ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Polavaram: పోలవరం తొలిదశ అంచనాలు కేంద్ర కేబినెట్‌కు.. దిల్లీ సమావేశంలో కీలక నిర్ణయాలు..!

By

Published : May 19, 2022, 7:00 AM IST

Polavaram: పోలవరం తొలిదశకు అవసరమైన నిధుల మంజూరు కోసం జులైలో కేంద్ర మంత్రిమండలి ముందు నోట్‌ పెట్టనున్నట్లు జల్‌శక్తిశాఖ వెల్లడించింది. దిల్లీలో కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ అధ్యక్షతన బుధవారం కీలక సమావేశం జరిగగా.. డిజైన్ల అంశాలు, పోలవరం సమస్యల పరిష్కారంతో పాటు నిధుల విషయమూ చర్చకు వచ్చింది. మంగళవారం వెదిరె శ్రీరాం అధ్యక్షతన నిర్వహించిన సమావేశం నిర్ణయాలకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం తెలిపింది.

polavaram problems discussed in cabinet meeting at delhi
పోలవరం తొలిదశ అంచనాలు కేంద్ర కేబినెట్‌కు

Polavaram: పోలవరం తొలిదశకు అవసరమైన నిధుల మంజూరు కోసం జులైలో కేంద్ర మంత్రిమండలి ముందు నోట్‌ పెట్టనున్నట్లు జల్‌శక్తిశాఖ వెల్లడించింది. గోదావరి గర్భంలో ఇసుక కోత సమస్య పరిష్కారానికి చేపట్టే డ్రెడ్జింగ్‌, వైబ్రో కాంపాక్షన్‌తో పాటు ధ్వంసమైన డయాఫ్రం వాల్‌కు అయ్యే వ్యయాన్ని కూడా తొలిదశ అంచనాల్లో కలిపి లెక్కిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన విధానాలను త్వరగా తేల్చాలని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులను ఆదేశించింది.

దిల్లీలో కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ అధ్యక్షతన బుధవారం కీలక సమావేశం జరిగింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరాం, ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిజైన్ల అంశాలు, పోలవరం సమస్యల పరిష్కారంతో పాటు నిధుల విషయమూ చర్చకు వచ్చింది. మంగళవారం వెదిరె శ్రీరాం అధ్యక్షతన నిర్వహించిన సమావేశం నిర్ణయాలకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం తెలియజేసింది.

ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయికి నీటిని నిల్వ చేసేందుకు వీలుగా ప్రధాన డ్యాం నిర్మాణం, పునరావాసం, ఇతర పనులకు అవసరమైన నిధులపై కేంద్ర కేబినెట్‌ ఆమోదం తీసుకోనున్నట్లు పంకజ్‌కుమార్‌ వెల్లడించారు.

22న కేంద్ర నిపుణుల రాక:వెదిరె శ్రీరాం నేతృత్వంలో కేంద్ర జలసంఘం, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటిరియల్స్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌), కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన సంస్థ (సీడబ్ల్యుపీఆర్‌ఎస్‌) నిపుణులు, ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు ఈ నెల 22న పోలవరం సందర్శించనున్నారు. డిజైన్లు, తాజా అధ్యయనాలపై ఈ సమావేశంలో కొంత చర్చ జరిగింది. ఇసుక కోత పరిష్కారానికి తొలుత మెథడాలజీ సిద్ధం చేయడం, ఆగస్టు లోపు డిజైన్లు ఆమోదించుకోవడం, అక్టోబరు నుంచి పనులు ప్రారంభించాలనుకునే నిర్ణయాన్ని కేంద్ర జల్‌శక్తి ఆమోదించింది.

డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చే పని రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించింది. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, సభ్య కార్యదర్శి ఏకె ప్రధాన్‌, కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ గుప్తా, డైరెక్టర్‌ ఓహ్రా, డీడీఆర్‌సీ ఛైర్మన్‌ పాండ్యా తదితరులు పాల్గొన్నారు.

పూర్తి నిధులు ఎప్పుడో?:పోలవరం నిర్మాణానికి రూ. 47,725 కోట్ల అంచనాతో రివైజ్డు కాస్ట్‌ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటికి ప్రధాన డ్యాంలో అదనంగా చేపడుతున్న పనుల వల్ల అయ్యే వ్యయాన్ని కూడా జత చేస్తే మొత్తం ఎంత ఖర్చవుతుందో తేలుతుంది.

ఇప్పటికే కేంద్ర జలసంఘం స్క్రూటినీ, సాంకేతిక సలహా కమిటీ ఆమోదం, ఆ తర్వాత రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ ఆమోదం పొందిన అంచనాలను పక్కన పెట్టి తొలిదశ అంచనాలనే కేంద్ర మంత్రిమండలికి పంపి ఆమోదం తీసుకుంటే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు మొత్తం 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసేలా అయ్యే వ్యయానికి కేంద్రం నుంచి ఆమోదం ఎప్పుడు లభిస్తుంది అనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details