ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్​ బకాయిల కోసం ప్రభుత్వం మరో నిర్ణయం.. కచ్చితంగా పాటించాల్సిందే..!

By

Published : Mar 11, 2023, 7:39 AM IST

Pay Electricity Dues From Available Funds

Pay Electricity Dues From Available Funds : పంచాయతీలపై మరో పిడుగు పడింది. అందుబాటులో ఉన్ననిధుల నుంచి విద్యుత్తు బకాయిలు చెల్లించాలని ఉద్యోగులను ప్రభుత్వం ఆదేశించింది. తక్షణం చర్యలు తీసుకోకపోతే చర్యలు తప్పవంటూ విస్తరణాధికారులు, కార్యదర్శులను హెచ్చరించింది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించే ప్రత్యేక నిధులు, సాయం ఏమీ లేకపోగా.. పంచాయతీల నిధులను విద్యుత్తు బకాయిల కింద వసూలు చేయడంపై పలువురు సర్పంచ్​లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pay Electricity Dues From Available Funds: రాష్ట్రానికి గ్రామాలు పట్టుకొమ్మలాంటివి అనే నానుడి ఉంది. గ్రామాలు అభివృద్ధి చెందితే.. ఆ తర్వాత పట్టణాలు, జిల్లాలు తద్వారా రాష్ట్రాలు, దేశాలే వృద్ధి చెందుతాయంటారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఉంది. గ్రామాల్లో అభివృద్ధి మాట ఏమో కానీ ఆ పనుల కోసం కేటాయించిన రూపాయిని ప్రభుత్వం మిగల్చడం లేదు.

గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూపాయి కూడా మిగిల్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న ఆర్థిక సంఘం నిధులను.. గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించకుండా.. విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద ప్రత్యక్షంగా, పరోక్షంగా పంచాయతీల ఖాతాల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఊడ్చేసి పారేసింది. ఇక ఇప్పుడు ఏకంగా అందుబాటులో ఏ నిధులు ఉంటే.. ఆ ఖాతాల్లో నుంచి మిగిలిన బకాయిలు చెల్లించాల్సిందేనని ఉద్యోగుల మెడపై కత్తి పెట్టింది.

తక్షణం చర్యలు తీసుకోకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీ విస్తరణ అధికారులకు, కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారులు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయం కార్యదర్శుల ద్వారా సర్పంచ్​లకు తెలియజేయాలని డీపీవో(DPO)లు సూచించారు.

14, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి విద్యుత్తు ఛార్జీల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12వందల 44 కోట్ల రూపాయలను సర్దుబాటు చేసింది. 2021-22 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 948.34 కోట్ల రూపాయలను 15వ ఆర్థిక సంఘం నిధులనూ పంచాయతీలకు చెందిన పర్సనల్‌ డిపాజిట్‌ ఖాతాల్లో వేసి తిరిగి సర్పంచులు, కార్యదర్శులు ద్వారా బకాయిల కింద వసూలు చేస్తోంది. కొన్ని జిల్లాల్లో సర్పంచులు చెల్లించేందుకు ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఖాతాల్లో ఏ నిధులు అందుబాటులో ఉంటే వాటిని చెల్లించాలని ఆదేశించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

పంచాయతీల్లో ఎలాంటి నిధులైనా వ్యయానికి సంబంధించి సర్పంచులు తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో .. ఉద్యోగులపై ఒత్తిడి పెంచడంతో పన్నుల ఆదాయం, ఇతర పద్దుల కింద వచ్చే నిధుల్లో నుంచి బకాయిలు రాబట్టాలని ప్రభుత్వం చూస్తోంది. సర్‌ఛార్జీల భారం నుంచి బయటపడేందుకు బకాయిలు చెల్లించాలని గ్రామ పంచాయతీలకు పంపిన ఉత్తర్వుల చివరలో సూచించింది. అయితే దీనిపై పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, ఎటువంటి సాయం అందించకపోగా విద్యుత్​ బకాయిల కోసం పంచాయతీ నిధులను వాడుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details