ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాసేపట్లో తేలనున్న మునుగోడు ఉపఎన్నికల ఫలితం

By

Published : Nov 6, 2022, 7:13 AM IST

Munugode Bypoll Results Today: రాజకీయ వర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం నేడు రానుంది. హోరాహోరీగా పోరాడిన ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి జరగనుంది. తుది ఫలితం.. ఒంటి గంటకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ ఎన్నికలో విజయంపై తెరాస, భాజపా విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. అనూహ్య ఫలితాలు వస్తాయని కాంగ్రెస్‌ ఆశిస్తోంది.

మునుగోడు ఉపఎన్నికల ఫలితం
మునుగోడు ఉపఎన్నికల ఫలితం

Munugode Bypoll Results Today: దేశ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న తెలంగాణ మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఇవాళ వెలువడనుంది. అసెంబ్లీ సమరానికి సెమీ ఫైనల్‌గా భావించి నెలపాటు పోటాపోటీగా ప్రజాక్షేత్రంలో ప్రచారం చేసి పార్టీలన్నీ అహర్నిశలు శ్రమించాయి. రికార్డు స్థాయి ఓటింగ్‌తో ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా.. ఫలితంపై అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పక్షాల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.

మునుగోడు పోలింగ్‌లో 2లక్షల 41వేల 805 ఓటర్లకు.. 2లక్షల 25వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్‌ తర్వాత ఈవీఎంలను నల్గొండలోని ఆర్జాలబావివద్ద ఉన్న రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ గోదాములో భద్రపర్చారు . ఏడున్నరకే పరిశీలకులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో.. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరిచి ఓట్ల లెక్కింపు 8 గంటలకు చేపడతారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపడతారు.

మొత్తం 15 రౌండ్​లలో ఓట్ల లెక్కింపు:తర్వాత నిర్వహించే ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ లెక్కింపు 15 రౌండ్లలో పూర్తికానుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేషన్‌లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడికానుండగా.. చివరి రౌండ్ ఫలితం ఒంటి గంట సమయానికి విడుదలయ్యే అవకాశముందని అధికారులు అంచనావేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 250 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో టేబుల్‌కి కౌంటింగ్ సూపర్‌వైజర్ ,అసిస్టెంట్ సూపర్‌వైజర్ ,మైక్రో అబ్జర్వర్‌లను నియమించారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత:మొదటగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్లు లెక్కించనుండగా.. తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూర్, మర్రిగూడ , నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కించనున్నారు. మునుగోడు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్ట భద్రత కల్పించారు. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నిక ఫలితం.. తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

మునుగోడు ఉపఎన్నికల ఫలితం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details