ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ramappa Temple: 'రామప్ప ఆలయంలో యునెస్కో షరతుల అమలుకు చర్యలు'

By

Published : Jan 7, 2022, 9:46 AM IST

Ramappa Temple: రామప్ప ఆలయం విషయంలో యునెస్కో షరతుల అమలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. రామప్ప ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి విధించిన షరతుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది.

Ramappa Temple
Ramappa Temple

ప్రపంచ స్థాయి కట్టడంగా తెలంగాణలోని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి విధించిన షరతుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. యునెస్కో షరతుల్లో భాగంగా పాలంపేట ప్రత్యేక ప్రాంత అభివృద్ది మండలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపింది. పాలంపేట అభివృద్ది మండలి ఏర్పాటుకు సెప్టెంబర్ వరకు గడువు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

యునెస్కో షరతుల అమలుపై కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రాష్ట్రానికి చెందిన పురావస్తు, పర్యాటక శాఖ, ములుగు కలెక్టర్ తదితర అధికారులతో సమావేశమై చర్చిస్తున్నట్లు పేర్కొంది. గత నెల 16న రాష్ట్ర అధికారులతో జరిగిన సమావేశంలో అన్ని అంశాలపై చర్చించినట్లు చెప్పారు. రామప్ప దేవాలయంలో సౌకర్యాల కల్పనలో భాగంగా నడకదారిలో లైట్లు ఏర్పాటు పూర్తిచేశామని తెలిపారు. కామేశ్వరాలయ పనులకు టెండర్ల కార్యక్రమం పూర్తయిందని, జనవరిలో పనులు ప్రారంభమవుతాయని తెలిపింది.

రామప్ప ఆలయానికి ప్రపంచ స్థాయి కట్టడంగా దక్కిన గుర్తింపును నిలబెట్టుకోవాలంటే యునెస్కో పేర్కొన్న షరతులను పూర్తి చేయాల్సి ఉంటుందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఈ పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావు రామప్ప దేవాలయం అభివృద్ది పనులకు సంబంధించి స్థాయి నివేదికను సమర్పించినట్లు తెలిపారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం విచారణను జూన్ 9కి వాయిదా వేస్తూ తదుపరి విచారణకు స్థాయి నివేదికను సమర్పించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఇదీ చూడండి:TG HIGH COURT: 'రామప్ప కట్టడం అభివృద్ధి, నిర్వహణను స్వయంగా పర్యవేక్షిస్తాం'

ABOUT THE AUTHOR

...view details