ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

By

Published : Apr 30, 2020, 11:23 PM IST

పంట పండించేందుకు చేసిన అప్పులు తీర్చే దిగుబడులు సాధించలేక ఓ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లా చందవరం గ్రామంలో జరిగింది.

farmer suicide with heavy loans in  guntur district
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ రైతు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరంలో జరిగింది. గ్రామానికి చెందిన గొర్రెపాటి నాగేశ్వరరావు, శిరీష దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కోమలి, చైతన్యలు సంతానం. నాగేశ్వరరావు తన తల్లిదండ్రులకు చెందిన రెండెకరాలతో పాటు మరో ఏడెకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. నాలుగు ఎకరాల్లో సాగు చేసిన మిరప పంట అధిక వర్షాలతో పాడైపోయింది. మూడు ఎకరాల్లో వేసిన పత్తి పంటకు గులాబీ రంగు పురుగు తగిలి దిగుబడి సగానికి సగం తగ్గింది. రెండు ఎకరాల్లో సాగు చేసిన పొగాకు పంటను కరోనా కారణంగా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. ఫలితంగా పంట పెట్టుబడికి అయిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వైద్య పరీక్షల కోసం మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details