ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu fire on CM Jagan : "వైఎస్సార్సీపీ అతుకుల బొంత.. టీడీపీ ఒరిజినల్.. పులివెందుల కొట్టి తీరుతాం"

By

Published : Jun 19, 2023, 1:58 PM IST

Chandrababu fire on CM Jagan : ఏపీలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, డబ్బు, అధికారం, నేరం కలిసి అరాచకాలు జరుగుతుండడం రాష్టానికి శాపంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఇలాగే కొనసాగితే ఏపీ పరిస్థితి నార్త్ కొరియా, సౌత్ కొరియాలా మారుతుందన్నారు. కుప్పంలో వైఎస్సార్సీపీ గెలవడం అసాధ్యమన్న చంద్రబాబు.. పులివెందులను కొట్టి తీరుతామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్ కు గ్యారెంటీ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Chandrababu lashed out at CM Jagan: ఎవరికో పుట్టిన బిడ్డను తనకే పుట్టాడని చెప్పుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లు తానే కట్టానని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో గంజాయి వాడకాన్ని ప్రోత్సహిస్తూ.. నేరాలను సమర్థించే ముఖ్యమంత్రిని ఏమనాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి తాగే వెధవలకు తల్లీ, చెల్లీ తేడా తెలియదన్న ఆయన.. వాళ్లను రోడ్ల మీదకు వదిలేస్తారా అంటూ మండిపడ్డారు.

ఏపీలో ఉండలేని పరిస్థితులు.. అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారన్న చంద్రబాబు.. విశాఖలో అక్రమాలకు భయపడి ఎంపీ ఎంవీవీ తన ఆఫీసును హైదరాబాదుకు మార్చుకున్నారన్నారని తెలిపారు. ఏపీలో ఉండలేమని అధికార పార్టీ ఎంపీనే హైదరాబాద్ వెళ్లిపోయారని విమర్శించారు. ఏపీలో గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితి ఉందని, అవినీతి, అసమర్థ, నేరస్తుల పాలన కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్ వ్యవస్థను అవినీతిమయం చేసి పేదలపై భారం మోపారని, ముఖ్యమంత్రి అసమర్థత వల్లే ప్రజల ఆదాయం తగ్గి, ధరలు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూమి విలువలు తగ్గి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయని తెలిపారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని నేతలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. ప్రజల మనోభావాల ప్రకారం సమస్యలు నెమరువేసుకుందామని అన్నారు.

భయపడేదే లేదు.. డబ్బు, అధికారం, నేరం కలిసి అరాచకాలు జరుగుతుండడం ఏపీకి శాపంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో ఓ ఎస్సీ యువతికి మత్తు మందిచ్చి వైఎస్సార్సీపీ నేత లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆయన... ఆ నేతను కాపాడేందుకు మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎవ్వరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితే లేదని అన్నారు. ఆడవాళ్లు రాజకీయాల్లో చురుకుగా ఉంటే కించపరుస్తూ వేధిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే భయపడతామనుకున్నారన్న చంద్రబాబు.. తెలుగుదేశం భయపడేదే లేదని స్పష్టం చేశారు.

CBN Kuppam Tour Updates: జగన్‌పై తిరుగుబాటు మొదలైంది.. తరిమేయడమే మిగిలింది: చంద్రబాబు

వెంకన్నకు అపచారం చేస్తే పుట్టగతులు ఉండవు...తిరుమల శ్రీవాణి ట్రస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకన్నకు అపచారం తలపెడుతున్నారని ఆరోపించారు.శ్రీవాణి ట్రస్టు నిర్వాహకులు ఎవరని ప్రశ్నించిన చంద్రబాబు.. శ్రీవాణి టిక్కెట్లకు రసీదులు ఇవ్వడం లేదని, డబ్బులు ఏమవుతున్నాయని నిలదీశారు. తిరుపతి వెంకన్నకు అపచారం చేస్తే పుట్టగతులు ఉండవని, వచ్చే జన్మలో కాదు.. ఈ జన్మలోనే శిక్ష పడుతుందని చంద్రబాబు హెచ్చరించారు.

విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తాం...రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు విధానానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతీ పౌరుడికీ విద్యుత్ భారం తగ్గించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త విద్యుత్ విధానంతో సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. పేదలు, రైతులపై విద్యుత్ భారం తగ్గేలా నూతన విధానాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చింది తెలుగుదేశమే అని గుర్తుచేస్తూ.. గతంలోనూ విద్యుత్ ఉత్పత్తి ధరలను తగ్గించామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థని నాశనం చేసి ఏడు సార్లు ఛార్జీలు పెంచేసిందని ధ్వజమెత్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో అధికంగా ఉన్నాయని విమర్శించారు. నిత్యావసరాల విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. ఇంటి పన్ను, చెత్తపన్ను.. ఇలా అన్నింటినీ పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ అతుకుల బొంత..చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టేలా కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీ నేతలకు అగ్రపీఠం వేసింది తెలుగుదేశమే అని గుర్తుచేశారు. దసరా రోజున విడుదల చేయనున్న మేనిఫెస్టోలో బీసీల కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని వెల్లడించారు. తెలుగుదేశం ఒరిజినాలిటీతో ఉండే పార్టీ అని... వైఎస్సార్సీపీ అతుకుల బొంత అని విమర్శించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో బటన్ నొక్కుతానంటోందని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కే వ్యవస్థని తెచ్చిందే తెలుగుదేశం అని గుర్తుచేశారు. భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రకటించాక జగన్‌కు ఏం చేయాలో తెలియడం లేదని దుయ్యబట్టారు. మళ్లీ వైఎస్సార్సీపీ గెలిస్తే... గౌరవం ఉన్న వాడెవ్వడూ ఏపీలో ఉండడని వ్యాఖ్యానించారు.

పులివెందుల కొట్టి తీరుతాం.. కుప్పంలో గెలవడం వైఎస్సార్సీపీతో జరిగే పని కాదన్న చంద్రబాబు... పులివెందుల కొట్టి తీరతాం అని స్పష్టం చేశారు. జగన్ 98 శాతం హామీలు అమలు చేయకుండా.. రాష్ట్రాన్ని 98 శాతం లూటీ చేశాడని,ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగితే ఏపీ పరిస్థితి నార్త్ కొరియా.. సౌత్ కొరియాలా తయారవుతుందని తెలిపారు. పార్టీ కార్యక్రమాల విషయంలో అలక్ష్యం వద్దని, పని చేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలని సూచిస్తూ... మేం ప్రత్యామ్నాయం చూస్తాని స్పష్టం చేశారు. నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడడం లేదని అనుకోవద్దని, పని చేయకుంటే గట్టిగానే చర్యలు తీసుకుంటాని సూచనప్రాయంగా హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details