ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PADAYATRA:మహాపాదయాత్రకు బ్రహ్మరథం.. వికేంద్రీకరణ అంటే 3 రాజధానులు కాదన్న ఎంపీ గల్లా జయదేవ్‌

By

Published : Dec 13, 2021, 5:40 AM IST

AMARAVATI MAHA PADAYATRA: ఏకైక రాజధానే లక్ష్యంగా అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర తుదిఘట్టానికి చేరుకుంది. నేడు కలియుగ దైవం వెంకటేశ్వరుడి పాదాల చెంతన ఉన్న తిరుపతి పట్టణానికి అన్నదాతలు చేరుకోనున్నారు. 42 వ రోజున రాజధాని రైతులు, మహిళలకు అడుగడుగునా స్థానికులు సాదర స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ... రాయలసీమ వాసులు బ్రహ్మరథం పట్టారు. మరో వైపు 17వ తేదీ బహిరంగ సభ నిర్వహణ కోసం నేడు అన్నదాతలు న్యాయస్థానాన్ని అశ్రయించనున్నారు.

AMARAVATI MAHA PADAYATRA
అమరావతి మహాపాదయాత్ర

నేడు రేణిగుంట నుంచి తిరుపతి వరకు సాగనున్న పాదయాత్ర

AMARAVATI MAHA PADAYATRA: 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి వారధైన రాజధాని అమరావతి కోసం అన్నదాతలు చేస్తున్న మహాపాదయాత్ర 43 వ రోజుకు చేరుకుంది. అవమానాలు, అవహేళనలు, ఆంక్షలు, అడ్డంకుల్ని దాటుకుంటూ కదం తొక్కుతున్న రాజధాని రైతుల యాత్ర 42వ రోజు జైత్రయాత్రను తలపించింది. అంజిమేడు,దిగువ మల్లవరం, ఆర్‌ మల్లవరం, వెదల్లచెరువు రేణిగుంట.. ఇలా ప్రతి చోట స్థానికులు రైతులకు ఘన స్వాగతం పలికారు. రాయలసీమ భవిష్యత్తు బాగుండాలంటే అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని ఎస్వీయూ విద్యార్థులు స్పష్టం చేశారు. మహిళా రైతులకు పలువురు మోకాళ్లపై కూర్చుని సంఘీభావం తెలిపారు. అన్నదాతల కాళ్లకు పాదాభివందనం చేశారు.
Maha Padayatra in chittoor district: పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు నగరి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు తరలివచ్చారు. తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం తోపాటు వివిధ సంఘాల నేతలు రైతుల యాత్రలో పాలుపంచుకున్నారు. కడపతో పాటు ఇతర జిల్లాల అన్నదాతలు రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజధాని రైతుల్ని కలిసి సంఘీభావం ప్రకటించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానుల ఏర్పాటు కాదని...అన్ని ప్రాంతాలకు ప్రాజెక్టులు తెచ్చి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని జయదేవ్‌ స్పష్టం చేశారు.

వినూత్న స్వాగతం..

మహాపాదయాత్ర దిగువ మల్లవరం చేరుకున్న సమయంలో అక్కడ రైతులు వినూత్నంగా స్వాగతం పలికారు. స్వాగతం పలుకుతున్న వారిని చూస్తూ ముందుకు నడిచేప్పుడు కొంత పక్కకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పక్కకు తోయడంతో కొంత వాగ్వాదం తలెత్తింది. గత 42 రోజులుగా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ముందుకు సాగుతున్నామని రైతులు పేర్కొన్నారు. ఇదే సమయంలో రైతులతో అక్కడే ఉన్న రేణిగుంట సీఐ అంజూయాదవ్‌తోపాటు పోలీసులు స్వల్ప వాగ్వాదానికి దిగారు. చేతిలో ఉన్న అంబేడ్కర్‌ బొమ్మను చూపిస్తూ రైతులు... ఆయన రచించిన రాజ్యాంగాన్ని సైతం అవహేళన చేస్తున్నారని వాపోయారు.

విశ్రాంత రైతు విరాళం...

అనంతపురం జిల్లా ఇల్లూరుకు చెందిన విశ్రాంత రైతు ఎన్​. వెంకటపతి.. మహాపాదయాత్రకు మద్దతు తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్ శివారెడ్డికి రూ. లక్ష చెక్కును విరాళంగా అందించారు. అదే గ్రామానికి చెందిన ప్రసాద్​ పంపించిన రూ.10,116 చెక్కును ఆయన ఇచ్చారు.

నేడు తిరుపతికి చేరునున్న యాత్ర..

Today Maha Padayatra: నేడు రేణిగుంటలో ప్రారంభం కానున్న మహాపాదయాత్ర.. ఆటోనగర్, మీదుగా తిరుపతి పట్టణానికి చేరుకోనుంది. దాదాపు 12కిలోమీటర్ల మేర నడవనున్న రైతులు రాత్రికి రామానాయుడు కళ్యాణమండపంలో బసచేయనున్నారు. రేపు తిరుపతి పట్టణ వీధుల మీదుగా అలిపిరి చేరుకోవడంతో పాదయాత్ర ముగియనుంది. దీంతో అక్కడ ఉన్న రైతులు చేతిలో ఉన్న అంబేడ్కర్‌ బొమ్మను చూపిస్తూ ఆయన రచించిన రాజ్యాంగాన్ని సైతం అవహేళన చేస్తున్నారని అన్నారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details