ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడేపల్లిలో పెట్రేగిపోతున్న గంజాయి ముఠాలు..

Ganja In Tadepally : తాడేపల్లిలో గంజాయి గ్యాంగ్‌ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్నా.. వారి అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి నెలకొంది. ఆదివారం రాత్రి జరిగిన అంధ బాలిక హత్య.. సమస్య తీవ్రతను రుజువు చేసింది. పోలీసుల వైఫల్యంతోనే అత్యంత అమానవీయ ఘటన జరిగిందని.. మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 14, 2023, 9:17 AM IST

తాడేపల్లిలో మితిమీరిన గంజాయి గ్యాంగ్‌ల ఆగడాలు

Ganja Gangs In Tadepally : ముఖ్యమంత్రి జగన్ నివసించే తాడేపల్లి ప్రాంతంలో గంజాయి ముఠాల ఆగడాలు పెచ్చుమీరాయి. భద్రత పరంగా అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో అరాచకాలకు అవకాశమే లేకుండా చూడాల్సిన పోలీసులు.. ఆ పని చేయడం లేదు. బాధితులే స్వయంగా ముందుకొచ్చి ఫిర్యాదులు ఇస్తున్నా.. కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఉదాసీనత వల్లే ఆదివారం రాత్రి గంజాయి సేవించిన ఓ యువకుడు.. ఎస్సీ బాలిక ఇంట్లోకి చొరబడి అమెను కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో సీఎం నివాసానికి పరిధిలో నేరాలు : గతంలోనూ సీఎం జగన్‌ నివాసానికి కిలోమీటరు పరిధిలో ఎన్నో నేరాలు జరిగాయి. గంజాయి సేవించిన ముఠా సలాం హోటల్‌ కూడలిలో ఓ హోంగార్డుపై దాడికి పాల్పడింది. సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద 2021 జూన్‌ 20న ఎస్సీ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితులు కూడా.. గంజాయి సేవించి ఉన్నారు. అంధ బాలిక హత్య కేసులో నిందితుడైన కుక్కల రాజు.. గతంలోనూ గంజాయి మత్తులో ఎన్టీఆర్‌ కట్టపై ఓ హెడ్‌కానిస్టేబుల్‌పై అతి కిరాతకంగా దాడి చేశాడు. దీనిపై తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తరచూ జనంపై దాడులకు దిగడం, గంజాయి మత్తులో జోగడం కుక్కల రాజు నైజమని స్థానికులు చెబుతున్నారు. పది రోజుల కిందట ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. మొదట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంటే... ఇప్పుడు ఇలాంటి దారుణం జరిగేదని కాదని అంటున్నారు.

"ఇలాంటి ఘటనలు జరగటానికి ప్రధాన కారణం గంజాయి, మద్యం షాపులు. వీటివల్ల చిన్న తనంలోనే మత్తు పదార్థాలకు భానిసలవుతున్నారు. మత్తుకు బానిసవటం వల్ల మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయి."-స్థానికురాలు

తాడేపల్లిలో కొందరు గంజాయి బ్యాచ్‌లకు భయపడి.. ఫిర్యాదు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఉండవల్లి, తాడేపల్లి, సీతానగరం, ముగ్గురోడ్డు, లంబాడీపేట, నులకపేట, ప్రకాశ్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌, ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌లు పాగా వేస్తూ.. నేరాలకు తెగబడుతున్నట్లు వాపోతున్నారు. మహిళలైతే ఒంటరిగా వెళ్లే పరిస్థితే లేదని అంటున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే గంజాయి మత్తులో జరిగిన ఘటన కాదని.. మద్యం మత్తులో జరిగిందని పోలీసులు తేల్చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఇప్పుడు నేరానికి పాల్పడిన వ్యక్తికి అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. చిన్న పిల్లలను కొడతాడు. గతంలో మా ఆవిడ పైన కత్తితో దాడి చేశాడు. నేను ఉన్నాను కాబట్టి బతికించుకున్నాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టారు. జైలుకు వెళ్లాడు, వచ్చాడు. మళ్లీ అలాంటి ఘటనే జరిగింది. అతనిని వదిలితే మాత్రం చాలా అపాయం."-తాడేపల్లి వాసి

తమ కట్టపై గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని.. అది సేవించి కొంతమంది పిల్లలు నేరాలకు పాల్పడి పాడైపోతున్నారంటూ.. లంబాడీపేట మహిళలు జనవరి 31న తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్వయానా వైసీపీకి చెందిన ఎంపీటీసీ ఫిర్యాదు చేసినా అతీగతీ లేదు. ఇప్పటికైనా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే మరిన్ని ఘటనలు జరగకుండా ఆపే అవకాశం ఉంటుందని.. మహిళా సంఘాల నేతలు అంటున్నారు.

"ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సీఎం నివాసానికి పక్కనే గంజాయి బ్యాచ్​లు, చైన్​ స్నాచర్లు దాడి చేసుకుని, కొట్టకొని రోజు లేదు. శాంతి భద్రతలు తాడేపల్లిలో పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, శాంతి భద్రతలను కాపాడాలని కోరుతున్నాను."- సంజీవరెడ్డి, వైఎస్సార్​సీపీ ఎంపీటీసీ

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details