ETV Bharat / state

పనితీరు మార్చుకోకుంటే.. వచ్చే ఎన్నికల్లో టికెట్​ ఇచ్చేది లేదు: సీఎం జగన్​

author img

By

Published : Feb 13, 2023, 7:59 PM IST

Updated : Feb 14, 2023, 6:30 AM IST

CM JAGAN REVIEW ON GADAPA GADAPA: గడప గడపకూ ప్రచార జోరు పెంచేందుకు అధికార వైఎస్సార్​సీపీ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 1.65 కోట్ల ఇళ్ల తలుపులకు.. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ పెద్ద స్టిక్కర్లు, ఇళ్లలోని వారి సెల్‌ఫోన్లకు చిన్నసైజు స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించింది. మొత్తం 5.65 లక్షల మంది సచివాలయ వైఎస్సార్​సీపీ సమన్వయకర్తలు, గృహసారథులతో ‘జగనన్నే మా భవిష్యత్తు’పేరిట ప్రచార కార్యక్రమం చేపట్టాలని.. మంత్రులు, వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులకు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టంచేశారు. పనితీరు మారకుంటే మార్పులు తప్పవని ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

CM JAGAN REVIEW ON GADAPA GADAPA
CM JAGAN REVIEW ON GADAPA GADAPA

CM JAGAN REVIEW ON GADAPA GADAPA PROGRAM: మంత్రులు, వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సోమవారం సమావేశమైన ముఖ్యమంత్రి జగన్.. వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 93శాతం గృహసారథుల నియామకం పూర్తయిందని.. మిగిలినవారినీ ఈ నెల 16లోగా నియమించాలని నిర్దేశించారు. ఇవి పూర్తయితే క్షేత్రస్థాయిలో 5.65 లక్షల మందితో వైఎస్సార్​సీపీ సైన్యం అందుబాటులోకి వస్తుందని.. వీరితోనే పార్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని స్పష్టంచేశారు. ఇప్పటికే 387 మండలాల్లో శిక్షణ ఇచ్చారని, మిగిలిన మండలాల్లోనూ ఈ నెల 19లోగా శిక్షణను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

మార్చి 18 నుంచి నిర్వహించే ప్రచార కార్యక్రమంలో గృహసారథులు ఇంటింటికీ తిరుగుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారు..?, దానికి భిన్నంగా, అంతకుమించి ఇప్పుడు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చేసిందేంటి..?, వారి ఇళ్లలో ఇచ్చిన పథకాలేంటి అనే వివరాలతో కూడిన ప్రచార పత్రాలను ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రభుత్వం నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారనే సమాచారాన్నీ సేకరించాలన్నారు. జగన్‌ ప్రభుత్వంపై మీ అభిప్రాయాలను తెలపండి అంటూ 5 అంశాలతో కూడిన ఒక పత్రాన్ని భర్తీ చేయించుకుని.. వారికి ఇబ్బంది లేకపోతే సంతకం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. జగన్‌ ప్రభుత్వంపై నమ్మకం ఉందంటే ఈ నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వండి అంటూ ఒక నెంబరు కూడా ఇవ్వనున్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు మే నెలలోపు పనితీరును మెరుగుపరుచుకోకుంటే.. కొత్త సమన్వయకర్తలను నియమిస్తామని స్పష్టంచేశారు. సుమారు 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. మీ మంచి కోసమే చెబుతున్నానని అన్నారు. ప్రజల్లో ఉంటూ పనితీరు మెరుగుపరుచుకోవాలని.. లేకుంటే ఆ తర్వాత సమయం ఉండదన్నారు. అలాంటి పరిస్థితి వస్తే కొత్తవాళ్లను తీసుకువచ్చి ప్రజల్లోకి పంపాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిసింది.

గడప గడపకు కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటివరకు బాగా చేసిన టాప్‌-10, చివర్లో నిలిచిన 10 మంది పేర్లను సీఎం ప్రకటించారు. డిసెంబరు 16న జరిగిన గత సమావేశం నుంచి ఇప్పటివరకు పనితీరు బాగోలేని 20 మంది పేర్లను ఐప్యాక్‌ ప్రతినిధి రిషిరాజ్‌ వెల్లడించారు. వారిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, కొడాలి నాని, చెన్నకేశవరెడ్డి, బొత్స అప్పలనరసయ్య, చింతల రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, జొన్నలగడ్డ పద్మావతి, మద్దిశెట్టి వేణుగోపాల్, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గ్రంధి శ్రీనివాస్, అన్నా రాంబాబు, కాటసాని రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జి.శ్రీనివాసనాయుడు ఉన్నట్లు సమాచారం.

ఇక నియోజకవర్గ బాధ్యుల్లో తాడికొండకు చెందిన సురేష్‌, విశాఖ పశ్చిమ ఇన్‌ఛార్జి అడారి ఆనంద్‌, పర్చూరు బాధ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ ఉన్నట్లు తెలిసింది. సచివాలయాల పరిధిలో కేవలం 2 గంటల్లోపు తిరిగిన మరో కేటగిరిలో.. మంత్రులు దాడిశెట్టి రాజా, విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌ ఉన్నట్లు సమాచారం. డిసెంబరు 16 నుంచి ఇప్పటివరకు ఇంటింటికీ తిరగడంలో.. దూలం నాగేశ్వరరావు, వరికూటి అశోక్‌బాబు, రాచమల్లు శివప్రసాదరెడ్డి మొదటి మూడు స్థానాల్లో నిలిచినట్లు సీఎం ప్రకటించారు.

ప్రభుత్వం వచ్చాక ప్రజలకు చాలా చేస్తున్నామని.. అందువల్ల ఎన్నికలు జరిగే మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో కచ్చితంగా వైఎస్సార్​సీపీ గెలిచి తీరాలని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, ప్రకాశం- నెల్లూరు-చిత్తూరుకు బాలినేని శ్రీనివాసరెడ్డి, కడప-అనంతపురం-కర్నూలుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తారని చెప్పారు. వాటి పరిధిలోని ఎమ్మెల్యేలందరిపైనా అభ్యర్థుల గెలుపు బాధ్యత ఉంటుందని.. దానికి వారే పూర్తి బాధ్యులని సీఎం స్పష్టంచేశారు. మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్​సీపీ అభ్యర్థులు, పార్టీ బలపరిచిన ఉపాధ్యాయ నియోజకవర్గాల అభ్యర్థులు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి, సీతంరాజు సుధాకర్, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, M.V.రామచంద్రారెడ్డిని.. ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2023, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.