ఆంధ్రప్రదేశ్

andhra pradesh

త్వరలో జాతీయ పార్టీ.. విధివిధానాలు రూపొందిస్తున్నామన్న కేసీఆర్‌

By

Published : Sep 11, 2022, 7:56 PM IST

KCR on National Politics: ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయం వచ్చిందని త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని రాష్ట్రమంతటా అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తోందని కుమారస్వామికి కేసీఆర్ వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఇద్దరు నాయకులు పేర్కొన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీల ఐక్యత తక్షణ అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు.

kcr
kumaraswamy

త్వరలో జాతీయ పార్టీ.. విధివిధానాలు రూపొందిస్తున్నామన్న కేసీఆర్‌

Karnataka Ex CM Kumaraswamy meet KCR: మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించామని.. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్.డి కుమారస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్ అపార అనుభవం దేశానికి ఎంతో అవసరం ఉందని కుమారస్వామి అన్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే సంపూర్ణ మద్దతిస్తామన్న కుమారస్వామి: కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందునడుస్తూ, క్రియాశీలక భూమిక పోషించాలని, దానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని చెప్పారు. వర్తమాన జాతీయ రాజకీయాలు, దేశ పాలనలో ప్రత్యామ్న్యాయ శూన్యత నెలకొన్నదని కుమారస్వామి అభిప్రాయపడ్డారు .

కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి ప్రగతిభవన్​లో జాతీయ రాజకీయాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పాలనపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని కుమారస్వామి అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ అవసరమున్నదని ఆయన పేర్కొన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ అజెండాపై ఇద్దరు నేతలు చర్చించారు.

భాజపా విధ్వంసకర రాజకీయ ఎత్తుగడలను అడ్డుకోవాలన్న నేతలు: భాజపా విధ్వంసకర రాజకీయ ఎత్తుగడలను అడ్డుకోకపోతే.. దేశంలో రాజకీయ, పాలనా సంక్షోభం తప్పదని కేసీఆర్, కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సకల వర్గాలను కలుపుకపోతూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. మౌలిక సమస్యలను గాలికొదిలి, భావోద్వేగాలతో పబ్బం గడుపుకొనే భాజపా పాలనకు చరమగీతం పాడాలని పేర్కొన్నారు.

అందుకోసం రాబోయే సార్వత్రిక ఎన్నికలనే వేదికగా మలచుకోవాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. దేశంలో 75 ఏళ్లుగా సాగుతున్న మూస రాజకీయాలకు ప్రజలు విసిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని.. వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగిన చైతన్య వంతమైన పాలన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారని నేతలిద్దరూ చర్చించారు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు అభివృద్ధి దిశగా వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను.. వివిధ రాష్ట్రాల పర్యటనలపై కుమారస్వామికి కేసీఆర్ వివరించారు.

త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన: ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించామని.. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని కుమారస్వామికి కేసీఆర్ తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోందని కుమారస్వామికి కేసీఆర్ వివిరించారు.

భాజపాపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారు: మతతత్వ భాజపా, మోదీ ప్రజావ్యతిరేక, నిరంకుశ వైఖరిపై పోరాడాలని హర్షధ్వానాలు, నినాదాలతో జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారని కేసీఆర్ తెలిపారు. ప్రగతిపథంలో నడుస్తున్న తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్న భాజపాపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా పలు రైతు సంఘాల నేతలు ఇటీవలే రాష్ట్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పర్యటించారని కుమారస్వామికి సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీరు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు తెలుసుకొని ఆశ్చర్యపోయిన రైతు నేతలు.. తమకూ రైతు సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి పథకాలు కావాలని అన్నారని చెప్పారు. దానికోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి రైతు రాజ్య స్థాపనకు కృషి చేయాలని డిమాండ్ చేశారని కేసీఆర్ వివరించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం దేశీయ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోందని ఇద్దరు నేతలు మండిపడ్డారు.

అన్నిరంగాలను భాజపా అధోగతిపాలు చేస్తుంది: భాజపావ్యవసాయ రంగాన్నే కాకుండా ఆర్థిక, సామాజిక తదితర అన్నిరంగాలను అధోగతిపాలు చేస్తూ భాజపా రోజురోజుకూ దిగజారుతోందని చర్చించారు. దేశంలో విచ్చిన్నకర ధోరణులు రోజు రోజుకు ప్రబలుతున్నందున.. ప్రజల మధ్య విభజన సృష్టించే కుట్రలను సమష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ వివరించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రమాదకర, స్వార్థ, రాజకీయ పంథాను అనుసరిస్తోందని ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా భాజపా ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు: ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్, కుమారస్వామి స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామిక సమాఖ్య స్పూర్తిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరముందని అన్నారు. దేశవ్యాప్తంగా భాజపా ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్న కుమారస్వామి.. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు.

భాజపాకు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లింది: భాజపాకు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని, ఆ పార్టీ నాయకత్వంపై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి ఫరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత నేటి దేశ రాజకీయాల్లో తక్షణ అవసరమని చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జాతీయ పార్టీని ఏర్పాటు చేసి.. భాజపాను ఇంటికి పంపించాలని తెరాస నేతలు కూడా ముక్తకంఠంతో తీర్మానాలు చేస్తున్నారని కేసీఆర్​ పేర్కొన్నారు .

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details