ఆంధ్రప్రదేశ్

andhra pradesh

APGEA Protest from June 8: చర్చలతో సంబంధం లేదు.. ఉద్యమం మరింత తీవ్రం: సూర్యనారాయణ

By

Published : Jun 1, 2023, 5:48 PM IST

APGEA protest from June 8: ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. మే 22 నుంచి తాలూకా స్థాయిలో.. మండుటెండల్లోనూ విజయవంతంగా సాగుతున్న ఉద్యమం ఇకపై జిల్లా స్థాయిలో ఉంటుందని తెలిపారు. జూలై 5 నుంచి కర్నూలు, నంద్యాల నుంచి బహిరంగ నిరసన ప్రదర్శనలు మొదలై రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ
ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ

APGEA protest from June 8 : రాష్ట్ర వ్యాప్తంగా మే 22 నుంచి ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు మండుటెండల్లోనూ ఉద్యోగులు విజయవంతంగా నిరసన కొనసాగిస్తున్నారని ఆయన వెల్లడించారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమానికి 3 లక్షల రూపాయలు ఉద్యోగులు చందాగా ఇచ్చారని వెల్లడించారు. ఒక్కొక్క ఉద్యోగి వంద రూపాయలు చెల్లించి నిరసనలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకు ఆ మొత్తం సమకూరిందని తెలిపారు.

చర్చలతో సంబంధం లేదు.. ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగ సంఘాల చర్చలతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ సంఘం క్షేత్ర స్థాయిలో చేస్తున్న నిరసనలు ప్రభుత్వానికి తెలుస్తాయని, దానికి స్పందించి 11వ పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఉద్యోగులు అంతా ఉద్యమంలో పాల్గొంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. నిన్న అరెస్ట్ చేసిన జీఎస్టీ అధికారుల్లో మహిళా ఉద్యోగి కూడా ఉన్నారని, ఎటువంటి సమాచారం లేకుండా పోలీసులు మఫ్టీలో వచ్చి తీసుకువెళ్లారని తెలిపారు. నిజంగా తప్పు చేస్తే ఎందుకు మఫ్టీలో పోలీసులు తీసుకువెళ్లారని సూర్యనారాయణ ప్రశ్నించారు. అరెస్టులపై కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. మీడియా సమావేశంపెట్టిన తరువాత మీడియాలో బ్రేకింగ్స్ వచ్చాక మాత్రమే ఉద్యోగుల అరెస్ట్​పై పోలీస్ డిపార్ట్​మెంట్ ప్రెస్ నోట్ విడుదల చేసిందని చెప్పారు.

మే నెల 22నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో తాలూకా స్థాయిలో రిలే నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రదానంగా 9 ఆర్థిక పరమైన డిమాండ్లు, 160 శాఖా పరమైన అంశాలతో చీఫ్ సెక్రెటరీకి ఇచ్చిన నోటీసుల్లో భాగంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. 11రోజులుగా విజయవంతంగా దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంత మండుటెండల్లోనూ తాలూకా స్థాయిలో ఎండలోనే చెట్లకింద కూర్చుని ఆందోళనలో కొనసాగడం సంతోషకరం. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగులు స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమమిది. ప్రతి ఉద్యోగి మేమిచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వంద రూపాయలు చెల్లించి ఉద్యమంలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపుతో అనూహ్య స్పందన లభించింది. ఆ మేరకు 3.70లక్షల రూపాయలు వచ్చాయి. అంటే.. దాదాపు 37500మంది ఉద్యోగులు వంద రూపాయలు కంట్రిబ్యూట్ చేసి దీక్షల్లో పాల్గొంటున్నారు. రెండు మూడు రోజుల్లో తాలూకా స్థాయిలో కార్యక్రమాలు ముగిశాక.. 8వ తేదీ నుంచి జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం. జూలై 5 నుంచి కర్నూలు, నంద్యాల నుంచి బహిరంగ నిరసన ప్రదర్శనలు మొదలై రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తాం. రాష్ట్ర కార్యవర్గం అంతా పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. - సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details