ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jagan Promises to VRA: గౌరవవేతనం పెంచలేదు.. డీఏలు తిరిగి చెల్లించమంటున్నారని వీఆర్​ఏల ఆవేదన

By

Published : Jul 31, 2023, 8:33 AM IST

Updated : Jul 31, 2023, 9:52 AM IST

Jagan Promises to VRAs: అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే వీఆర్​ఏల జీతాలను 15వేలకు పెంచుతామంటే నమ్మి ఓట్లు వేయడమే గాక.. గ్రామాల్లో పెద్దఎత్తున వైసీపీకి ఓట్లు వేయించారు. తీరా అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సీఎంకు.. వీఆర్​ఏలకు ఇచ్చిన హామీ గుర్తు రాలేదు. జీతాల పెంపు సంగతి పక్కన పెడితే.. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఏను రికవరీ చేస్తామనడంపై వీఆర్​ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

AP VRA
ఏపీ వీఆర్​ఏల ఆందోళన

వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీ మర్చిపోయిన జగన్‌

CM Jagan Neglecting Given Promises to VRAs: 'మీ అందరికీ నేను భరోసా ఇచ్చి చెప్తున్నా.. మన అందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం రోజుల్లోనే 15వేల జీతం మీకు అందిస్తాను.' ఇవి విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ మాటలు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినా నాడు జగన్‌ ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదు. ఇప్పటికీ వీఆర్​ఏల గౌరవ వేతనాలు పెంచలేదు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన జగన్‌ తాను గతంలో ఇచ్చిన హామీలను విస్మరించారు. మడమ తిప్పనంటూనే హామీల ఆంశంలో వెనకడుగు వేస్తున్నారు. పెంచుతామని హామీ ఇచ్చిన జీతాలు పెంచకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన కరవు భత్యాన్ని సైతం రికవరీ చేస్తామనడం ఈ ప్రభుత్వానికే చెల్లింది.

గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ప్రచారంలో వీఆర్​ఏలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మంది వీఆర్​ఏలు పనిచేస్తున్నారు. వీరికి 2018 అక్టోబరు ముందు వరకు నెలకు 6 వేల రూపాయల గౌరవ వేతనం లభించేది. వేతనాలు పెంచాలంటూ 2017 మార్చి 24న విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద వీరు ఆందోళన చేపట్టగా.. అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ వారికి సంఘీభావం తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దని వైసీపీ అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే ప్రతి ఒక్కరికీ నెలకు 15 వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ గద్దెనెక్కి నాలుగున్నారేళ్లు గడుస్తున్నా వీఆర్​ఏలకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. నాడు జగన్‌ను నమ్మి ఓట్లు వేసిన వారంతా నేడు ఆందోళనకు దిగారు.

2018 సెప్టెంబర్ వరకు వీఆర్​ఏలకు గౌరవవేతనం 6వేలు ఉండగా.. అప్పటి ప్రభుత్వం 10 వేల 500కు పెంచింది. ఈ చెల్లింపు 2018 అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో కరవు భత్యం కింద నెలకు ఇచ్చే 100 రూపాయలను 300 రూపాయలకు పెంచింది. రవాణా భత్యాన్ని 20 రూపాయల నుంచి 100కు పెంచింది. దీని ప్రకారమే గత ఏడాది జనవరి వరకు వీఆర్​ఏలకు చెల్లింపులు జరిగాయి. అయితే 15వేలకు జీతం పెంచుతామని హామీ ఇచ్చిన వేతనాలు పెంచలేదు.

వేతనాలు పెంచకపోగా డీఏ కింద వీఆర్​ఏలకు అదనంగా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలని గత ఏడాది జనవరిలో ప్రభుత్వం ఆదేశించింది. ‘డీఏ చెల్లింపు ఉత్తర్వుల్లో పేర్కొన్న గడువు 2018 జూన్‌ వరకు మాత్రమే ఉందని.. పొరపాటున 2022 జనవరి వరకు చెల్లించామని అందుకే డీఏను తిరిగి చెల్లించాలని ఆదేశించడంతో వీఆర్​ఏలు అవాక్కాయ్యారు. ఒక్కొక్కరూ 10నుంచి 12 వేల రూపాయలు వరకు తిరిగి కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందిపోయి గత ప్రభుత్వం ఇచ్చిన డీఏలను కూడా రికవరీ చేయడంపై వీఆర్​ఏలు మండిపడుతున్నారు.

ప్రస్తుతం చెల్లిస్తున్న 10 వేల 500 గౌరవ వేతనాన్ని 26 వేలకు పెంచాలనివీఆర్‌ఏలు డిమాండ్‌ చేస్తున్నారు. 6 వేల వేతనం ఉన్నప్పుడు అదనంగా 9 వేలు కలిపి ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు . ఆ ప్రకారం 19,500 చెల్లించాలని కోరుతున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద నామినీలకు వీఆర్‌ఏలుగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో ఆగస్టు 7, 8 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఆగస్టు 25న ‘జగనన్నకు నేరుగా చెబుదాం’ పేరుతో చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు వీఆర్ఏలు సిద్ధమయ్యారు.

Last Updated : Jul 31, 2023, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details