ఆంధ్రప్రదేశ్

andhra pradesh

High Level Committee: అచ్యుతాపురం ఘటనపై.. హైపవర్​ కమిటీ ఆరా

By

Published : Aug 4, 2022, 6:58 PM IST

Updated : Aug 5, 2022, 6:53 AM IST

High Level Committee on Atchutapuram incident: అచ్యుతాపురం గ్యాస్​ లీక్​పై ప్రభుత్వం నియమించిన హైపవర్​ కమిటీ ఘటనా స్థలంలో విచారణ చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలపై కమిటీ సభ్యులు ఆరా తీస్తూ.. వివరాలు సేకరిస్తున్నారు.

Atchutapuram incident
అచ్యుతాపురం గ్యాస్​ లీక్​

Atchutapuram Gas Leak incident: అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమ దుర్ఘటనపై సాంకేతిక బృందంతో క్షుణ్నంగా విశ్లేషణ చేస్తామని రాష్ట్ర హైపవర్‌ కమిటీ ప్రతినిధి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. అచ్యుతాపురం సెజ్‌లో గురువారం ఆయన కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టితో కలిసి పర్యటించారు. చెదల నివారణకు ఎలాంటి రసాయనాలు వినియోగిస్తున్నారు, మహిళల రక్త నమూనాల్లో వేటిని గుర్తించారని కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. చెదల నివారణ మందులను రాత్రి 10 తర్వాతే పిచికారీ చేస్తామని బ్రాండిక్స్‌ ప్రతినిధులు వివరించారు. రసాయన వాయువులు విడుదలైతే గుర్తించే పరికరాలు ఏర్పాటుచేశామంటూ వాటిని చూపించారు.

500 మంది దాటిన ప్రతి పరిశ్రమలో భద్రతా ఆడిట్‌: సీడ్స్‌లో మహిళలు అస్వస్థతకు గురికావడం అంతుపట్టడంలేదని విజయకుమార్‌ తెలిపారు. కంపెనీలో పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 500 మంది కార్మికులు దాటిన ప్రతి పరిశ్రమలోనూ భద్రతా ఆడిట్‌ చేస్తామని చెప్పారు. ‘ప్రమాదానికి కారణం తెలిస్తే తప్ప దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై నిర్ధారణకు వచ్చే అవకాశం ఉండదు. పరిశ్రమల్లో ఉపాధి, కార్మికుల ఆరోగ్యం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. జూన్‌ 3నాటి ప్రమాదంపై విశ్లేషణ చేస్తుండగా, మరో ప్రమాదం జరగడం ఇబ్బందిగా మారింది. కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా త్వరగా నివేదిక రప్పించి పరిశ్రమను తెరిపించడానికి చర్యలు తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు. బ్రాండిక్స్‌ భారతీయ భాగస్వామి దొరస్వామి, పీసీబీ ఈఈ సుదర్శణం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ జరిగింది:అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ ఘటనలో బాధితులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 53 మంది మహిళలు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అదే తరహాలో గాఢమైన విషవాయువు లీక్ కావడంతో.. బీ-షిఫ్టులో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాంతులు, తల తిరగడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భోజన విరామ సమయంలో వాయువు వెలువడిందని.. కొన్ని నిమిషాల్లోనే వ్యాపించి ఏం జరిగిందో తెలుసుకునే లోపే కుప్పకూలిపోయినట్టు బాధితులు చెబుతున్నారు.

ఉన్నతస్థాయి కమిటీ: అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీక్‌ ఘటనపై ముఖ్యమంత్రి జగగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం ఆరా తీశారు. విషవాయువు లీక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలను వెలికితీయాలన్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్జీటీ కమిటీ: సీడ్స్‌ కంపెనీలో విషవాయువు లీకేజీపై విచారణకు.. ఆరుగురు సభ్యులతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కమిటీ నియమించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ డైరెక్టర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. నోడల్‌ ఎజన్సీగా కాలుష్య నియంత్రణ మండలి ఉంటుందని తెలిపింది. 2 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని.. చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విషవాయువు వార్తను సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్‌.. తదుపరి విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 5, 2022, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details