ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'హామీలు నెరవేర్చారో.. మోసాలకు పాల్పడ్డారో.. ప్రజలే చెబుతారు'

By

Published : Jun 8, 2020, 6:56 PM IST

వైకాపా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేక పాలన చేపట్టిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజల భవిష్యత్తును నాశనం చేసిందని ధ్వజమెత్తారు. వివిధ మాధ్యమాల ద్వారా వైకాపా పాలనా లోటుపాట్లను ఎత్తిచూపాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

chandra babu
chandra babu

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనలో 90 శాతం హామీలు నెరవేర్చిందో లేక.... 90 శాతం మోసాలకు పాల్పడిందో ప్రజలనడిగితే చెబుతారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా పాలనపై 'రాష్ట్రమా మేలుకో' పేరిట చంద్రబాబు ఓ వీడియోను ట్విటర్​లో విడుదల చేశారు. 3 రాజధానుల బిల్లు, పీపీఏల రద్దు, బీసీల రిజర్వేషన్ల తగ్గింపు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు, కౌన్సిల్ రద్దు బిల్లు, ఎలక్షన్ కమిషనర్ తొలగింపు లాంటి కార్యక్రమాలే వైకాపా చేపట్టిందని ఆయన ధ్వజమెత్తారు.

అవినీతి, అరాచకాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి.. ఏడాదిలోనే ప్రజల భవిష్యత్తును వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. తొలి ఏడాదిలోనే ఎన్నో తప్పులు చేసి ప్రజా వ్యతిరేక పాలన చేపట్టిందని దుయ్యబట్టారు. ఓ ప్రభుత్వం కోర్టులతో ఇన్ని చీవాట్లు తినడం గతంలో ఎన్నడూ లేదని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ది రివర్స్ అయ్యిందన్న చంద్రబాబు.... రాష్ట్రాన్ని రౌడీల రాజ్యంగా మార్చారని మండిపడ్డారు.

పాలకుల అవినీతి, అసమర్థత రాష్ట్రానికి కీడు చేస్తుంటే అడ్డుకోవాల్సింది ప్రజలేనని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధిని తగ్గించే నిర్ణయాలను అడ్డుకునే బాధ్యత ప్రతిపక్షాలతో పాటు ప్రజలకూ ఉందని గుర్తుచేశారు. వివిధ మాధ్యమాల ద్వారా వైకాపా పాలనా లోటుపాట్లను ఎత్తిచూపాలని పిలుపునిచ్చారు. దారితప్పిన ఈ ప్రభుత్వాన్ని గాడిన పెట్టాలన్నారు.

ఇదీ చదవండి

'భూముల పంపిణీ దేశంలోనే పెద్ద కుంభకోణం'

ABOUT THE AUTHOR

...view details