ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాడిపత్రిలో ఆగని వైకాపా ఆగడాలు.. తెదేపా ఆందోళన

By

Published : Sep 27, 2022, 2:27 PM IST

Updated : Sep 27, 2022, 2:48 PM IST

Attack On Tdp Councilor

Attack On Tdp Councilor : తాడిపత్రిలో వరుసగా తెదేపా నేతలపై జరుగుతున్న దాడులపై.. ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 30వ వార్డు కౌన్సిలర్​పై దాడి ఘటన మరువకముందే అదే పట్టణంలోని 33వ కౌన్సిలర్​పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వరుస దాడులపై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ATTACK ON COUNCILOR : తాడిపత్రిలో తెదేపా కౌన్సిలర్లపై వైకాపా గూండాల దాడి హేయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. విజయ్ కుమార్​పై వైకాపాకు చెందిన నలుగురు యువకులు కర్రలతో దాడి చేశారన్న ఆయన.. రెండు రోజుల క్రితం ఇదే తాడిపత్రిలో తెదేపా కౌన్సిలర్ మల్లిఖార్జునపై కూడా దాడి జరిగిందన్నారు. దళితులపై జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కౌన్సిలర్లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

జేసీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన : కౌన్సిలర్లపై జరిగిన దాడులకు నిరసనగా తాడిపత్రి పీఎస్​ ఎదుట తెదేపా నేత జేసీ ప్రభాకర్​ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. వైకాపా నాయకులు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న జేసీకి సర్దిచెప్పిన పోలీసులు.. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ జరిగింది: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా కౌన్సిలర్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ విజయకుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. బైక్‌లు అడ్డుపెట్టి కర్రలతో దాడికి దిగారు. వైకాపా నాయకులే తనపై దాడి చేయించారని.. కౌన్సిలర్‌ ఆరోపిస్తున్నారు.

అంతకుముందు 30వ వార్డు కౌన్సిలర్‌ మల్లికార్జున ఇంటిపై దాడి: తెదేపాకు చెందిన 30వ వార్డు కౌన్సిలర్‌ మల్లికార్జున ఇంటిపై దాడి చేశారు. సోమవారం మధ్యాహ్నం మల్లికార్జున ఇంట్లోకి ప్రవేశించి భౌతిక దాడికి దిగారు. మల్లికార్జునను విచక్షణరహితంగా కొట్టి బెదిరించారు. ఇనుప రాడ్లతో భయపెడుతూ పేట్రేగిపోయారు. అడ్డుకోబోయిన ఆయన తల్లి సావిత్రి, సోదరి నాగమణిపైనా దాడి చేశారు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో గాయపడిన మల్లికార్జునను కుటుంబ సభ్యులు అనంతపురం సర్వజనాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిలో వైకాపా మద్దతుదారు రఫీ సహా మరో నలుగురు ఉన్నట్లు బాధితుడు తెలిపారు.

మల్లికార్జునపై వైకాపా దాడికి దిగడం ఇది రెండోసారి. జూన్‌ 11న మురుగునీటి పైపులైను పగిలిపోవడంతో తెదేపా నాయకులు సొంత ఖర్చుతో పనులు చేపట్టారు. తమ అనుమతి లేకుండా పనులెలా చేస్తారంటూ స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కానీ పోలీసులు ఎలాంటి విచారణ చేయలేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వదిలేశారు.

డీఎస్పీ ప్రోద్బలంతోనే..:జూన్‌ 11న తనపై జరిగిన దాడి కేసులో ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్ధన్‌ పేరును తొలగించారని మల్లికార్జున ఆరోపిస్తున్నారు. అదే నెల 16న విచారణ పేరుతో డీఎస్పీ తనను పిలిచి కులం పేరుతో దూషిస్తూ కొట్టారన్నారు. దీంతో డీఎస్పీ చైతన్యపై తాడిపత్రి కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశానని.. అందుకే డీఎస్పీ తనపై కక్ష పెంచుకుని వైకాపా నాయకులతో దాడి చేయించారని మల్లికార్జున ఆరోపించారు. దీనిపై డీఎస్పీ చైతన్యను వివరణ కోరగా.. తనకెలాంటి సంబంధం లేదని, రాజకీయ కారణాలతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 27, 2022, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details