Vijayawada 12th ADJ Court KR Suryanarayana Bail Petition: అసలు వాణిజ్య పన్నుల శాఖలోని ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని, ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌ను కలసి వినతిపత్రం ఇచ్చినందుకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కేఆర్ తరఫు న్యాయవాది వాదించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. తన చర్యల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల్లో గండి కొట్టారన్న కేసులో ఏపీ జీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని 12వ ఏడీజే కోర్టులో వాదనలు జరిగాయి. న్యాయాధికారి పి. భాస్కరరావు ఎదుట ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. తదుపరి వాదనల నిమిత్తం బుధవారానికి వాయిదా పడింది.
ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌పై విజయవాడ 12 ఏడిజే కోర్టు విచారణ జరిపింది. శాఖాపరమైన విచారణ నివేదికల్లో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన వారి పాత్ర గురించి స్పష్టంగా పేర్కొన్నారని, అందులోని అంశాలను పిటీషనర్ న్యాయవాది కృష్ణమూర్తి చదివి వినిపించారు. వీటిల్లో ఎక్కడా సూర్యనారాయణ పేరు లేదని వివరించారు. కానీ.. హఠాత్తుగా గత నెల 30న వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ షేక్ జహీర్, పటమట స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో సూర్యనారాయణ పేరును చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
గత ఏడాది డిసెంబరు, 19న వాణిజ్య పన్నుల శాఖలో ఓఎస్డీ వెంకటేశ్వరావు తన నివేదికను సమర్పించారని ఇందులో సూర్యనారాయణ పేరు లేదన్నారు. సరిగా నెల రోజుల తర్వాత ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌ను కేఆర్ కలిశారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని గవర్నర్‌ను కోరారని, ఈ మేరకు వినతిపత్రం కూడా అందజేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే ఏపీజీఈఏ గుర్తింపును ప్రభుత్వం తొలగించిందని, తర్వాత ప్రభుత్వంతో జరిగిన చర్చలకు ఈ సంఘాన్ని ఆహ్వానించలేదన్నారు. ఈ నిర్ణయాలను హైకోర్టు ఇప్పటికే కొట్టివేసిందని గుర్తు చేశారు.
సూర్యనారాయణ పాత్రపై ఎటువంటి ఆధారాలను పోలీసులు సంపాదించలేకపోయారని, కేవలం కక్షపూరితంగానే ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మోసం జరిగిందని చెబుతున్న ఇంటెలిజెన్స్ విభాగంలో సూర్యనారాయణ పనిచేయలేదని, అందులోని ఉద్యోగులను శాసించే అధికారం ఎంత మాత్రం లేదన్నారు. 409 సెక్షన్ వర్తించదని, విశ్వాసఘాతుకానికి (బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) ఎలా పాల్పడతారని ప్రశ్నించారు. పోలీసులు రికార్డు చేసిన వ్యాపారుల స్టేట్‌మెంట్లకు చట్టంలో ఎలాంటి విలువ లేదన్నారు. వీటి ఆధారంగా కేఆర్‌ను నిందితుడిగా పేర్కొనడం సరికాదన్నారు.
పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఇందులో సాక్ష్యులను తారుమారు చేసే అవకాశాలు లేవన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున హైకోర్టు అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఈ కేసులో సూర్యనారాయణ పాత్ర ఉందని, పోలీసుల విచారణలో పలువురు వ్యాపారులు తమకు సూర్యనారాయణ ఫోన్ చేసినట్లు చెప్పారని వివరించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని వాదించారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే.. కోర్టుకు సమర్పించాలని విచారణను న్యాయాధికారి భాస్కరరావు బుధవారానికి వాయిదా వేశారు.