ఆంధ్రప్రదేశ్

andhra pradesh

HC on Women Police: మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగించం: రాష్ట్ర ప్రభుత్వం

By

Published : Jul 20, 2023, 6:55 PM IST

AP High Court fire on YSRCP Govt: రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగించకుండా సర్క్యులర్ ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నామని..ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌ శ్రీరామ్‌ హైకోర్టుకు తెలియజేశారు.

HC
HC

AP High Court fire on YSRCP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ.. వారికి సాధారణ మహిళా పోలీసుల తరహాలోనే యూనిఫాంలు ఇవ్వాలంటూ 2021వ సంవత్సరంలో నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ.. విశాఖపట్టణానికి చెందిన ఆరేటి ఉమామహేశ్వరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై నిన్న, నేడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో విచారణ జరిగింది. విచారణలో భాగంగా పిటినర్ల తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో వారి వారి వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేయండి..సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై బుధవారం నాడు పిటినర్ల తరుఫు న్యాయవాది బాలాజీ వడేరా హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. ''గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళ పోలీసులుగా పేర్కొనడం చట్ట విరుద్దం. ఇలాంటి చర్యలు దొడ్డిదారిలో పోలీసు శాఖలోకి ప్రవేశాలు కల్పించడమే అవుతుంది. మహిళ సంరక్షణ కార్యదర్శులకు, మహిళ పోలీసులకు విద్యార్హతలు, నియామకం, విధుల నిర్వహణలో వేర్వేరుగా నిబంధనలు ఉన్నాయి. నియామక నిబంధనలకు విరుద్ధంగా మహిళ సంరక్షణ కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగిస్తున్నారు. పోలీసులకు ధ్రువపత్రం జారీ చేస్తారు. వారే పోలీసు విధులను నిర్వహించడానికి అర్హులు. ధ్రువపత్రం లేనివారు పోలీసు విధులు నిర్వహించడం శిక్షార్హం. పోలీసు నియామక బోర్డు మహిళ పోలీసులను నియమిస్తుంది. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకొని మహిళ కార్యదర్శులను మహిళ పోలీసులుగా గుర్తిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేయాలి'' అని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది.

అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం..ఈ నేపథ్యంలో గురువారం రోజున ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌ శ్రీరామ్‌హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగించకుండా సర్క్యులర్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని.. హైకోర్టుకు తెలియజేశారు. ఏపీలోని యూనిట్ అధికారులందరికీ అదే విషయాన్ని స్పష్టం చేస్తామని పేర్కొన్నారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని.. ఏపీ సర్కార్‌ తరుఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. మహిళా కార్యదర్శులను బందోబస్త్, పోలీస్‌ స్టేషన్ రిసెప్షన్ డ్యూటీ వంటి పోలీసు విధులకు నియమించాలని.. డీజీపీ ఆదేశించలేదని ఏపీ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఎప్పుడు పడితే అప్పుడు స్టేషన్‌కు రావాలని మహిళా పోలీసులను కోరడం లేదని వివరించిన ఏజీ.. పోలీసు విధులు అప్పగించకుండా సర్క్యులర్‌ ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. మహిళ పోలీసుగా మాత్రమే వారిని పిలుస్తారని.. పోలీసు విధులను వారు నిర్వహించడం లేదన్నారు. యూనిఫాం ధరించారన్న కారణంతో వారిని రెగ్యులర్‌ పోలీసులుగా చూడకూడదన్నారు. నిబంధనల మేరకే వారిని మహిళ పోలీసులుగా పేర్కొన్నామని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details