ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వారి మరణానికి కారణం అదేనా?

By

Published : Aug 8, 2021, 9:28 AM IST

ఆయనో ఉపాధ్యాయుడు.. ఆమె అధ్యాపకురాలు.. ఒక్కగానొక్క కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.. ఇద్దరూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారే. కొవిడ్‌ మహమ్మారిని సైతం ఎదిరించి కోలుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో విగత జీవులయ్యారు.

Death of couple
దంపతుల మరణం

దంపతుల మధ్య మనస్పర్థలా.. లేక తల్లి లేదన్న మస్తాపమో. కారణం ఏదైన ఆ ఇద్దరి మరణం పలువురిని కలచివేసింది. ఈ నెల 1న కొవిడ్‌తో తన తల్లి మృతిచెందడంతో మనస్తాపంతో ఉన్న అతను.. భార్యను చంపి, ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కొందరు భావిస్తుంటే.. ఇటీవల తరచూ వారికి గొడవలు జరిగేవని, మనస్పర్థల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని మరికొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రాజమహేంద్రవరంలో అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నగరంలోని లక్ష్మీవారపుపేటలో నివసిస్తున్న నడింపల్లి నర్సింహరాజు(59) పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య వెంకటమణి(55) నగరంలోని ఎస్‌కేఆర్‌ కళాశాలలో ఒప్పంద అధ్యాపకురాలు. పదేళ్లనుంచి స్థానికంగా ఓ బహుళ అంతస్తులో ఉంటున్నారు. వీరి కుమారుడు చికాగోలో ఉద్యోగం చేస్తున్నారు.

రక్తపు మడుగులో..

ఇటీవల దంపతులిద్దరూ కొవిడ్‌ బారినపడి కోలుకున్నారు. శనివారం మధ్యాహ్నం పనిమనిషి ఇంటి తలుపుకొట్టగా ఎంతకీ తీయకపోవడంతో పక్క ఫ్లాట్‌ వారికి విషయం చెప్పింది. వారొచ్చి కిటికీ తెరిచి చూడగా దంపతులు రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందించగా.. ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. వెంకటమణి మృతదేహం గొంతుతెగి రక్తపు మడుగులో ఉంది. నర్సింహరాజు మృతదేహానికి సంబంధించి పీక, ఎడమ చేతి మణికట్టుపై తీవ్రగాయాలై రక్తపు మడుగులో హాలులోని కుర్చీలోఉంది. అతని చేతిలో కత్తి ఉండడాన్నిబట్టి భార్యను హతమార్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి విషయాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం తేలాల్సిఉంది. మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ సీఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండీ..ap set notification: ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details