ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంటాం'

By

Published : May 21, 2022, 10:28 PM IST

Updated : May 22, 2022, 2:13 AM IST

అనంత ఉదయ్‌భాస్కర్‌
అనంత ఉదయ్‌భాస్కర్‌

22:25 May 21

అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మారుస్తున్నాం: ఎస్పీ

సంచలనంగా మారిన ఎమ్మెల్సీఅనంత ఉదయ్‌భాస్కర్‌ (అనంతబాబు) మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎట్టకేలకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు స్పందించారు. ఈ కేసులో అనంతబాబును ప్రధాన నిందితుడిగా భావిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అనుమానాస్పద కేసు నుంచి హత్య కేసుగా మారుస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎమ్మెల్సీ అనంతబాబుపై అనుమానం ఉందని కుటుంబసభ్యులు అంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. అయితే అవగాహన లోపంతో బంధువులు శవపరీక్షకు సహకరించడం లేదన్నారు. శవపరీక్ష చేశాక మృతికి అసలు కారణం తెలుస్తుందన్నారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డీజీపీ ఆదేశించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం మృతి కేసులో అనేకమందిని ప్రశ్నిస్తామన్నారు. అనంతబాబుపై సెక్షన్‌ 302, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతబాబును వెంటనే అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు తెలిపారు. ఎమ్మెల్సీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీని అరెస్టు చేయడంతో పాటు బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇదీ జరిగింది : కాకినాడలో వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం ఎలా మృతి చెందాడన్నది అంతుచిక్కడం లేదు. స్వయంగా ఎమ్మెల్సీనే తన కారులో సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లడం, ప్రమాదం జరిగిందని అర్ధరాత్రి కుటుంబసభ్యులకు చెప్పడం, కొద్దిసేపటి తర్వాత కారు వెనుకసీటులో మృతదేహాన్ని తీసుకురావడం అనుమానాలకు కారణమవుతున్నాయి. మృతదేహాన్ని తీసుకోవడానికి సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు నిరాకరించగా... ఎమ్మెల్సీ వారిని బెదిరించి, కారు అక్కడే వదిలేసి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ మాజీ డ్రైవర్​ది హత్యా..? ప్రమాదమా..?

Last Updated :May 22, 2022, 2:13 AM IST

ABOUT THE AUTHOR

...view details