ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చివరి దశకు చేరిన పంటలు.. నీటి విడుదల నిలిపివేత.. ఆందోళనలో రైతులు

By

Published : Apr 9, 2023, 9:22 AM IST

Farmers Worried about Water: నాగార్జున సాగర్ కుడికాల్వకు నీటి విడుదల నిలిపివేతతో.. అన్నదాతల్లో ఆందోళన ప్రారంభమైంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు జిల్లాల్లోని ఆయుకట్టు కింద రైతులు సాగు చేస్తున్న పంటలు.. చివరి దశకు చేరుకున్న సమయంలో నీటి తడి ఇవ్వకపోతే దిగుబడులపై ప్రభావం పడుతుందని.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి వెన్ను పొట్టకట్టే దశలో నీటి తడులు ఆపడం భావ్యంకాదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

farmers
రైతులు

చివరి దశకు చేరిన పంటలు.. నీటి విడుదల నిలిపివేత.. ఆందోళనలో రైతులు

Farmers Worried about Water: నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం 530 అడుగుల కన్నా తగ్గడంతో జల విద్యుత్తు కేంద్రం ద్వారా నీటి విడుదల ఆపేశారు. కుడి కాల్వ రెగ్యులేటర్ గేట్ల నుంచి నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ అంగీకరించకపోవడంతో కాల్వలకు నీటి విడుదల నిలిచిపోయింది. ఈ నెల 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జలవిద్యుత్తు కేంద్రం ఉత్పత్తి నిలిపేయడంతో నీటి విడుదల ఆగింది. బుగ్గవాగులో నిల్వ ఉన్న నీటిని ప్రస్తుతం కాల్వలకు విడుదల చేశారు.

కుడి కాల్వలకు 132 టీఎంసీల నీటి కేటాయింపులుండగా.. ఇప్పటికే 200 టీఎంసీల నీటిని వాడుకున్నారు. కేటాయింపులకు మించి వాడుకున్నందున నీటిని ఇకపై విడుదల చేయబోమని తెలంగాణ అడ్డుచెబుతోంది. కుడికాల్వ ఇంజినీర్లు నీటి అవసరాలను తెలియజేస్తూ ఉన్నతాధికారులకు నివేదికను పంపారు. జల వనరులశాఖ అధికారులు కేఆర్​ఎంబీకి లేఖ రాసి నీటిని విడుదల చేయించాల్సి ఉంది. కృష్ణా నదికి వరదల సమయంలో కాల్వలకు విడుదల చేసిన 50 టీఎంసీలను మినహాయించి మరికొన్ని రోజులు నీటిని విడుదల చేయాలని.. అధికారులు, రైతులు కోరుతున్నారు.

ప్రస్తుతం బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి 1798 క్యూసెక్కుల నీటిని కుడికాల్వకు వదులుతున్నారు. రిజర్వాయర్ లో తాజాగా 0.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి కాల్వ ద్వారా జూలకల్లు బ్రాంచి కాల్వకు పూర్తిగా నీటిని నిలిపేశారు. బెల్లంకొండ బ్రాంచి కాల్వకు 252 క్యూసెక్కులు, గుంటూరు బ్రాంచి కెనాల్ కు 500 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచి కాల్వకు 400 క్యూసెక్కులు నీటిని సరఫరా చేస్తున్నారు.

ఒంగోలుకు 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. కాల్వల్లో పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం లేకపోవడంతో నీరు అందని పరిస్థితి ఏర్పడిందని రైతులు నిట్టూరుస్తున్నారు. పంట పాలుపోసుకునే దశలో ఉన్నందున కుడి కాల్వ నుంచి నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

"కుడి కాల్వ నీళ్లు కట్టేశారు కాబట్టి.. మా పంట నష్టం జరుగుతుంది. ఈ నెలాఖరు వరకూ నీళ్లు వస్తే ఈ పంటను చేతికి తీసుకుంటాం. పాలుపోసుకునే దశలో నీళ్లు ఆపేయడం వలన.. పంట ఎండి పోతోంది". - రైతు

"పాలుపోసుకునే దశలో ఉంది. ఒక పది రోజులు నీళ్లు వచ్చినా.. పంట చేతికి వస్తుంది. నాలుగైదు రోజులుగా కాలువ ఆగిపోయింది. కానీ ఈ స్థాయిలో ఆగిపోతే.. పంట దెబ్బతిని నష్టపోతాం". - రైతు

"నేను ఇరవై ఎకరాలు సాగు చేశాను. ప్రస్తుతం పాలు దశలో వారం రోజులుగా కాలువ ఆగిపోయింది. రోజూ కాలువ నీళ్లు వస్తాయి ఏమో అని ఎదురుచూస్తున్నాం. 40 బస్తాలు వచ్చేవి.. ప్రస్తుతం అయితే 10 బస్తాలు దాటి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడులు ఎక్కువగా పెట్టాం.. ఏం చేయాలో అర్థం కావడం లేదు". - రైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details