ఆంధ్రప్రదేశ్

andhra pradesh

No Funds: నాడు సంపద సృష్టించి.. నేడు నిధులు లేక నిర్వీర్యం

By

Published : Jul 23, 2023, 7:18 AM IST

Updated : Jul 23, 2023, 8:05 AM IST

No Funds To Panchayats : గత ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం.. గ్రామాల్లోనే సంపద తయారీ కేంద్రాలను ప్రారంభించింది. అవి నేడు వైసీపీ ప్రభుత్వంలో నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని సంపద తయారీ కేంద్రాలైతే వాటి ఉనికినే కోల్పోయాయి.

No Funds To Panchayats
సంపద తయారీ కేంద్రాలు

నాడు సంపద సృష్టించి.. నేడు నిధులు లేక నిర్వీర్యం

No Funds to revenue generate centres: 'పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోండి.. వ్యర్థాల సేకరణకు ప్రత్యేక నంబరును డిస్‌ప్లే చేసి.. దానికి కాల్‌ రాగానే వాహనంలో చెత్తను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు తరలించండి. అపరిశుభ్రత, దోమల వల్ల ఊళ్లలో రోగాలు రాకుండా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టండి అని' 2021 జులై 13న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ సమీక్షలో అధికారులకు సీఎం జగన్‌ చెప్పిన మాటలివి. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే వ్యర్థాలతో నాడు సంపద సృష్టించిన కేంద్రాల ఉనికి నేడు ప్రశార్థకంగా మారింది. అందులో పనిచేస్తున్న క్లాప్‌ మిత్రలకు 8 నెలలుగా జీతాలు అందని దుర్భర పరిస్థితి నెలకొంది.

గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య శాశ్వత పరిష్కారానికి.. గత ప్రభుత్వం పంచాయతీకి ఓ సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. హరిత రాయబారుల ద్వారా ఇళ్లు, వీధుల్లో వ్యర్థాలు సేకరించి, వాటి నుంచి ఎరువుల తయారీ.. విక్రయాల ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. తూర్పు గోదావరి జిల్లాలోని పి. గన్నవరం మండలం కుందలపల్లిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు.

13 వేలకు పైగా సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 40 వేల మంది హరిత రాయబారులను నియమించారు. సంపద తయారీ కేంద్రంలో చెత్త నుంచి తయారైన ఎరువులను గ్రామాల్లో రైతులకు మార్కెట్​లో లభించే ధర కన్నా తక్కువ ధరకు విక్రయించేవారు. ఎంతో చక్కగా అమలైన ఈ కార్యక్రమం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తారుమారైంది. సంపద తయారీ కేంద్రాలకు నిధుల కొరత, కార్మికులకు సరిగా జీతాలు అందించలేని కారణంగా చాలా కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. వాటి ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారింది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 991 చెత్త నుంచి సంపద ఉత్పత్తి కేంద్రాల షెడ్లు ఏర్పాటు చేయగా.. వీటిలో ఇప్పుడు 150 మాత్రమే పనిచేస్తున్నాయి. చాలా గ్రామాల్లో వాటి నిర్వహణ సరిగ్గా లేక ముళ్లపొదలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల షెడ్లు శిధిలావస్థకు చేరాయి. మందు బాబులకు అడ్డాగా మారాయి. అసాంఘిక కార్యక్రమాలూ జరుగుతున్నాయి. చెత్త సేకరణకు కేటాయించిన రిక్షాలు, ఆటోలు అనేకచోట్ల మరమ్మతులకు గురయ్యాయి.

"జగన్​మోహన్​ రెడ్డి వచ్చిన తర్వాత వీటిని పట్టించుకున్న వారు లేరు. వీటిక సంబంధించిన వాహనాలు ఇదివరకు గ్రామం మొత్తం తిరుగుతు ఉండేవి. ఇప్పుడు అవి తిరిగే దాఖాలాలు లేవు. వాహనాలు రిపేరుకు వస్తున్న కూడా పట్టించుకునే వారే లేరు." - స్థానికుడు

"గత తొమ్మిది నెలల నుంచి మాకు జీతాలు అందలేదు. అధికారులను అడిగితే నిధులు లేవని సమాధానమిస్తున్నారు. పంచాయతీలో నిధులు ఉంటే మీకు జీతాలు ఇస్తాము. అంతే తప్పా మేమేమి చేయలేమని అంటున్నారు." -కార్మికుడు

సంపద తయారీ కేంద్రాల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలదేనని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి రెండు విడతలుగా 1,581 కోట్ల రూపాయలను పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిలకు ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఆస్తి పన్ను, ఇతర పద్దుల కింద వచ్చే సాధారణ నిధుల్లో నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిలు వసూలు చేస్తోంది. ఈ పరిణామాలతో పంచాయతీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంపద తయారీ కేంద్రాల నిర్వహణ పంచాయతీలకు ఎలా సాధ్యమవుతుందని అధికార వైసీపీ సర్పంచులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

చెత్త సేకరించే నాటి హరిత రాయబారులు, ప్రస్తుత క్లాప్‌ మిత్రలకు.. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ సంస్థ నుంచి ప్రతి నెలా జీతాలు చెల్లించేవారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ గత ఏడాది అక్టోబరు వరకు ఇదే విధంగా జీతాలిచ్చారు. కానీ నవంబరు నుంచి ఇప్పటివరకు జీతాలు చెల్లించలేదు. 8 నెలల పెండింగ్‌ జీతాలను ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి చెల్లించాలని పంచాయతీలను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన నిధులను తీసుకుంటున్నరాష్ట్ర ప్రభుత్వం.. తమను జీతాలు చెల్లించమనడం దారుణమని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యంతో క్లాప్‌మిత్ర కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోటలో కార్మికుడొకరు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి దుర్భర పరిస్థితికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 25 వేలకుపైగా ఉన్న చెత్త సేకరణ రిక్షాల్లో 13 వేలకుపైగా నిర్వహణ లోపంతో మూలకు చేరాయి. వీటి మరమ్మతులకూ ప్రభుత్వం నిధులివ్వడం లేదు.

Last Updated : Jul 23, 2023, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details