ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sahithi Pharma Fire Accident: సాహితీ ఫార్మాలో పేలుడు ఘటన.. నాలుగుకి చేరిన మృతుల సంఖ్య

By

Published : Jul 3, 2023, 6:59 PM IST

Achyutapuram Sahithi Pharma Company Fire Incident: అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి, మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. 70 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న.. నక్కపల్లికి చెందిన అప్పారావు, అప్పారాయుడుపాలెంకి చెందిన నూకి నాయుడులు మృతి చెందారు.

Etv Bharat
Etv Bharat

Achyutapuram Sahithi Pharma Company Fire Incident Updates: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని సాహితీ ఫార్మా కంపెనీలో గత నెల (జూన్) 30వ తేదీన భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృతి చెందినవారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. మూడు రోజుల క్రితం (శుక్రవారం) జరిగిన ఈ దుర్ఘటనలో అదే రోజు ఇద్దరు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు.. విశాఖపట్నం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో అప్పారావు అనే కార్మికుడు ఆదివారం రాత్రి మృతి చెందగా.. ఈరోజు ఉదయం బి. రామేశ్వర్ అనే కార్మికుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

సాహితీ ఫార్మాలో భారీ పేలుడు.. మూడు రోజులక్రితం అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా మంటలు ఎగసిపడి.. భారీ శబ్దంతో పేలుడు జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురైన కార్మికులు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదం.. ఫార్మా సంస్థలో రియాక్టర్‌ పేలడంతోనే జరిగినట్లు కార్మికులు, పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజున ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో.. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన రమేష్‌(45), రాంబిల్లి మండలం జనగాలపాలేనికి చెందిన సత్తిబాబు(35), రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెంకి చెందిన నూకి నాయుడు(40), విజయనగరం జిల్లాకు చెందిన తిరుపతితోపాటు నక్కబిల్లి మండలం రెబ్బాకకు చెందిన రాజుబాబు, నక్కపల్లికి చెందిన అప్పారావు(43), అనకాపల్లి జిల్లా కొండకొప్పాకకు చెందిన పిల్లా సంతోష్‌ కుమార్‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరో ఇద్దరు కార్మికులు మృతి..సాహితీ ఫార్మాలో ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన రోజున పైలా సత్తిబాబు (36), ఉప్పాడ తిరుపతి (28)లు కన్నుమూయగా.. తాజాగా 70 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న.. నక్కపల్లికి చెందిన అప్పారావు (43) ఆదివారం రాత్రి, అప్పారాయుడుపాలెంకి చెందిన నూకి నాయుడు (40) ఈరోజు ఉదయం.. ప్రైవేట్ ఆసుపత్రిల్లో మృత్యువు ఒడికి చేరారు. దీంతో సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటన మృతుల సంఖ్య నాలుగుకి చేరింది.

తెల్లకాగితంపై రాసి.. పరిహారం ఇస్తామంటే మాకొద్దు.. ఈ నేపథ్యంలో తమ కుటుంబాలకు కర్మాగార యాజమాన్యం.. ఎటువంటి హామీ ఇవ్వడం లేదని మృతుల బంధువులు పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. తమకు కర్మాగారం నుంచి నిర్ధిష్టమైన హామీ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ చూపి.. మృతుల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు. పరిహారం విషయంలో.. లెటర్ హెడ్ గానీ, అధికారిక స్టాంపులు గానీ లేకుండా కేవలం తెల్లకాగితంపై పరిహార ఇస్తామని యాజమాన్యం రాసిస్తే, తాము ఒప్పుకోమని తేల్చి చెప్పారు.

పరిహారం ప్రకటిస్తేనే పోస్టుమార్టం..మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. చనిపోయిన కార్మికులకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. కానీ, ఈ ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి పరిహారం ప్రకటించలేదు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన కార్మికుల పట్ల యాజమాన్యం బాధ్యత తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం ఏమిటి..? అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం పరిహారం ప్రకటిస్తేనే.. రెండు మృతదేహాలను పోస్ట్‌‌మార్టానికి తీసుకెళ్లనిస్తామని ఆందోళన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details