ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Electricity Subsidy: ఏపీలో విద్యుత్ రాయితీపై కోతలు.. 2.35 లక్షల కుటుంబాలకు షాక్​..

By

Published : Jul 24, 2023, 7:07 AM IST

Electricity Subsidy: సభ, సమావేశం ఏదైనా సీఎం జగన్‌ పేదల సంక్షేమ జపం చేస్తారు. దళిత, గిరిజనులపై తనకే అపారమైన ప్రేమ ఉందనేలా 'నా ఎస్సీ, నా ఎస్టీ' అనే పదాలను పదే పదే వల్లె వేస్తారు. వారిని ఆదుకునేందుకు వచ్చిన దళిత, గిరిజన బాంధవునిలా మాట్లాడతారు. కానీ వాస్తవం వేరు. కూలీనాలీ చేసుకుని బతుకుబండి లాగే ఎస్సీ, ఎస్టీ పేదలనీ కూడా చూడకుండా 200 యూనిట్ల విద్యుత్తు రాయితీ అమలు విషయంలో కోతల వాతలు పెడుతూనే ఉన్నారు. విద్యుత్తు రాయితీ పరిమితిని పెంచామంటూనే ఆ మేరకు లబ్ధిదారుల సంఖ్యను తెరచాటుగా తెగ్గోస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

విద్యుత్‌ రాయితీపై కోతలు

Electricity Subsidy: ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం అమలు చేసిన విద్యుత్‌ రాయితీ పథకానికి వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోంది. గతంలో వీరికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించేవారు. ఎన్నికల హామీలో భాగంగా జగన్‌ 200 యూనిట్లకు పెంచారు. దీంతో 2.82 లక్షల మందికి అదనంగా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కానీ 2021-22తో పోల్చితే 2022-23లో 2.35 లక్షల మంది దళిత, గిరిజనులకు జగ్జీవన్‌ జ్యోతి పథకం కింద ఇచ్చే విద్యుత్తు రాయితీని ఎత్తేశారు. పోనీ వారి బతుకుదెరువు మారడానికి కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఒక్కటైనా స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేశారా అంటే అదీ లేదు. మరి ఇంతమంది ఎస్సీ, ఎస్టీలను ఏ కారణంతో రాయితీకి దూరం చేశారు? వారి ఆర్థిక స్థితి గణనీయంగా పెరగడానికి మ్యాజిక్‌ చేశారా? లేదా సభల్లో మాటల గారడీ చేసినట్లే 'ఛూ..మంత్రకాళీ' అంటూ మంత్రమేమైనా వేశారా అని ఎస్సీ, ఎస్టీ సంఘాలు మండిపడుతున్నాయి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని, సాగు భూమి ఎక్కువగా ఉందని, ఒకే ఆధార్‌ నంబర్‌పై ఎక్కువ కనెక్షన్లు ఉన్నాయని, ఇలా రకరకాల కారణాలు చూపి.. ఉచిత విద్యుత్తు పథకానికి అర్హులైన చాలామందికి ప్రభుత్వం రాయితీ ఎత్తేసింది. తాము ఎస్సీ, ఎస్టీలమేనని కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా, తమ పేరిట భూమి లేదని నిరూపించుకుంటున్నా, ఆధార్‌ నంబర్‌పై ఎక్కువ కనెక్షన్ల నమోదు సాంకేతిక తప్పిదమే అని తేలుతున్నా ఉచిత విద్యుత్తు పునరుద్ధరణ మాత్రం జరగదు. పోనీ వారు అనర్హులని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నారా అంటే అదీ లేదు. కానీ అర్హతను నిరూపించుకోమంటారు. వారి అర్హతను చెప్పే వాలంటీర్లు గ్రామగ్రామానా ఉన్నా రాయితీ అందించడంలో జాప్యమెందుకు చేస్తున్నారు? అర్హత ఉన్నా ఏళ్ల తరబడి పథకం వర్తించకపోవడంలో ఆంతర్యమేంటి? ఇది రాయితీని ఎగ్గొట్టే ఉద్దేశం కాదా? కుల ధ్రువపత్రాలతో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోకపోవడమేనా వారిపై అపార ప్రేమను చూపడమంటే?.

2021-22లో రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు పథకం వర్తించే ఎస్సీ, ఎస్టీల సంఖ్య 22.52 లక్షలుగా ఉంది. గతేడాది మే నెలలో చేపట్టిన సర్వే తర్వాత వారి సంఖ్య 20.16 లక్షలకు తగ్గింది. అంటే 2021-22తో పోల్చితే 2022-23లో ఉచిత విద్యుత్తు అందుతున్న వారి సంఖ్య 2.35 లక్షలు తగ్గింది. తీసేసిన వారిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు పొందినవారు, ఎస్సీల పేరిట రాయితీని అక్రమంగా పొందుతున్న ఇతరులు కొంతమంది ఉంటారనుకున్నా మిగతావారి పరిస్థితి ఏంటి? సాంకేతిక తప్పిదాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను క్షుణ్నంగా తనిఖీ చేసి నిర్ధారించుకోకుండానే ప్రభుత్వం అర్హులకు రాయితీని ఎగ్గొట్టింది. పథకానికి నిర్దేశించిన అన్ని అర్హతలున్నా పక్కన పెట్టింది. ఇలా ప్రతి 3 నెలలకోసారి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా తనిఖీ చేస్తూ కోత వేస్తోందని ఎస్సీ, ఎస్టీ సంఘాలు మండిపడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details