ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్ని ఏళ్లయినా తరగని స్ఫూర్తి.. ఆయన పథకాలే పేదలకు తారక మంత్రాలు

By

Published : Jan 9, 2023, 6:33 AM IST

Updated : Jan 9, 2023, 12:45 PM IST

NTR POLITICAL JOURNEY: అది పేదల ఆకలి తీర్చేందుకు నాంది పలికిన రోజు. రాష్ట్రాలంటే ఓటర్ల జాబితాలు కాదు.. భరతమాత తలరాతలని తేల్చుతూ, తెలుగుజాతి గొంతుకై నిలిచిన రోజది. నిర్లక్ష్యానికి గురైన ఆరు కోట్ల గుండె చప్పుళ్లు ఒక్కటై మహానాయకుడికి పట్టం కట్టాయి. అందరి బాధల కన్నీళ్లు తుడుస్తూ రాజకీయ చైతన్యానికి నాంది పలుకుతూ తెలుగు నేలపై ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా 40ఏళ్లు.

NTR POLITICAL JOURNEY
NTR POLITICAL JOURNEY

NTR POLITICAL JOURNEY : 1983 జనవరిలో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఎన్టీఆర్​.. కాంగ్రెస్​ నీచ రాజకీయాన్ని పసిగట్టలేక.. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే మరి అప్పుడేం చేశారు? అనే సందేహం రావొచ్చు. రాష్ట్రంలో ఓడిపోయినా.. తెలుగు దేశాధిపతిగా దేశంలో గెలిచారు. నేషనల్‌ ఫ్రంట్ ఛైర్మన్​గా జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించారు. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఒకే వేదిక మీదికి తెచ్చి.. జనతా ప్రయోగం విఫలమయ్యాక తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఓడిపోయిన.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర: ఎన్టీ రామారావు 1989లో ఓడిపోయాడు సరే? అప్పుడేం చేశాడు? ఎందరికి తెలుసు? ఓటమితో రగిలారా? ఎందుకొచ్చానీ రాజకీయాల్లోకి అని అనుకున్నారా? అదేం కాదు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఫెడరలిజానికి పెడరెక్కలు విరిచి.. అభివృద్ధిలో పరుగెత్తమనే తరహా విధానాలను నిరసించారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని ప్రధాని ఇందిరా గాంధీతోనే వాదించారు.. ఒప్పించారు.

ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రులు కావడానికి తన వంతు సహకారం: కేంద్ర రాష్ట్రాల అధికారాలను పున: సమీక్ష కోసం నాడు ఎన్టీఆర్.. ప్రతిపక్షాలు, రాజ్యాంగ నిపుణులతో ఒత్తిడి తెచ్చారు. చిట్టచివరకు యూనియన్ ప్రభుత్వం సర్కారియా కమిషన్​ను నియమించింది. అంతకు ముందే ప్రతిపక్షాలను ఒక్కటిగా చేసి శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీ అధినేతలు.. ముఖ్యమంత్రులు కావటానికి తన వంతుగా వెళ్లి ప్రచారం చేశారు.

ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చిన మహనీయుడు: 1983లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రామకృష్ణ హెగ్డేకి మద్దతుగా, 1984లో ఎంజీఆర్​కు, 1987లో హర్యానాలో దేవీలాల్​కు, 1988 శాసన సభ ఎన్నికల్లో కరుణానిధికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన అన్ని సందర్భాల్లో వారు గెలిచారు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్​గా ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించే ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటి మీదకు తెచ్చారు. జాతీయ పార్టీలను కలిపి నడిపారు. ఆయన కృషి ఫలించి 1989లో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ గెలిచింది. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌ ప్రధాని అయ్యారు.

సమావేశం బహిష్కరణ.. దెబ్బతిన్న ఇందిరా గాంధీ అహం: గట్స్ ఉన్నాయా అని మాట్లాడటం ఇప్పుడో ఫ్యాషనైంది. నిజంగా గుండె ధైర్యం గురించే చెప్పాలంటే ఎన్టీరామారావు తర్వాతనే ఎవరైనా. ఎన్టీఆర్ తొలిసారి దేశమంతటినీ ఆకర్షించిన ఒక సంఘటనను ప్రస్తావించాలి. ఇది 1984 ఆగస్టు సంక్షోభానికి ముందు జరిగింది. ప్రధాని ఇందిరా అధ్యక్షతన ఏర్పాటైన జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాల్గొన్నారు. కశ్మీర్​లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అక్రమంగా కూలదోసినందుకు నిరసనగా తాను సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పి బయటికి నడిచారు. దాంతో ఇందిరా అహం దెబ్బతిన్నది. తనను ఎదిరించిన ఎన్టీఆర్ మీద కక్ష గట్టారు. ఎన్టీఆర్ గెలుపునే జీర్ణించుకోలేని ఇందిరా గాంధీ.. ఈ చర్యతో మరింత ఆగ్రహానికి లోనయ్యారు.

రాజ్యాంగేతర శక్తుల నియంత్రణకు ఏకమైన టీడీపీ : 1994లో ఆంధ్రప్రదేశ్​లో మళ్లీ ఎన్టీఆర్ ప్రభంజనం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. 1995లో కొన్ని పరిణామాలతో ఎన్టీఆర్ పదవిని కోల్పోయారు. రాజ్యాంగేతర శక్తుల నియంత్రణకు పార్టీ ఏకమైంది. కుటుంబమంతా పార్టీకి మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ పదవిని కోల్పోయారు. కుటుంబం మద్దతుతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. స్వయం కృషితో 1999 ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు.

ఇదిలా వుంటే.. ఎన్టీఆర్ తొలి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మనదేశం'లో పోలీస్​ ఆఫీసరు పాత్ర.. సత్యాగ్రహులను అరెస్టు చేసిన చేతులు. 'నేనింతవాడిని కావాటానికి ఎంత కష్టపడ్డానో తెలుసా' అనే డైలాగ్ ఉంది. అది అక్షరాలా ఆయన జీవితానికి సరిపోతుంది.

విజయవాడలో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం ఏర్పాటు: 1986లో హైదరాబాద్​లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నెలకొల్పారు. 1986 ఏప్రిల్ 9న విజయవాడలో హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అన్ని వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందికి తెచ్చి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. నవంబర్ 1 నుంచి అది ప్రారంభమైంది.

హెల్త్ యూనివర్శిటీకి ఒక రూపాన్నిచ్చి వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు ప్రపంచస్థాయి మార్గం వేశారు ఎన్టీ రామారావు. ఆయన కృషికి గుర్తింపుగా 1998 ఫిబ్రవరి 2వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం NTR యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు పెట్టింది. ఇటీవల మళ్లీ పేరు మార్చారు. కానీ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు రామారావు చేసిన కృషి కలకాలం నిలిచే వుంటుంది.

సంపూర్ణ మద్యపాన నిషేధంతో.. తెలుగు మహిళల మనసుల్లో సుస్థిర స్థానం:ఇవేకాక 'సంపూర్ణ మద్య నిషేధా'న్ని అమలు పరిచారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడుతుందని ఆర్థిక వేత్తలు ఎంతలా చెప్పినా వినలేదు. సంపూర్ణ మద్య నిషేధానికి పూర్తి న్యాయం చేసి, తెలుగు మహిళల మనసుల్లో సుస్థిర స్థానం పొందారు. ఎన్టీఆర్‌ రైతులకు 11 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయించారు. పబ్లిక్ , ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం సూపర్ హిట్ అయ్యింది.

గ్రామాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. గ్రామాలలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయ భవనాలు సమకూరాయి. సంక్షేమ రాజ్యానికి ఎన్టీఆర్ నిర్వచనమిచ్చారు. ప్రతి పథకాన్ని మానవతా స్పర్శతో రూపకల్పన చేశారు. ఆదరణ లేని 2.27 లక్షల మంది పేద వృద్ధులకు నెలకు తలా 30 రూపాయల పింఛను, 5.64 లక్షల వ్యవసాయ కార్మికులకు నెలకు 30 రూపాయల పెన్షన్ ఇచ్చారు. 55 వేల మంది అనాథ వితంతువులకు ఒకొక్కరికీ నెలకు 50 రూపాయల పింఛన్ మంజూరు చేశారు.

తిరుమలను వాటికన్​ సిటీలా అభివృద్ది చేయాలని తపన: ప్రపంచమంతా ప్రణమిల్లే ఆదిదేవుడు శ్రీవేంకటేశ్వరుడు. అలాంటి ఏడుకొండలవాడు కొలువైన తిరుమలను వాటికన్ సిటీలా అభివృద్ధి చేయాలని ఎన్టీఆర్ తపించారు. ఆకలే అర్హత అనే నినాదంతో 1985 ఏప్రిల్ ఆరో తేదీన ఎన్టీఆర్ నిత్యాన్నప్రసాద పథకాన్ని ప్రారంభించారు. అప్పటిదాకా కేవలం రోజుకు రెండు వేలమందికి మాత్రమే అన్నప్రసాదం అందేది. దీన్ని ఎన్టీఆర్ భారీగా విస్తరించారు.

భక్తుల సదుపాయం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించారు. వేదపాఠశాలలు ఏర్పాటు చేశారు. కేవలం సంప్రదాయ కుటుంబాలే కాకుండా, నిమ్న వర్గాల వారినీ అర్చకులుగా తీర్చిదిద్దారు. కరవు కాటకాలు కమ్మినవేళ, ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడ్డ సమయాన..బాధితుల కోసం జనం మధ్యకు వచ్చారు. జోలెపట్టి విరాళాలు పోగుచేసి బాధితుల సహాయార్ధం ఇచ్చారు.

ప్రతి సినిమా పేరు ఓ సందేశమే: దేశంలో ప్రతిపక్షాలను ఏకతాటి మీదికి తెచ్చి దేశాన్ని ఏకఛత్రంగా ఏలుతున్న కాంగ్రెస్ పునాదులు పెకిలించిన ఆ యోధుడితో, రణధీరుడితో తెలుగువారిది తరతరాల అనుబంధం. చరిత్రలెన్నో తిరగరాసి, సంక్షేమ రాజ్యానికి నవ్య భాష్యం చెప్పిన నందమూరి తారకరాముణ్ణి.. గుండెగుడిలో కొలుచుకోవటమే కాదు.. అనునిత్యం తెలుగుజాతి తల్చుకుంటోంది.

ఎన్టీఆర్ సినిమాలే కాదు సినిమా పేర్లు సందేశాత్మకంగా ఉండేవి.. 1955లో వచ్చిన భాస్కర ప్రొడక్షన్స్ సినిమా పేరు 'చెరపకు రా చెడేవు', 'అప్పుచేసి పప్పుకూడు', 'కలసివుంటే కలదు సుఖం', 'చిక్కడు దొరకడు', 'మనుషుల్లో దేవుడు', 'మంచికి మరోపేరు', 'యుగపురుషుడు', 'తిరుగులేని మనిషి'. అతడు వ్యక్తి, జనశక్తి. అవస్థలు తొలగించిన వ్యవస్థ. నిరంతర చర్చనీయాంశం.

అతని మరణం చివరి చరణం కాదు: అతడి సినీ జీవితమైనా, రాజకీయ జీవితమైనా నిత్య స్ఫూర్తి. 1996 జనవరి 18 గురువారం నాడు ఎన్టీ రామారావు మహాభినిష్క్రమణం చేశారు. ఓ యువకవి అన్నట్లు మరణం చివరి చరణం కాదు. మరణం తర్వాతా జీవించిన వ్యక్తి, జీవిస్తున్న వ్యక్తి నటరత్న నందమూరి తారక రామారావు. నలభై ఏళ్లే కాదు 4 వందల ఏళ్లయినా తారకరాముని స్ఫూర్తి వన్నెతరగదు. పేదరికం ఉన్నంత కాలం ఆయన పథకాలు తారకమంత్రాలే.

ఎన్ని ఎళ్లయినా తరగని స్ఫూర్తి.. ఆయన పథకాలే పేదలకు తారక మంత్రాలు

ఇవీ చదవండి:

Last Updated :Jan 9, 2023, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details