ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amaravati movement @ 1300: 'నాలుగేళ్లుగా నరకంలో నవనగరం'.. 13వందల రోజుకు చేరిన రైతుల ఉద్యమం

By

Published : Jul 9, 2023, 9:07 AM IST

Updated : Jul 9, 2023, 9:38 AM IST

Amaravati farmers movement reached 1300 days: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 13వందల రోజుకు చేరుకుంది. రాజధాని కోసం భూములిచ్చి పురుడు పోసిన రైతులు.. అదే అమరావతిని కాపాడుకోవడానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు.. పోలీసుల ఆంక్షల వలయంలో నిత్యం నరకం అనుభవిస్తూ ఉద్యమాన్ని సాగిస్తున్నారు. పోరాటం 13వందల మైలురాయిని చేరిన సందర్భంగా "నాలుగేళ్లుగా నరకంలో నవనగరం" పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Amaravati farmers movement reached 1300 days
'నాలుగేళ్లుగా నరకంలో నవనగరం'.. 13వందల రోజుకు చేరిన రైతుల ఉద్యమం

'నాలుగేళ్లుగా నరకంలో నవనగరం'.. 13వందల రోజుకు చేరిన రైతుల ఉద్యమం

Amaravati farmers movement reached 1300 days: రాష్ట్రానికి అమరావతి గుండెకాయలా తయారవుతుందని కలలుగని భూములిచ్చిన రైతులు.. వైసీపీ ప్రభుత్వ తీరుతో నాలుగేళ్లుగా పోరుబాట పట్టారు. ఉద్యమాలు, నిరసన దీక్షలు, పాదయాత్రలు, వివిధ కార్యక్రమాలతో అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ రోడ్డెక్కారు. 2019 డిసెంబర్ 17న మొదలైన ఉద్యమం వివిధ రూపాల్లో ముందుకు సాగుతోంది. అమరావతి నుంచి తిరుమలపాదయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అమరావతిపై హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని.. రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆదేశించింది. తీర్పు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసేస్తూ.. సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ప్రస్తుతం అమరావతిలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు వృథాగా పడి ఉన్నాయి. రాజధానిలో వైసీపీ విధ్వంసం కొనసాగుతూనే ఉందని రైతులు విమర్శిస్తున్నారు.

అమరావతిని దెబ్బతీయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. 19 గ్రామాలతోనే అమరావతి నగరపాలక సంస్థ అన్నారు. ఆ తర్వాత అమరావతి మున్సిపాలిటీ అన్నారు. వాటి కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. రైతులంతా ఐకమత్యంతో వీటిని ఎదుర్కొన్నారు. 29 గ్రామాలతో కూడిన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని.. ఎలాంటి మార్పులకు అంగీకరించేది లేదని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అమరావతిని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం.. R-5 జోన్ ఎత్తుగడతో ముందుకొచ్చింది. అక్కడ 50వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చేందుకు 11వందల 40ఎకరాలు కేటాయించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

R-5 జోన్‌పైవిచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతిస్తూ.. తుది తీర్పునకు లోబడే వ్యవహరించాలని స్పష్టంగా ఆదేశించింది. దాన్ని ఖాతరు చేయని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇళ్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టింది. అందుకు కేంద్రసాయాన్ని ఆర్థించింది. కోర్టు కేసులు తేలిన తర్వాతే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం చెప్పటంతో ప్రస్తుతానికి ఆ ప్రక్రియ ఆగిపోయింది.

హైకోర్టు తీర్పుని అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేసి సుప్రిం కోర్టుకు వెళ్లటంతో రైతులు మళ్లీ ఉద్యమబాట పట్టారు. శిబిరాల్లో ఆందోళనలు ప్రారంభించారు. అలాగే అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. రైతుల్ని కేసులతో వేధించారు. రైతుల్ని అడ్డుకునేందుకు, రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో పాదయాత్రకు విరామం ఇచ్చారు. రైతుల పోరాటం 13వందల రోజులకు చేరిన సందర్భంగా ఇవాళ మందడం శిబిరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా నరకంలో నవనగరం పేరిట కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పక్షాల వారిని, ప్రజాసంఘాల నేతల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

Last Updated : Jul 9, 2023, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details