ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారు.. ప్రతిపక్షాలు ఏకం కావాలి: అమరావతి బహుజన జేఏసీ

By

Published : Mar 16, 2023, 3:24 PM IST

Updated : Mar 16, 2023, 6:51 PM IST

Amaravati Bahujan JAC : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మిత్రభేదం అనే పుస్తకం బాగా తెలుసు. మిత్రుల మధ్య విభేదాలు ఎలా పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. అయితే ప్రతిపక్ష పార్టీలు చిన్నయసూరి రాసిన మిత్రలాభం పుస్తకాన్ని చదవాలి. అలా చేస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని అమరావతి బహుజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు.

అమరావతి బహుజన జేఏసీ
అమరావతి బహుజన జేఏసీ

Amaravati Bahujan JAC : వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయి గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని అమరావతి బహుజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని దింపేందుకు ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక యుద్ధంలా భావిస్తున్నారని... ఏం చేసినా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు.

అమరావతి బహుజన జేఏసీ

ప్రతిపక్షాలు ఏకం కావాలి... ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల యుద్ధానికి చేస్తున్న సన్నాహాలు ఏవి అని బాలకోటయ్య ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో లెక్కలు ఒకలా చెప్పి.., మరుసటి రోజు ముఖ్యమంత్రి అవే లెక్కలను మరోలా చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, పెట్టుబడులు, చెత్త పన్ను, ఇంటి పన్ను, అధిక ధరలు, విద్యుత్ చార్జీలు వంటి అంశాల్లో ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు.

27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు..రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్​కు నిధులు కేటాయించకుండా, గతంలో అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో దగా పడిన వారిలో అత్యధిక శాతం దళిత బహుజనులే అని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బాలకోటయ్య చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వానికి 1825రోజుల పరిపాలన కాలంలో 1386రోజులు పూర్తయ్యాయి. ఇంకా మిగిలి ఉన్నది 439రోజులు మాత్రమే. ఇందులో మూడు నెలల ఎన్నికల ఎపిసోడ్ తీసేస్తే మిగిలి ఉన్నది 349రోజులు మాత్రమే. మీరు రాష్ట్రాన్ని ఉద్ధరించాలన్నా.. మీరు పెట్టిన సమ్మిట్ లో పరిశ్రమలు స్థాపించాలన్నా సమయం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తీరు మీద రాష్ట్ర ప్రజలు అలసిపోయారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో దళిత, బహుజనులు దగా పడ్డాం. ఈ రాష్ట్రంలో తొలి బాధితులం మేమే. మూడేళ్లుగా మేం అడుగుతున్నా.. ప్రతిపక్షాలకు ఒకటే విన్నవిస్తున్నాం.. మీరంతా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కలిసికట్టుగా సమస్యలపై పోరాడండి. ఎన్నికల్లో కలిసి పోటీ చేయండి అని కోరుతున్నాం. కానీ, స్పందించడం లేదు. ఏఏ పార్టీలు కలుస్తాయో చెప్పడం లేదు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పోరాటం చేయడం ప్రజాస్వామిక సూత్రం. గత ప్రభుత్వాలు ఇదే చేశాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్లారు. చంద్రబాబు నాయుడు కూడా ప్రజాకూటమి ఏర్పాటు చేశారు. ఇదే సూత్రంపై ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మిత్రభేదం అనే పుస్తకం బాగా తెలుసు. మిత్రుల మధ్య విభేదాలు ఎలా పెట్టాలో ఆయనకు బాగా తెలిసిన పాఠం. అదే లెక్కన ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా చిన్నయసూరి రాసిన మిత్రలాభం అనే పుస్తకాన్ని చదవమని చెప్తున్నాం. అలా చేస్తే.. ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని మేం భావిస్తున్నాం. ఈ మూడేళ్ల పాలనలో ప్రతిపక్ష పార్టీలు ఏదైనా సమస్యపై పోరాటం చేయడం గాని, జీవోలను వెనక్కు తీయగలిగే ప్రయత్నం చేయగలిగాయా.. పోరాడగలిగాయా.. అని మేం ప్రశ్నిస్తున్నాం.- పి.బాలకోటయ్య, అమరావతి బహుజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు


ఇవీ చదవండి :

Last Updated : Mar 16, 2023, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details