ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆడుకుంటూ అడవిలోకి చిన్నారి.. 36 గంటల తర్వాత తల్లిదండ్రుల చెంతకు

By

Published : Apr 19, 2022, 7:58 AM IST

Kid found in Forest: ఆడుకుంటూ తనకు తెలియకుండానే ఆ చిన్నారి అడవిలోకి వెళ్లింది. దాదాపు 36 గంటల పాటు అడవిలో ఒక్కతే ధైర్యంగా గడిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాపను వెతికిపట్టుకున్న పోలీసులు ఆమెను అమ్మానాన్న చెంతకు సురక్షితంగా చేర్చారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది.

Kid found in Forest
ఆడుకుంటూ అడవికి చేరిన చిన్నారి

Kid found in Forest: చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ చిన్మారిని పోలీసులు అడవిలో నుంచి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆ పాప టార్జన్ మాత్రం కాదు. అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం నగరంలోని ఓ చిన్నారి అదృశ్యమైనట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టగా..వనంలో వారికి చిన్నారి చిక్కింది. అర్బన్‌ సీఐ శ్రీధర్‌ కథనం మేరకు.. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట గ్రామానికి చెందిన మణి, కవితల కుమార్తె జోషిక(4) శనివారం సాయత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. చుట్టుపక్కలా గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో రాత్రంతా వెతికారు. ఇంటి సమీపంలోని నాలుగు నీటి కుంటల్లో అగ్నిమాపక శాఖ ద్వారా నీరు తోడించారు. డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా బాలిక దుస్తులు చూపగా ఆ జాగిలం అటవీ ప్రాంతంలో ఆగింది. దీంతో అటవీ ప్రాంతంలో గాలించి అంబాపురం అటవీ ప్రాంతంలో పాపను గుర్తించారు.

నాలుగేళ్ల పాప అంతటి అడవిలో 36 గంటల పాటు ధైర్యంగా గడిపిందని, ఎండతీవ్రత కారణంగా వడదెబ్బకు అలసటగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని సీఐ తెలిపారు. ముళ్లచెట్లు గీసుకొని చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని, పాప ఆరోగ్యం సాధారణంగానే ఉందని వివరించారు. ఎస్సైలు ఉమామహేశ్వర్‌రెడ్డి, శివకుమార్‌, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :బంజారాహిల్స్ భూవివాదం కేసులో 58 మంది అరెస్టు.. ఏ-5గా టీజీ వెంకటేశ్‌

ABOUT THE AUTHOR

...view details