ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోడు భూముల సర్వేనా.. మేం వెళ్లం బాబోయ్​...!

By

Published : Nov 24, 2022, 9:12 AM IST

తెలంగాణలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు హత్య ఉదంతంతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా తమకు రక్షణ కల్పించాలని పలుమార్లు కోరినప్పటికీ, ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోడు భూముల సర్వేకు వెళ్లబోమని ఆ రాష్ట్ర అటవీ అధికారులు, సిబ్బంది తేల్చిచెబుతున్నారు. సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అటవీ అధికారుల సంఘాలతో ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం కానున్నారు.

పోడు భూముల సర్వేనా.. మేం వెళ్లం బాబోయ్​...!
పోడు భూముల సర్వేనా.. మేం వెళ్లం బాబోయ్​...!

పోడు భూముల సర్వేనా.. మేం వెళ్లం బాబోయ్​...!

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గొత్తికోయల దాడిలో మరణించిన అటవీ క్షేత్రాధికారి శ్రీనివాసరావు ఘటన అటవీశాఖను ఆందోళనలోకి నెట్టింది. విధినిర్వహణలో ఉన్న ఓ అధికారి ఇలా దాడిలో మృత్యువాత పడడం దిగ్భ్రాంతికి గురి చేసింది. అడవుల పరిరక్షణ విషయంలో అటవీ అధికారులు, సిబ్బంది తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొత్తికోయలు, గిరిజనుల నుంచి పదేపదే ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు, ఇక్కట్లు ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. పలు సందర్భాల్లో అటవీ శాఖ క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందిపై దాడులు కూడా జరిగాయి. ఆయా సందర్భాల్లో దాడులను ఖండించడం, భవిష్యత్​లో ఇలాంటి సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పే మాటలు ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి.

సమస్య మూలాలను గుర్తించి, పరిష్కరించే ప్రయత్నం పూర్తి స్థాయిలో జరగడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా తమకు భద్రత కల్పించాలని, ఆత్మరక్షణ కోసం పోలీసుల తరహాలో తమకు ఆయుధాలు ఇవ్వాలని అటవీశాఖ ఉద్యోగులు, సిబ్బందిని పలుమార్లు కోరారు. అటవీ ఉద్యోగ సంఘాలు కూడా వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి.

అటవీ అధికారులు, సిబ్బందికి తగిన భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వం.. ఆయుధాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని గతంలో పేర్కొంది. తాజా ఘటనతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోడుభూముల సర్వే జరుగుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజా పరిణామంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆందోళనకు లోనయ్యారు.

శ్రీనివాసరావు అంత్యక్రియల అనంతరం.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. తమకు భద్రత కల్పించకపోతే విధులకు హాజరు కాబోమని తెగేసి చెప్పారు. మరోవైపు అటవీ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి భరోసా ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి అటవీ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, అటవీశాఖ ఉద్యోగ సంఘాలతో ఉన్నతాధికారులు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ఆందోళనను గుర్తించామంటున్న ఉన్నతాధికారులు.. వారితో చర్చించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details