ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Boycott: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన బాట..సోమవారం విధుల బహిష్కరణ

By

Published : Jan 8, 2022, 2:46 PM IST

Updated : Jan 8, 2022, 8:48 PM IST

అన్ని సచివాలయాల్లో విధులు బహిష్కరణ
అన్ని సచివాలయాల్లో విధులు బహిష్కరణ

14:43 January 08

అన్ని సచివాలయాల్లో విధులు బహిష్కరణ

Boycott Duties: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ప్రోబేషన్‌ డిక్లరేషన్.. 8 నెలలు పొడిగించటంపై వార్డు సచివాలయ కార్యదర్శులు మండిపడుతున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించి కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తామని.. రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రకటించారు.

ప్రొబేషనరీ డిక్లరేషన్‌ పొడిగించటాన్ని వ్యతిరేకిస్తున్నామని శ్రీనివాసరావు అన్నారు. కొందరు అధికారులు ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని.. విధులు బహిష్కరిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

"సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో విధులు బహిష్కరిస్తాం. కలెక్టర్లకు వినతిపత్రం అందజేస్తాం. ప్రొబేషనరీ డిక్లరేషన్‌ మరో 8 నెలలు పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. కొందరు అధికారులు ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. విధులు బహిష్కరిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు." -శ్రీనివాస రావు, గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్‌ రాష్ట్ర అధ్యక్షుడు

వెంటనే ప్రొహిబిషన్ డిక్లరేషన్ చేయాలని కోరాం..

తమ సమస్యలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు వివరించినట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత బి.అంకమ్మరావు వెల్లడించారు. ఇవాళ సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డితో సమావేశమై.. వెంటనే ప్రొహిబిషన్ డిక్లరేషన్ చేయాలని కోరినట్లు తెలిపారు. అర్హత ఉన్న వారి విషయం పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశాన్ని సోమవారం నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సీఎం ప్రకటనపై ఆందోళన..

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ఫిట్‌మెంట్‌ సహా కీలక అంశాలపై ప్రకటన చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్‌, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. సవరించిన రెగ్యులర్‌ జీతాలను ఈ ఏడాది జులై నుంచి ఇస్తామని తెలిపారు. ఈ నిర్ణయంపై వార్డు సచివాలయ కార్యదర్శులు మండిపడుతున్నారు. రెండేళ్ల శిక్షణ కాలం పూర్తైనా క్రమబద్ధీకరించకుండా.. ప్రోబేషన్‌ డిక్లరేషన్​ను 8 నెలలు పొడిగించటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి

సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో.. నేడు ఉద్యోగ సంఘాల భేటీ

Last Updated :Jan 8, 2022, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details