ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాకు 16 మంది ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారు.. విజయం మాదే: టీడీపీ నేతలు

By

Published : Mar 23, 2023, 10:15 AM IST

TDP COMMENTS ON MLA QUOTA MLC ELECTIONS : సీఎం జగన్​పై అసంతృప్తితో ఉన్న 16 మంది వైసీపీ నేతలు తమతో టచ్​లో ఉన్నట్లు తెలుగుదేశం నేతలు వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

TDP COMMENTS ON MLA QUOTA MLC ELECTIONS
TDP COMMENTS ON MLA QUOTA MLC ELECTIONS

మాకు 16మంది ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారు..విజయం మాదే

TDP COMMENTS ON MLA QUOTA MLC ELECTIONS : అధికార పార్టీ వైసీపీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అందువల్ల అభద్రతా భావనలో జగన్ క్యాంపులు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో ఉన్న 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. బాధలో ఉన్నాం అందుకే తమతో పంచుకుంటున్నాం అని తమని సంప్రదించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారన్నారు.

"వైసీపీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయి. 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నాం.16 మందిలో 3 ప్రాంతాల ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఎమ్మెల్యే భవానితోపాటు మరికొందరిని బెదిరిస్తున్నారు"-గోరంట్ల బుచ్చయ్య, టీడీపీ నేత

తాము ఎవ్వరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదన్న గోరంట్ల.. వారు అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నామన్నారు. ఈ 16మందిలో 3ప్రాంతాల ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. తమ ఎమ్మెల్యే భవానీతో పాటు మరికొందరిని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారికున్న వ్యాపార సంస్థలపై దాడులు చేస్తామని బెదిరించారన్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ తెలుగుదేశం చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ నేత నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న 16మంది ఎమ్మెల్యేలు తమకు టచ్​లో ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఝలక్ ఇస్తేనే జగన్ మారతాడనే భావనలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతర్గత ఓటింగ్​లో ఎవరు ఎవరికి వేశారో.. తెలిసే అవకాశమే లేదని ఆయన తెలిపారు.

"ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీడీపీ చరిత్ర సృష్టిస్తుంది. అంతరాత్మ ప్రభోదానుసారం వైసీపీ ఎమ్మెల్యేలు మాకు ఓటు వేయబోతున్నారు. రహస్య ఓటింగ్‌లో ఎవరికి వేశారో తెలిసే అవకాశమే లేదు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్‌లో ఉన్నారు"-నిమ్మల రామానాయుడు, టీడీపీ నేత

ఆ నలుగురిలో తప్పు చేశామనే భావన: తెలుగుదేశం అభ్యర్థుల సంఖ్య 23అని గ్రహించకుండా వైసీపీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పార్టీకి దూరమైన నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తప్పు చేశామనే భావనలో ఉన్నారన్నారన్నారు. వారు అంతరాత్మ ప్రభోదానుసారావు ఓటు వేస్తారని నమ్ముతున్నామని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

అధినేత ఇంటికి టీడీపీ ఎమ్మెల్యేలు: ఉండవల్లిలోని అధినేత చంద్రబాబు నివాసానికి టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అక్కడ అధినేత సమావేశం అనంతరం.. అసెంబ్లీ కమిటీహాల్​లో జరిగే ఓటింగ్‌లో పాల్గొనేందుకు చంద్రబాబుతో కలిసి ర్యాలీగా వెళ్లనున్నారు. చంద్రబాబు, ఎమ్మెల్యేలు ఒకేసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలకు 8 మంది పోటీ పడుతుండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్‌ తిన్న వైసీపీ.. ఇప్పుడు మాత్రం ఏడుకు ఏడు స్థానాలు కైవసం చేసుకోవాలని పంతం పట్టింది. ఒక్క ఎమ్మెల్యే చేజారకుండా జాగ్రత్త పడుతోంది. రహస్య ఓటింగ్‌, అంతర్గత అసంతృప్తి.. అధికార పక్షాన్ని కలవరపెడుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details