RAMAPPA: గుర్తింపు దక్కింది సరే.. సంరక్షణ మాటేంటి?

author img

By

Published : Jul 27, 2021, 7:30 AM IST

RAMAPPA TEMPLE

రామప్ప గుడి ప్రపంచ వారసత్వ కట్టడంగా ‘యునెస్కో’ గుర్తింపు పొందడం యావత్‌ జాతికి, ముఖ్యంగా తెలుగువారందరికీ గర్వకారణం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా సంరక్షణ, నిర్వహణ చర్యల విషయంలో ప్రభుత్వం పకడ్బందీ కార్యచరణను పట్టాలు ఎక్కించాల్సి ఉంది.

మీటితే రాగాలు పలికే శిలలు, వైవిధ్యభరిత ముద్రల్లో వందలాది ఏనుగుల బొమ్మలు, నేటికీ అప్రతిభుల్ని చేసే సాంకేతిక మెలకువలకు నెలవైన పాలంపేట ఆలయం- ఏనాడో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేరి ఉండాల్సింది. మనదేశం నుంచి అటువంటి విశిష్ట గుర్తింపు పొందిన 39 స్థలాల్లో ఒకటిగా ఇన్నాళ్లకు చోటు దక్కించుకున్న రుద్రేశ్వర సన్నిధి పరిరక్షణ నిమిత్తం ‘యునెస్కో’ ఆర్థిక, సాంకేతిక సహకారం దాఖలుపడనుంది. కాకతీయ శిల్పకళా వైభవానికి దర్పణం పట్టే శివుడి గుడి- రామప్ప అనే శిల్పి పేరిట ప్రాచుర్యం పొందడం విశేషం. నక్షత్రాకార ప్రణాళికలో ఉత్తర, దక్షిణభారత దేవాలయ నిర్మాణశైలుల మేళవింపుగా అలరారే రామప్పగుడిలో నీటిలో తేలే ఇటుకలు విస్మయపరిస్తే- అక్కడి ప్రతి శిల్పమూ అసమాన కళాఖండంగా సందర్శకుల్ని సమ్మోహితుల్ని చేస్తుంది. అలాంటి ఈ ఆలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో.. ప్రకృతి వైపరీత్యాల బారినుంచి కాపాడి రేపటి తరాలకు భద్రంగా అందించేలా ప్రత్యేక నిధుల తోడ్పాటూ లభించనుందంటున్నారు.

పకడ్బందీ కార్యాచరణ అవసరం

ప్రపంచ వారసత్వ హోదా కట్టబెట్టినప్పటికీ- నిర్వహణ సక్రమంగా లేకున్నా, ఆక్రమణలూ కూల్చివేతలు సంభవించినా ‘యునెస్కో’ తీవ్రంగా పరిగణించి గుర్తింపు రద్దుచేసిన ఉదంతాలు గతంలో వెలుగుచూశాయి. ఆ దృష్ట్యా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా సంరక్షణ, నిర్వహణ చర్యల విషయంలో ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణను పట్టాలకు ఎక్కించాల్సి ఉంది. విశ్వవ్యాప్తంగా 167 దేశాల్లోని 1126 కట్టడాలు, ప్రాంతాలకు ఇంతవరకు ఇలా వారసత్వ హోదా కల్పించారు. ఆ గుర్తింపు లభించిన అనతికాలంలోనే పర్యాటకుల తాకిడి అధికం కావడమన్నది సహజ పరిణామం. అందుకు తగ్గట్లు స్థానికంగాను, చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం దీటైన మౌలిక సదుపాయాల పరికల్పన ఊపందుకుంటే- పర్యాటక రంగం మేలుమలుపు తిరుగుతుంది.

కనీస ఏర్పాట్లు లేక

సాంస్కృతికంగా శిల్పకళా వైభవరీత్యా సందర్శన స్థలాల ప్రాతిపదికన భారత్‌తో ఏ రకంగానూ సరితూగలేని చిన్నాచితకా దేశాలెన్నో ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలతో పెద్దయెత్తున విదేశమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి. సరైన ప్రచారం, కనీస ఏర్పాట్లూ కొరవడిన పర్యవసానంగా వాటి సరసన ఇండియా వెలాతెలాపోతోంది. ‘యునెస్కో’ గుర్తింపు పొందిన అత్యధిక కట్టడాలు కలిగిన దేశాల జాబితాలో ఇటలీ(57), చైనా(55), జర్మనీ(48), స్పెయిన్‌(48), ఫ్రాన్స్‌(47) మనకన్నా ముందున్నాయి. వందల ఏళ్లనాటి నిర్మాణాలను, క్షేత్రాలను పరిరక్షిస్తూ సమధికంగా పర్యాటకుల్ని ఆకట్టుకోవడంలో వాటితోపాటు మరెన్నో దేశాలు ఇక్కడికన్నా ఎంతో మిన్నగా రాణిస్తున్నాయి.

అడుగడుగునా నిర్లక్ష్యమే!

ప్రపంచంలో ఎక్కడైనా సరే చారిత్రక ఆనవాళ్లు బయటపడితే- వెనువెంటనే లోతైన పరిశోధన చేపట్టి మూలాల్ని తవ్వితీయడం పరిపాటి. అదే ఇక్కడ, అడుగడుగునా నిర్లక్ష్యమే! ఆక్రమణలు, గుప్తనిధులకోసం తవ్వకాలు, అభివృద్ధి పనులు... ఎన్నో చారిత్రక అవశేషాల్ని తుడిచిపెడుతున్నాయి. అపురూప శిల్పకళా సంపదకు, ప్రకృతి రమణీయకతకు, విలక్షణ నిర్మాణ ప్రతిభకు- భారత్‌ ఆటపట్టు. దేశం నలుమూలలా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ విశిష్ట స్మృతి చిహ్నాలు, స్మారక స్థూపాలు, సందర్శనీయ స్థలాలు ఉన్నప్పటికీ పర్యాటకుల్ని పెద్దయెత్తున ఆకట్టుకోలేకపోవడం కచ్చితంగా వ్యవస్థాగత వైఫల్యమే. కొవిడ్‌ విజృంభణ ఉపశమించాక ‘స్వస్థ పర్యాటకం’ మీద దృష్టి కేంద్రీకరించడం మేలన్న సూచనలకు చెవొగ్గడంతోపాటు- చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల సంరక్షణలోనూ ప్రభుత్వాలు పోటీపడాలి. హోటల్‌ వసతి, రవాణా, భోజనశాలలు, వినోద కార్యక్రమాలు తదితరాలపై కనిష్ఠస్థాయి పన్ను వడ్డనకు తగిన చర్యలు చేపట్టిన చోట్ల పర్యాటక, ఆతిథ్య రంగాలు బంగారు బాతులవుతాయని స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాల అనుభవాలు చాటుతున్నాయి. దేశీయంగానూ అటువంటి పరివర్తన చోటు చేసుకున్న నాడు- ఇక్కడి పర్యాటక, ఆతిథ్య రంగాలూ తెరిపిన పడతాయి!

ఇదీ చూడండి: Ramappa: ఎన్ని కట్టడాలున్నా.. రామప్పకే ఈ ఖ్యాతి ఎందుకు దక్కిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.