ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పచ్చని పంట పొలాల నడుమ అలరారుతున్న రామప్ప

By

Published : Jul 29, 2021, 8:26 PM IST

రామప్ప ఆలయం ఓ వైపు శిల్పశోభతో అలరారుతుంటే... మరోవైపు చుట్టూ పరుచుకున్న పచ్చదనం మరింత ఆహ్లాదం కలిగిస్తోంది. ఇక బోటింగ్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ramappa
రామప్ప

పచ్చని పంట పొలాల నడుమ అలరారుతున్న రామప్ప

తెలంగాణలోని ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ.. రామప్ప అలరారుతోంది. ఈ గొప్ప కట్టడానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రామప్ప ఆలయ పరిసరాలు పచ్చదనంతో కలకళలాడుతున్నాయి. వర్షాలు బాగా కురవటంతో ఆలయం కనుచూపుమేరవరకూ పచ్చదనం పరచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నో దశాబ్దాల నాటి వృక్షాలు పర్యాటకులకు నీడనిస్తూ సేదతీరుస్తున్నాయి. రామప్పకు వెళ్లే మార్గంలో కూడా చెట్లు వారసత్వ సంపదను తిలకించేందుకు రా..రమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నట్లుగా కనిపిస్తాయి.

ఎటుచూసినా పచ్చని చెట్లే

ఎటుచూసినా పచ్చని చెట్లు. వాటి మధ్య ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప. చూపు మరల్చుకోవడం కష్టమే. గత ఏడాది కాలంగా ప్రభుత్వం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ చూపటంతో ఆలయ పరిసరాలు శోభాయమానంగా నిలుస్తున్నాయి. ఆలయానికి కొద్ది దూరంలోని రామప్ప చెరువు ఇటీవలి వర్షాలకు నిండుకుండలాగా మారింది. రామప్ప దర్శనానికి వచ్చే వారంతా బోటులో షికారు చేస్తూ సందడి చేస్తున్నారు.

40 ఏళ్ల పాటు శ్రమించి ఈ దేవాలయ నిర్మాణం

రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకం.1213లో గణపతి దేవుడి కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. 40 ఏళ్ల పాటు శ్రమించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. సాధారణంగా ఆలయంలో ఉన్న దేవుడి పేరు మీదుగా గుడి పేరు ఉంటుంది. కానీ రామప్ప దేవాలయం పేరు ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగి మహామండపం ఉంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది.

ఇలా వెళ్లొచ్చు..

ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ... రామప్ప ఆలయం కొలువై ఉంది. ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. వరంగల్​ వరకు రైలు, రోడ్డు మార్గం ద్వారా చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. రామప్ప వరంగల్​ నగరానికి దాదాపు 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్​ నుంచి రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా వరంగల్​ చేరుకుని అక్కడి నుంచి రామప్ప చేరుకోవచ్చు. రామప్పకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా వెళ్తాయి.

సంబంధిత కథనాలు:

RAMAPPA TEMPLE: కాకతీయుల ప్రాభవానికి ప్రతీక.. రామప్పగుడి!

Choodamani on Ramappa : రామప్పపై యునెస్కోకు పుస్తకం రాశా!

RAMAPPA: గుర్తింపు దక్కింది సరే.. సంరక్షణ మాటేంటి?

HIGH COURT: రామప్ప కట్టడం అభివృద్ధి, నిర్వహణను స్వయంగా పర్యవేక్షిస్తాం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details