ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హెల్త్​ యూనివర్సిటీ పేరు మార్పు.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా రిలే నిరాహార దీక్షలు

By

Published : Sep 28, 2022, 7:17 PM IST

Etv Bharat

TDP leaders Hunger Strike: విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు మార్పు నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా తెదేపా శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వర్శిటీ పేరు మార్పు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని తెదేపా నేతలు డిమాండ్​ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

TDP Leaders Hunger Strike All Over Ap: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలు చోట్ల తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, విశాఖ జిల్లా భీమునిపట్నం, నంద్యాల జిల్లా సున్నిపెంట, విజయనగరం జిల్లా రాజాంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసనలు, రిలే నిరాహార దీక్షలకు దిగారు.

విశాఖ జిల్లాలో..:విశాఖ జిల్లా భీమునిపట్నంలో చిన్న బజార్ జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భీమునిపట్నం నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పు చేస్తూ తెచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని రాజబాబు డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేసే వరకు రోజుకో రీతిలో వినూత్నంగా నిరసనలు చేపడతామన్నారు. విశిష్ట వ్యక్తుల సేవలకు చిహ్నంగా సంస్థలకు వారి పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తొందని.. అటువంటి సాంప్రదాయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేరు మార్చి భవిష్యత్​ తరాలకు ఏం చెప్పాలనుకున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మార్పు జీవోను వెనక్కి తీసుకునే వరకు తగ్గేది లేదన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో తెదేపా నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో ఐదు రోజుల రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ప్రజలకు విలువైన సేవలు అందిస్తున్న విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్నారు. కొత్తగా నిర్మాణాలు చేపట్టి వాటికి తన కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవాలన్నారు. అమరులైన వారు పేర్లను మార్చడం సరికాదని ఆయన అన్నారు.

నంద్యాల జిల్లాలో.. శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో తెదేపా నాయకులు నిరసనకు దిగారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మారుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు. ముఖ్యమంత్రి పొంతనలేని వాదనను తెరమీదకి తీసుకువచ్చి విశ్వవిద్యాలయం పేరును మార్చారని తెదేపా నాయకులు తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుని యథావిధిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లాలో..రాజాంలో అంబేద్కర్ కూడలి వద్ద ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడంపై నిరసనగా మాజీ మంత్రి, తెదేపా రాజాం నియోజకవర్గ ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పేరు మార్చి వైయస్​ఆర్ పేరు పెట్టి తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించకుండా.. ప్రాంతాల మధ్య, కులాల మధ్య జగన్​మోహన్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఒక్క వైకాపా నాయకుడు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెదేపా హయాంలో పోలవరం సగం పూర్తిచేస్తే.. వైకాపా అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలైనా పోలవరం ఇంతవరకు ఏమీ చేయలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. దిల్లీలో ప్రధానిమోదీ కాళ్లపై పడుతున్నారని విమర్శించారు. కేసుల మాఫీ కోసం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని.. బీహార్ కంటే ప్రమాదకరంగా రాష్ట్రం తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని అనడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీకి యధాస్థితిగా కొనసాగించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కొండ్రు మురళీమోహన్ హెచ్చరించారు.

రాష్ట్రంలో తెదేపా రిలే నిరహార దీక్షలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details