ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏడాదంతా ఆదాయం..! నమ్మి మోసపోయిన వందలాది జనం..

By

Published : Apr 8, 2023, 5:55 PM IST

Updated : Apr 8, 2023, 10:03 PM IST

Cyber Fraud Using WhatsApp Group: సైబర్ నేరగాళ్లు వాట్సప్ గ్రూప్ ద్యారా గాలం వేసి 700 మందిని మోసం చేశారు. ప్రతి రోజూ ఆదాయం వస్తుందని నమ్మించి డిపాజిట్లు చేయించి బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మరో ఘటనలో నమ్మకంగా ఉన్న గుమస్తా.. యజమానిని నట్టేట ముంచాడు.

Etv Bharat
Etv Bharat

Cyber Fraud Using WhatsApp Group : గుంటూరు, కృష్ణా జిల్లాలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.800 చెల్లిస్తే రోజుకు 35 రూపాయల చొప్పున ఏడాదిపాటు డబ్బు చెల్లిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేశారని బాధితులు ఆరోపించారు. ఐపీజీ పేరిట వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి సభ్యుల నుంచి 800 రూపాయల చొప్పున కట్టించుకున్నారని తెలిపారు. ప్రారంభంలో చెప్పినట్లే డబ్బు చెల్లించడంతో మంచి ఆదాయం వస్తుందనే ఆశతో మంగళగిరి, విజయవాడకు చెందిన వ్యక్తులు సభ్యులుగా చేరినట్లు బాధితులు చెప్పారు.

మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగిస్తోందని రెండు రోజులు అంతరాయం ఉంటుందని చెప్పి శాశ్వతంగా బోర్డు తిప్పేశారని బాధితులు వాపోతున్నారు. ఈ గ్రూపు ద్వారా 700 మంది 800 రూపాయలతో మెుదలుపెట్టి వేలు, లక్షల్లో డబ్బులు కట్టారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ద్విచక్ర వాహనం, కారు ఢీ..ఇద్దరు మృతి.. శ్రీ సత్య సాయి జిల్లాలో నల్లచెరువు మండలం ఎర్ర గుంటపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లచెరువు పోలీసులు తెలిపిన వివరాలు.. తనకల్లు మండలం కనసాని వారి పల్లికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తిగత పని మీద కదిరికి వచ్చి సొంత ఊరికి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద ఎదురుగా వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వాహనంపై నుంచి ఎగిరి రోడ్డు మీద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

చోరీ చేసిన గుమస్తా.. ఛేదించిన పోలీసులు... తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో రాజేంద్ర పాన్ బ్రోకర్స్ బంగారం దుకాణంలో సుమారు నాలుగున్నర కేజీల బంగారు నగల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దుకాణంలో పని చేసే గుమస్తా వాటిని అపహరించినట్లు వెల్లడించిన పోలీసులు.. సొత్తు విలువ కోటీ 12 లక్షలు ఉంటుందని చెప్పారు. శాంతీలాల్ జైన్ కొవ్వూరులో అరవై ఏళ్లుగా బంగారు నగల తాకట్టు దుకాణం నడుపుతున్నారు. ఈ షాపులో సీతానగరం మండలం చిన కొండేపూడికి చెందిన రాము ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నాడు. వృద్ధాప్యం వల్ల యజమాని రాముకి షాపు నిర్వహణ అప్పగించారు. ఇదే అదనుగా నగల్ని వేరే దుకాణంలో తాకట్టు పెట్టి నగదు సొంతానికి వాడుకున్నాడు. దుకాణంలో నగలు కొడుకుతో కలిసి తనిఖీ చేయాలని యజమాని రాముకి చెప్పారు. తన వ్యవహారం బయటపడుతుందని భావించిన రాము ఈ నెల 1న నగలు దొంగిలించి పారిపోయాడు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు దొంగని పట్టుకున్నారు.

చెరువులో పడి మృతి చెందిన బాలుడు.. స్పందించని అధికారులు : విజయవాడ వాంబే కాలనీ సమీపంలో నిర్మించిన వైయస్సార్ పార్క్ లోని పాయికాపురం చెరువులో ఇటీవల ఉప్పుతల దుర్గా ప్రసాద్(8) ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. బాలుడు మృతి చెందినా స్థానిక ఎమ్మెల్యే, మేయర్ ఉలుకూ, పలుకు లేకుండా ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. నగర పాలక సంస్థ నిర్మిస్తున్న పార్కు చెరువుకు ఫెన్సింగ్ లేకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందాడన్నారు.

బాలుడి కుటుంబానికి ఆర్థిక సహాయంపై నేటి వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి మాటల్లో మానవత్వం, చేతల్లో నిర్లక్ష్యం ఉన్నాయన్నారు. మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు మద్దతు బాబురావు మద్దతు పలికారు.

ఇవీ చదవండి

Last Updated :Apr 8, 2023, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details