అచ్యుతాపురం విషవాయువు లీక్ ఘటన.. ప్రభుత్వ వైఖరిపై తెదేపా ఫైర్ !

author img

By

Published : Aug 3, 2022, 8:29 PM IST

అచ్యుతాపురం విషవాయువు లీక్ ఘటన

gas leak incident: విశాఖ అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకైన ఘటనలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. బాధితులను పరామర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. పూర్తిస్థాయి నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. సీడ్స్ దుస్తుల పరిశ్రమలో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు విషవాయువు లీకై.. వందల మంది అస్వస్థతకు గురైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు.

అచ్యుతాపురం విషవాయువు లీక్ ఘటన

Achyutapuram gas leak incident: అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ ఘటనలో బాధితులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 53 మంది మహిళలు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అదే తరహాలో గాఢమైన విషవాయువు లీక్ కావడంతో.. బీ-షిఫ్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాంతులు, తల తిరగడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భోజన విరామ సమయంలో వాయువు వెలువడిందని.. కొన్ని నిమిషాల్లోనే వ్యాపించి ఏం జరిగిందో తెలుసుకునే లోపే కుప్పకూలిపోయినట్టు బాధితులు చెబుతున్నారు.

మంత్రి పరామర్శ: చికిత్స పొందుతున్న వారందరి పరిస్థితి నిలకడగానే ఉందని.. క్రమంగా కోలుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆస్పత్రిలో బాధితులను మంత్రి అమర్నాథ్‌ పరామర్శించారు. బాధితులకు పూర్తిగా నయం అయ్యేవరకు మెరుగైన వైద్యం అందించే బాధ్యత కంపెనీ తీసుకోవాలన్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చే వరకూ సీడ్స్‌ కంపెనీని మూసివేస్తున్నట్లు తెలిపారు. అప్పటివరకు కార్మికులకు యాజమాన్యమే వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.

విపక్షాల ధర్నా: వాయువు లీకేజీ ఘటనపై విచారణ జరిపించాలంటూ తెలుగుదేశం సహా విపక్షాలు ధర్నా చేశాయి. సీడ్స్ కంపెనీని పరిశీలించేందుకు అనుమతి ఇవ్వలేదంటూ పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషవాయువు లీక్ కావడం మొదటిసారి కాదన్న నేతలు.. గతంలో ప్రమాదం జరిగినా కంపెనీ మూసివేయకపోవడం, యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఉన్నతస్థాయి కమిటీ: సెజ్‌లో విషవాయువు లీక్‌పై సీఎం జగన్‌ సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీశారు. విషవాయువు లీక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలన్న సీఎం.. ఘటనపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి.. కారణాలను వెలికితీయాలని ఆదేశించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి పెట్టాలన్న సీఎం.. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలని సూచించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.