ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rythu Bharosa Centers : రైతు భరోసా కేంద్రాలను విస్మరించిన ప్రభుత్వం.. పునాదికే పరిమితమైన నిర్మాణాలు

By

Published : Jun 14, 2023, 12:38 PM IST

Rythu Bharosa Centers construction stopped: రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు నత్తతో పోటీ పడుతున్నాయి. కొన్ని భవనాలు శంకుస్థాపనలకే పరిమితం కాగా, మరికొన్ని పునాదుల దశలో నిలిచిపోయాయి. ఖరీఫ్ సాగుకు రైతన్నలు సన్నద్ధం అవుతుండగా.. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పునాదుల దశలోనే ప్రభుత్వ అసమర్థతలను వెక్కిరిస్తున్నాయి. శంకుస్థాపనలు చేసి సంవత్సరాలు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.

పునాది దశలోనే నిలిచిన రైతు భరోసా కేంద్రాల నిర్మాణం
పునాది దశలోనే నిలిచిన రైతు భరోసా కేంద్రాల నిర్మాణం

Rythu Bharosa Centers construction stopped : రాష్ట్రంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలకు సంబంధించి పునాదుల దశను దాటిన పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు కొన్ని పునాదుల దశలో ఉంటేకొన్ని గోడల వరకు నిర్మాణం మాత్రమే జరిగింది. పూర్తి చేసిన వరకు పనికి బిల్లులూ అందక నిర్మాణాలు ముందుకు తీసుకువెళ్లేందుకు గుత్తేదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకు పైగా వివిధ ప్రభుత్వ భవనాలు పునాదుల దశలోని భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 2,465 రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు నిలిచిపోయాయని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. ఒక్కో భవనానికి పునాదుల దశ వరకు దాదాపు 6 లక్షల చొప్పున కేటాయించి ఉంటారని రైతు సంఘ నాయకులు అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ సర్పంచి ఒకరు రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణ పనుల కోసం అప్పులు చేసి 6 లక్షల కుపైగా పెట్టుబడులు పెట్టారు. దాదాపు రెండేళ్లయినా మొదటి బిల్లు రాలేదు. రైతు సంక్షేమం కోసం తాము రైతులకు ఇబ్బంది లేకుండా భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టామని అధికారులు చెబుతున్నా నిర్మాణాలు మాత్రం ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆలోచన మంచిదే కానీ ఆచరణలో చిత్తశుద్ధి లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పడు రైతులకు అందిస్తున్న సేవలు కూడా పూర్తి స్థాయిలో అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

కృష్ణా జిల్లా నిడమానూరులో పునాదుల దశలోనే రైతు భరోసా కేంద్రం పనులు నిలిచిపోయాయి. ఒక్క నిడమానూరు మాత్రమే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు పూర్తయి రైతులకు సేవలు అందిస్తున్నవి ఏవీ లేవు. చాలా రైతు భరోసా కేంద్రాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి నెల నెలా అద్దెలు చెల్లించేందుకు అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని భావిస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. కొన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచ్ లే రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తుండగా మరి కొన్నింటిని గుత్తేదారులు చేపట్టారు. రైతులకు ఏ చిన్న అవసరం వచ్చినా రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వెతకాల్సి దుస్థితి నెలకొంది. చాలా రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రైతు భరోసా కేంద్రాల్లో బయట హడావుడి తప్ప.. లోపల అధ్వానంగా ఉందని ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా వణుకూరులోని రైతు భరోసా కేంద్రాన్ని మోడల్ గా చూపించారని చెప్పారు. ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది వణుకూరు రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారనని, కానీ నేడు ఆదే రైతు భరోసా కేంద్రం సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతోందని వారు పేర్కొన్నారు.

విత్తనం వేసిన దగ్గర నుంచి పంటను కొనుగోలు చేసే వరకు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు పూర్తయి రైతులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. ఖరీఫ్‌ సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో రైతు భరోసా కేంద్రం సేవలు రైతులకు చాలా కీలకంగా మారతాయి. పంట సాగు విషయంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి. రైతు భరోసా కేంద్రాల్లో తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి మేలు జరగడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేసి రైతులకు సేవలు అందించాలని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details