సమస్యలపై మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఉద్యోగుల సంఘానికి లేదా : హైకోర్టు

author img

By

Published : Feb 1, 2023, 9:26 AM IST

Etv Bharat

Employees Petition : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జారీ చేసిన షోకాజ్‌ నోటీసుపై తీర్పు ఇచ్చేంత వరకూ తుది నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. ‘సమస్యలపై మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఉద్యోగుల సంఘానికి లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసింది.

ఉద్యోగుల సంఘం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Employees Petition : ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ గవర్నర్‌ను కలిసిన వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు ఇవ్వడంపై ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం’ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనరు తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌, న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు. విశ్రాంత ఉద్యోగుల పింఛను, ఉద్యోగుల జీతాలను మరుసటి నెల 15న ఇస్తున్నారని.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము 413 కోట్ల రూపాయలను వారికి తెలియకుండా ప్రభుత్వం మళ్లించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు జీతాలతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందించాలని గవర్నర్‌ను కలిసి విన్నవించామని.. దీనిపై ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు ఇచ్చిందన్నారు. మీడియా ముందు ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదని.. నోటీసు ఆధారంగా తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు.

షోకాజ్‌ నోటీసు సవాలు చేయడానికి వీల్లేదని, వివరణ ఇచ్చాక తగిన ఉత్తర్వులిస్తామని సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి తరఫున జీపీ మహేశ్వరరెడ్డి వాదించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏ నిబంధనను ఉల్లంఘిస్తే నోటీసు ఇచ్చారో ఆ వివరాలు షోకాజ్‌లో ఎక్కడున్నాయి? ప్రభుత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలేవి?’ అని ప్రశ్నించారు. ‘గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తే తప్పులేదుగానీ.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై మీడియాతో మాట్లాడారు. కొన్ని అంశాల్ని గోప్యంగా ఉంచాలి. బహిర్గతం చేయడాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించలేం’ అని జీపీ పేర్కొన్నారు. సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.