ETV Bharat / state

CBN ONE LAKH VOTES LOGO: టీడీపీని నమ్ముకుంటే అభివృద్ధి.. వైసీపీని నమ్ముకుంటే జైలు: చంద్రబాబు

author img

By

Published : Jun 15, 2023, 9:28 PM IST

Updated : Jun 15, 2023, 9:54 PM IST

CBN
CBN

TDP Cheif CBN One Lakh Vote logo released: కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి విధ్వంసం మొదలైందన్నారు. టీడీపీని నమ్ముకుంటే అభివృద్ధిలోకి వస్తారు.. వైసీపీని నమ్ముకుంటే జైలుకు వెళ్తారని ప్రజలు, కార్యకర్తలు, యువతకు పిలుపునిచ్చారు.

TDP Cheif CBN One Lakh Vote logo released: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం పర్యటన వేలాది మంది ప్రజల, యువత, కార్యకర్తల మధ్య కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గమంతా పసుపు మాయంతో నిండిపోయింది. నేటి (రెండో రోజు) పర్యటనలో ఆయన మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం కుప్పం బస్టాండ్‍ కూడలిలోని ఎన్టీఆర్‍ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 'లక్ష మెజార్టీయే లక్ష్యం' పేరుతో రూపొందించిన లోగోను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.. ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ..''వచ్చే ఎన్నికల్లో టీడీపీ లక్ష్యం లక్ష ఓట్ల మెజారిటీ. ప్రజల ఆదరణ జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. మళ్లీ జన్మ ఉంటే మీ సేవకుడిగానే పుడతా. టీడీపీకీ కంచుకోట కుప్పం నియోజకవర్గం. టీడీపీని 9 ఎన్నికల్లో గెలిపించిన ఘనత కుప్పానికే దక్కింది. కుప్పం ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. కుప్పం ప్రజల కోసం అనునిత్యం పనిచేశా. గతంలో ఇంటింటికీ 2 ఆవులు ఇస్తానన్న హామీ నెరవేర్చా. ఇంటింటికీ ఆవులు ఇవ్వడంతో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఇంటింటా పాల ఉత్పత్తి పెరిగి ఆదాయం సమకూరింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. హంద్రీనీవా పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత టీడీపీదే'' అని ఆయన అన్నారు.

భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ సైకిల్‌తో జోరు.. అంతేకాకుండా, కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కుప్పానికి తొలిసారిగా ఇజ్రాయెల్‌ టెక్నాలజీ తీసుకువచ్చామన్న ఆయన.. తద్వారా ఆధునిక పద్ధతుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనేనని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అన్నారు. సైకిల్‌ ముందు చక్రం సంక్షేమం.. వెనుక చక్రం అభివృద్ధి.. ఆ రెండు చక్రాలు నడిస్తేనే అభివృద్ధి పథంలో సాగుతామన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ సైకిల్‌తో టీడీపీ జోరు పెంచుతామన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి తోడుగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో సాగు రంగం అభివృద్ధి చెందుతున్నారు.

అభివృద్ధి ఆగిపోయింది- విధ్వంసం మొదలైంది.. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పరిపాలన పడకేసిందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి అభివృద్ధి ఆగిపోయి విధ్వంసం మొదలైందన్నారు. పది రూపాయలు ఇచ్చి రూ.వంద దోచేస్తున్నారన్నారు. విద్యుత్‌, ఆర్టీసీ, గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంచారన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వైసీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదని.. ఇసుక, మద్యం, గనుల దోపిడీ, భూ కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. కుప్పం గ్రానైట్‌ను కొల్లగొడితే అడ్డుకున్నానన్న చంద్రబాబు.. మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లు లేవన్నారు. మద్యం దుకాణాల్లో రూ.2 వేల నోట్లు మార్చుకుంటున్నారన్నారు. కుప్పంను నేరస్థుల అడ్డాగా మార్చేశారని.. తీవ్రవాదులు, ముఠా నాయకులను అణచివేసిన పార్టీ టీడీపీనేనని గుర్తు చేశారు. మత సామరస్యం కాపాడిన పార్టీ టీడీపీ అని.. రౌడీలు, గూండాలు కబడ్దార్‌ అంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

టీడీపీని నమ్ముకుంటే అభివృద్ధి చెందారు.. వైసీపీని నమ్ముకుంటే జైలుకు వెళ్తారు: చంద్రబాబు

''విశాఖలో వైసీపీ ఎంపీ కుమారుడు, భార్య, ఆడిటర్‌ను కిడ్నాప్‌ చేశారు. పోలీసులు అతికష్టం మీద కిడ్నాపర్ల బారి నుంచి కాపాడారు. రాష్ట్రంలో ఒక ఎంపీ కుటుంబానికే రక్షణ లేదు. ఎంపీ కుటుంబానికే రక్షణ లేకపోతే సామాన్యుడికి ఎలా ఉంటుంది. వైసీపీని నమ్ముకుని తప్పుడు పనులు చేస్తే జైలుకు వెళ్తారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ. వైసీపీకి దోపిడీ, విధ్వంసం మాత్రమే తెలుసు. సాంకేతికత వినియోగం నేర్పింది తెలుగుదేశం పార్టీనే. గడిచిన 30 ఏళ్లలో సాంకేతికతలో పెనుమార్పులు వచ్చాయి. సాంకేతికతలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. పేదరికాన్ని నిర్మూలించడం టీడీపీ కర్తవ్యం. ప్రతి ఒక్క పేదను ధనికుడిని చేసే బాధ్యత తీసుకుంటాం. మహిళలను శక్తిమంతంగా చేసే బాధ్యత తీసుకుంటా. జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు రూ.1500 అందిస్తాం. తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఆర్థికసాయం అందిస్తాం.''-నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

Last Updated :Jun 15, 2023, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.