ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Old Women Died: వృద్ధురాలి ప్రాణం తీసిన చిన్న వివాదం.. వైకాపా నాయకులే కారణం!

By

Published : Apr 12, 2022, 7:36 AM IST

Old Women Died: చినికి చినికి గాలి వాన అయినట్లు... చిన్న వివాదం కాస్తా ముదిరి ఓ వృద్ధురాలి ప్రాణాలను తీసింది. కృష్ణా జిల్లా గుడివాడ గ్రామీణ మండలంలోని శేరిదింటకుర్రు గ్రామంలో.. ట్రాక్టర్​ నుంచి గడ్డి దించే విషయంలో వివాదం జరిగింది. ఈ ఘటనలో కొందరు దాడి చేయగా... వృద్ధురాలు కిందపడింది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనకు వైకాపా సర్పంచ్​ తీరే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

old woman died in ycp leaders attack
వైకాపా నాయకుల దాడిలో వృద్ధురాలు మృతి

Old Women Died: ట్రాక్టర్‌లోంచి గడ్డిని దించే విషయమై తలెత్తిన వివాదం పెద్దదై.. వైకాపా నాయకులు పాల్పడిన దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలొదిలిన దారుణమిది. కృష్ణా జిల్లా గుడివాడ గ్రామీణ మండలంలోని శేరిదింటకుర్రు గ్రామంలో ఈ ఘటన జరిగింది. 'పొణుకుమాటి మేరమ్మ ఇంటివద్ద సోమవారం వరి గడ్డి దించే క్రమంలో వైకాపాకు చెందిన సర్పంచి మేడేపల్లి అదృష్టకుమారి మరుదులైన జ్ఞానేశ్వరరావు అలియాస్‌ జ్ఞానేశు, గుబేలు అలియాస్‌ క్రీస్తురాజు, అతని భార్య, జయరాజు, మరికొందరు ఆమెతో వాగ్వాదానికి దిగారు. మేరమ్మ కుమారుడు వినోద్‌కుమార్‌, కుమార్తె కామాజ్యోతి అక్కడికి వెళ్లగా వారిపైనా దాడిచేసి గాయపరిచారు. వారిద్దరూ తప్పించుకొని వెళ్లి తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఇంతలో గాయాలైన మేరమ్మ లేవట్లేదని గమనించిన స్థానికులు అంబులెన్స్‌ను పిలిపించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు' పోలీసులు తెలిపారు.

ఈ హత్యపై గుడివాడ తాలూకా ఎస్సై వైవీవీ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. గ్రామంలో పంచాయతీ ఎన్నికలైనప్పటి నుంచీ సర్పంచి అదృష్టకుమారి భర్త ఏసుబాబు అలియాస్‌ పల్లయ్య సోదరులు తాము ఏడుగురం అన్నదమ్ములమని, ఎవరైనా తమకు ఎదురొస్తే ఊరుకునేది లేదంటూ గ్రామస్థులను భయపెడుతున్నారని మృతురాలు మేరమ్మ కుమారుడు వినోద్‌, కుమార్తె కామాజ్యోతి ఆరోపించారు. అదే క్రమంలో తమ కుటుంబంపై దాడిచేసి, చిన్న గొడవలో తల్లి ప్రాణం తీశారని రోదించారు. పల్లయ్య, గుబేలు, అతని భార్య, జ్ఞానేశు, జయరాజు, తమ తల్లిని కొట్టి, కొరకడంతోపాటు పైన కూర్చొని చంపేశారని వాపోయారు. గతంలోనూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అయితే, జ్ఞానేశు కుటుంబసభ్యులు గ్రామస్థులతో గొడవలు పడగా, ప్రవర్తన మార్చుకోవాలని పోలీసులు హెచ్చరించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:Train Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details