ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఎవరైనా చంపడానికి వస్తే.. చంపే హక్కు మాకుంది'

By

Published : Jan 24, 2021, 7:56 AM IST

మనల్ని చంపడానికి ఎవరైనా వస్తే.. ప్రాణాలు కాపాడుకునేందుకు వారిని చంపే హక్కు రాజ్యాంగం మనకు కల్పించిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా టీకా ఇచ్చేవరకూ ప్రభుత్వోద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని శనివారం ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఆయన స్పష్టం చేశారు.

ఎవరైనా చంపడానికి వస్తే.. చంపే హక్కు మాకుంది
ఎవరైనా చంపడానికి వస్తే.. చంపే హక్కు మాకుంది

స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనమని ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఇది తమ ప్రాణాలకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. 'స్థానిక ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు. కానీ మాకు రక్షణ కల్పించాల్సిన అవసరముంది. టీకా ఇచ్చేవరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోం. ముందుకొచ్చే ఉద్యోగులతో ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహించొచ్చు. మా హక్కును సుప్రీంకోర్టు నిరాకరించబోదని భావిస్తున్నాం.' అని వెల్లడించారు. ఈ అంశంపై ఇతర ఉద్యోగ సంఘాల నాయకులూ మాట్లాడారు.

ఎన్నికల బహిష్కరణకు వెనుకాడబోం

ఉద్యోగుల శవాలపై ఎన్నికలు నిర్వహిస్తారా..? అవసరమైతే ఎన్నికల బహిష్కరణకు, సమ్మెకు వెనకాడబోం. ఎన్నికల విధుల్లో పాల్గొనకపోతే దుష్పరిణామాలు ఉంటాయని ఎస్‌ఈసీ హెచ్చరించడం సరికాదు. ఎంత మందిపై చర్యలు తీసుకుంటారు? కరోనా భయంతో ఆయన అద్దం చాటు నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మరి ఉద్యోగుల ప్రాణాలంటే లెక్క లేదా? ఎన్నికలకు రెండున్నరేళ్లుగా లేని తొందర ఈ 2 నెలల్లోనే ఎందుకు? జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో ఎంతోమంది ఉద్యోగులకు కరోనా సోకింది. కేరళలోనూ అదే పరిస్థితి. టీకా తీసుకున్నాకే ఎన్నికల విధుల్లో పాల్గొంటాం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం.

- చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు

ప్రాణాలను పణంగా పెడతారా?

ఎన్నికల కమిషనర్‌ తన పంతం కోసం ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టాలనుకుంటున్నారా? ఎస్‌ఈసీ మనసులో ఏముంది? ఉద్యోగులకు టీకా వేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఎస్‌ఈసీ చెప్పారు. దానిపై భరోసా ఏది..? మా ఇబ్బందుల్ని ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోవాలి. త్వరలోనే కమిషనర్‌ను కలిసి మా ఇబ్బందులను వివరిస్తాం.

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌

కరోనా భయం ఉండదా..?

కమిషనరు అద్దం చాటున మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా భయం ఉండదా..? ఉద్యోగుల మనోగతాన్నే సీఎస్‌ చెప్పారు. దానిని ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్యోగ సంఘాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

- సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలపై తొలగని ప్రతిష్టంభన

TAGGED:

ABOUT THE AUTHOR

...view details