి మాయ'.. బడ్జెట్‌పై సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు

By

Published : Mar 16, 2023, 7:30 PM IST

BJP state president
BJP state president ()

Somu Veerraju harsh comments on AP budget: ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి బుగ్గన అంకెల గారడీతో మాయ చేశారని ఎద్దేవా చేశారు. అప్పులను ఆదాయంగా చూపించకూడదని రిజర్వు బ్యాంకు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకుండా, అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Somu Veerraju harsh comments on AP budget: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని తెలియజేసిన ఆయన.. పోతన పద్యంతో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలతో బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అంతా అంకెల గారడీ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదొక స్టిక్కర్ బడ్జెట్‌:''అప్పులను ఆదాయంగా చూపించకూడదని రిజర్వు బ్యాంకు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకుండా, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అంకెల గారిడీతో మాయ చేశారు. మంత్రి బుగ్గన తన ప్రసంగంలో విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బడ్జెట్‌కు అతని వాదనలను సమర్ధించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు అవాస్తవాలను వెల్లడించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు, పథకాలకు స్టిక్కర్లు వేసుకోని.. ఎందుకు శాసన సభలో గొప్పతనంగా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ముందు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాల వివరాలను వెల్లడించండి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంది. ఇదొక స్టిక్కర్ బడ్జెట్‌ మాత్రమే'' అని సోము వీర్రాజు అభివర్ణించారు.

రూ. ఏడు వేల కోట్ల వివరాలను తెలపండి: అనంతరం రాష్ట్ర బడ్జెట్ 80 శాతం రెవెన్యూ వ్యయం కాగా, మూలధనం వ్యయం పెరగకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. మూలధనం వ్యయం లేకపోతే ఆర్ధిక కార్యకలాపాలు జరగక, దీర్ఘకాలిక అభివృద్ది లక్ష్యాలు కుంటుపడతాయన్నారు. ద్రవ్యలోటు పెరగకపోవడంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రతినెల సుమారుగా రూ. 21 వేల కోట్లు రాష్ట్రానికి అవసరం ఉండగా, సుమారు రూ.10 వేల కోట్లు ఆదాయంగా వస్తున్నప్పటికీ.. ప్రతి నెల నాలుగు వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు వివరాలను వెల్లడిస్తున్నారని మండిపడ్డారు. మిగిలిన ఏడు వేల కోట్లు ఏ విధంగా సమకూరుతున్నాయన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఎందుకు వెల్లడించడంలేదని ప్రశ్నించారు.

ప్రభుత్వ తీరుతెన్నులపై అనుమానం కలుగుతోంది: ప్రభుత్వ ఆర్ధిక తీరుతెన్నులపై మిలియన్ డాలర్ల అనుమానం కలుగుతోందని.. కార్పొరేషన్లపై తీసుకున్న రుణాలకు సంబంధించిన విషయాలను ఆర్ధిక మంత్రి వివరణ ఇవ్వాలని.. సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మూలధన వ్యయం విషయంపై మంత్రి బుగ్గన క్లారిటీ ఇవ్వకపోగా.. ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలను బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో వెల్లడించకపోతే.. బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టి ప్రజలకు ఏం చెప్పదల్చుకుందని సోము వీర్రాజు విమర్శించారు. వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో పోలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది శూన్యం మాత్రమేనన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, భూసార పరీక్షలు బడ్జెట్ కేటాయింపులు.. అంకెల్లో ఘనంగా ఉన్నాయి కానీ.. క్షేత్రస్ధాయిలో మాత్రం రైతులకు నిరాశ ఎదురు అవుతోందన్నారు. మద్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఒక అంకెల గారడీగానే కనపడుతోందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై జాలి వేస్తోంది:ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నేటికీ సమస్యల సుడిగుండంలోనే ఉండడమే ఇందుకు తార్కాణమన్నారు. అదేవిధంగా విద్యా రంగానికి సంబంధించిన విషయంలో కేంద్రం ఇస్తున్న సహకారం మాత్రమే కనపడుతోందన్నారు. కానీ, బడ్జెట్‌లో మాత్రం రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్నట్లుగా ఎలా చూపించుకుంటారని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్ధిక మంత్రి అంతా రాష్ట్రం చేస్తున్నట్లు చెప్పుకోవడం చూస్తే జాలి వేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఇళ్లు సకాలంలో నిర్మాణం చేయకుండా అబద్దాలతో ఇళ్లు కడుతోందని రాష్ట్ర ప్రభుత్వంపై సోము వీర్రాజు మండిపడ్డారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details